Janhvi Kapoor: దేశంలో ప్రతిభావంతులైన నటుల్లో ఒకడు.. కానీ గుర్తింపు రాలేదు..
ABN, Publish Date - Sep 13 , 2025 | 02:52 PM
జాన్వీకపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హోమ్‌బౌండ్’. నీరజ్ గెవాన్ దర్శకత్వంలో కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించారు.
జాన్వీకపూర్(Janhvi Kapoor), ఇషాన్ ఖట్టర్ (Ishaan Khatter), విశాల్ జెత్వా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హోమ్‌బౌండ్’ (home bound) . నీరజ్ గెవాన్ దర్శకత్వంలో కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించారు. మే 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందకొచ్చింది. విడుదలకు ముందే ఈ సినిమా ఎన్నో ఘనతలు సాధించింది. కేన్స్‌లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇటీవల ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్’(ఐఎఫ్‌ఎఫ్‌ఎం)లో ఉత్తమ చిత్రంతోపాటు ఉత్తమ దర్శకుడిగా నీరజ్ గైవాన్ పురస్కారాన్ని అందుకున్నారు. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో జాన్వీకపూర్ సినిమా, ఇషాన్ ఖట్టర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
‘‘హోమ్‌బౌండ్’ గొప్ప కథ. అందుకే ఈ చిత్రం నా కెరీర్‌కు ఉపయోగపడుతుందా.. లేదా అని ఆలోచించకుండానే అంగీకరించాను. ‘షూటింగ్‌లో ప్రతి సన్నివేశంపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. దీన్ని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించినప్పుడు వచ్చిన స్పందన చూసి షాక్ అయ్యాం. ఈ సినిమా ప్రేక్షకులపై ఎంత ప్రభావం చూపిందో మాకు అర్థమైంది. ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా చేసినందుకు ప్రేక్షకులు నన్ను ట్రోల్ చేస్తారేమో అనే భావన నాకు కలగలేదు’ అని జాన్వీకపూర్ అన్నారు.
మా టీమ్‌లో అందరూ అంతర్జాతీయ గుర్తింపునకు అర్హులు. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన ఇషాన్ దేశంలోని ప్రత్ఘిభావంతులైన నటులలో ఒకడు. కానీ, అతడికి భారతీయ సినిమాలో ఇప్పటి వరకూ సరైన గుర్తింపు రాలేదు.కేన్స్ వేదికపై ఇషాన్‌ను చూడడం, ప్రపంచం అతడి నటనను ప్రశంసించడం చూసి నేనెంతో ఆనందించా. కష్టపడి పనిచేసే వారికి ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందని నాకు అర్థమైంది’ అన్నారు.