Love in Vietnam: చైనాలో పది వేల‌ స్క్రీన్స్ లో.

ABN , Publish Date - Sep 02 , 2025 | 04:24 PM

బీటౌన్‌లో అత‌డో చిన్న హీరో! కానీ ఇప్పుడు ఏకంగా గ్లోబ‌ల్ మార్కెట్‌నే టార్గెట్ చేస్తున్నాడు. స్టార్ హీరోలే నోరెళ్లబెట్టే రేర్ ఫీట్‌కు రెడీ అవుతున్నాడు. అస‌లు అత‌నిలో ఏం న‌మ్మారో తెలియ‌దు కానీ అప్ క‌మింగ్ మూవీ కోసం చేస్తున్న ప్రయ‌త్నాలు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారుతున్నాయి.

హిందీ సినిమాల‌కు చైనాలో మంచి ఆద‌ర‌ణే ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు అక్కడ బాగా ఆడుతుంటాయి. మిస్టర్ ప‌ర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ (Aamir Khan) న‌టించిన 'దంగ‌ల్' (Dangal) , 'సీక్రెట్ సూప‌ర్ స్టార్' (Secret Superstar ) సినిమాలైతే బ్లాక్ బ‌స్టర్లుగా నిలిచాయి. 'దంగ‌ల్' భార‌త‌దేశంలో రూ. 400 కోట్లు వ‌సూలు చేయ‌గా, చైనా నుంచి రూ. 1200కోట్లు పైగా వ‌సూలు చేయ‌డం అప్పట్లో సంచ‌ల‌నం రేపింది. 'సీక్రెట్ సూప‌ర్ స్టార్' కూడా చైనా నుంచి భారీ వ‌సూళ్లను సాధించింది. దీంతో చాలా మంది స్టార్ హీరోలు త‌మ సినిమాల‌ను అక్కడ భారీ ఎత్తున రిలీజ్ చేస్తూ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటూ ఉన్నారు. స్టార్ హీరోలు అంటే ఒకే.. కానీ ఇప్పుడు ఒక చిన్న హీరో, అది కూడా అంత‌గా ఓవ‌ర్సీస్ లో గుర్తింపు లేని హీరో న‌టించిన సినిమాని చైనాలో భారీ ఎత్తున రిలీజ్ చేయ‌డం ఆశ్చర్యాన్ని క‌లిగిస్తోంది.


ఆలియాభట్ న‌టించిన 'గంగూభాయి క‌థియావాడీ' (Gangubai Kathiawadi ) చిత్రంలో న‌టించిన శంత‌ను మిశ్రా (Shantanu Mishra) న‌టించిన 'లవ్ ఇన్ వియత్నాం' (Love in Vietnam) మేకర్స్ భారీ సాహసం చేస్తున్నారు. అవ్ నీత్ కౌర్ ( Avneet Kaur) హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీని ఇప్పుడు చైనాలో ఎవ‌రూ ఊహించ‌ని స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఏకంగా 10వేల‌ స్క్రీన్లలో ప్రద‌ర్శితం కానున్న మొదటి భారతీయ చిత్రంగా 'ల‌వ్ ఇన్ వియ‌త్నాం' రికార్డుల‌కెక్కుతోంది. చైనాలో పాపుల‌ర్ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ షాంఘై వై.సి. (Shanghai YC) మీడియా అండ్ ఫిల్మ్ ఈ చిత్రం థియేటర్ విడుదల హక్కులను కొనుగోలు చేసి రిలీజ్ చేస్తోంది.

రాహత్ షా క‌జ్మీ ( Rahhat Shah Kazmi) ద‌ర్శక‌త్వం వ‌హించిన‌ 'ల‌వ్ ఇన్ వియ‌త్నాం' మూవీ.. వియ‌త్నాంతో పాటు పంజాబ్ లో మెజారిటీ షూటింగ్ జ‌రుపుకుంది. 1943లో సబాహట్టిన్ అలీ రాసిన టర్కిష్ నవల 'మడోన్నా ఇన్ ఎ ఫర్ కోట్' ఆధారంగా రూపొందించారు. ఇందులో వియత్నాంకు చెందిన నటి ఖాన్గన్, ఫరీదా జలాల్, రాజ్ బబ్బర్ వంటి వారు న‌టించారు. ఇది సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదల కానుండ‌గా.. చైనాలో మాత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ చివరివారంలో విడుద‌ల కానుంది. మ‌రి చైనాలో ఈ సినిమా ఎలాంటి రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.

Read Also: OG Movie: డియర్ ఓజి.. నిన్ను కలవాలని.. మాట్లాడాలని.. నిన్ను చంపాలని..

Read Also: AP Deputy CM: మీ సేవా గుణమే జనసేన పార్టీకి స్ఫూర్తి

Updated Date - Sep 02 , 2025 | 04:24 PM