Do Bigha Zamin: పాత చిత్రాలకు కొత్త నగిషీలు

ABN , Publish Date - Jul 15 , 2025 | 10:16 AM

మన తెలుగునాట స్టార్ హీరోస్ బర్త్ డేస్ కు వారి సూపర్ హిట్ మూవీస్ ను రీస్టోర్ చేసి రీరిలీజ్ చేయగా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. హిందీ సినిమారంగంలో క్లాసిక్స్ గా నిలచిన చిత్రాలు సరికొత్త హంగులతో ముందు అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించేందుకు విదేశాల్లో విడుదలవుతున్నాయి.

పాత చిత్రాలకు కొత్త నగిషీలు చెక్కుతున్నారు. ఎప్పుడో ఆరీ కెమెరాలతో తీసిన సినిమాలకు ఇప్పుడు డిజిటల్ టచ్ ఇస్తున్నారు. మొన్న సత్య జిత్ రే (Satyajit Ray) క్లాసిక్ 'అరణ్యేర్ దిన్ రాత్రి' (Aranyer Din Ratri)ని రీస్టోర్ చేసి కాన్స్ లో ప్రదర్శించారు. ఆ సినిమాకు లభించిన అప్లాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక 1975 కల్ట్ క్లాసిక్ 'షోలే' (Sholay)ను డైరెక్టర్స్ కట్ తో డిజిటల్ ఫార్మాట్ లో రీస్టోర్ చేసి ఇటీవలే ఇటలీలో జనం ముందు నిలిపారు. మూడున్నర గంటలకు పైగా సాగిన 'షోలే'ను చూడటానికి ఇటలీవాసులు సైతం పోటీ పడడం గమనార్హం! ఇప్పుడు అదే రూటులో సాగుతూ బిమల్ రాయ్ (Bimal Roy) తెరకెక్కించిన 'దో బిఘా జమీన్' (Do Bigha Zamin) రిస్టోర్ తో జనాన్ని అలరించేందుకు సిద్ధమయింది.


మన తెలుగునాట స్టార్ హీరోస్ బర్త్ డేస్ కు వారి సూపర్ హిట్ మూవీస్ ను రీస్టోర్ చేసి రీరిలీజ్ చేయగా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. హిందీ సినిమారంగంలో క్లాసిక్స్ గా నిలచిన చిత్రాలు సరికొత్త హంగులతో ముందు అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించేందుకు విదేశాల్లో విడుదలవుతున్నాయి. తరువాతే మన దేశంలోని అభిమానులను మురిపించడానికి వస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఆడియెన్స్ సైతం ఇండియన్ క్లాసిక్స్ ను చూడడం ఓ హాబీగా మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 'దో బిఘా జమీన్' సినిమాను 'ఫిలిమ్ హెరిటేజ్ ఫౌండేషన్' రిస్టోర్ చేసింది. ఈ చిత్రాన్ని వెనిస్ ఫిలిమ్ ఫెస్టివల్ లో ప్రదర్శించడానికి సిద్ధం చేశారు. ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు అంటే 11 రోజుల పాటు సాగే 82వ వెనిస్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ లో బిమల్ రాయ్ 'దో బిఘా జమీన్' ప్రదర్శితం కానుంది. మరో విశేషమేంటంటే 1954లో కాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో అవార్డ్ పొందిన తొలి భారతీయ చిత్రంగా నిలచింది 'దో బిఘా జమీన్'. జూలై 12వ తేదీన బిమల్ రాయ్ 116వ జయంతి పూర్తయింది. ఈ సందర్భంగానే ఆయన క్లాసిక్ 'దో బిఘా జమీన్'ను రీస్టోర్ చేయడం విశేషం. ఈ సినిమా నెగటివ్ ను బ్రిటిష్ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ నుండి సంపాదించి మరీ రీస్టోర్ చేయడం గమనార్హం!

'దో బిఘా జమీన్'తో పాటు బిమల్ రాయ్ రూపొందించిన 'బందిని', 'దేవ్ దాస్', 'మధుమతి' చిత్రాలను కూడా రీస్టోర్ చేయనున్నట్టు 'ఫిలిమ్ హెరిటేజ్ ఫౌండేషన్' ప్రతినిధులు తెలిపారు. అప్పటి దాకా స్టూడియో సెట్స్ లో సింహభాగం షూటింగ్స్ జరుపుకున్న హిందీ చిత్రాలు, 'దో బిఘా జమీన్' తరువాత నుంచీ సహజత్వం ఉట్టిపడేందుకు ఔట్ డోర్ బాట పట్టాయని సినీపండిట్స్ గుర్తు చేసుకుంటున్నారు. అలాంటి క్లాసిక్ ను ఇప్పుడు రీస్టోరేషన్ లో నగిషీలు చెక్కడం అభినందనీయమనీ వారు అంటున్నారు. ఈ ట్రెండ్ మన టాలీవుడ్ కు కూడా పాకితే ఎన్నో క్లాసిక్స్ రిస్టోరేషన్ తో అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది. పైగా పౌరాణికాలు రూపొందించడంలో తెలుగువారికి సాటి లేరని పేరుంది. అందువల్ల తెలుగు పౌరాణికాలను రీస్టోర్ చేసి అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తే తెలుగు సినిమాకు మరింత గౌరవం లభిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. మరి ఆ దిశగా ఎవరు ముందుగా అడుగులు వేస్తారో చూడాలి.

Also Read: Tuesday Tv Movies: మంగళవారం, జూలై 15.. తెలుగు టీవీ ఛానల్స్‌లో వ‌చ్చే సినిమాలివే

Updated Date - Jul 15 , 2025 | 10:16 AM