Mukul Dev: సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రభాస్, రవితేజ విలన్ కన్నుమూత
ABN, Publish Date - May 24 , 2025 | 12:16 PM
బాలీవుడ్, టాలీవుడ్‌లో ఇండస్ట్రీల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ కన్నుమూశారు.
బాలీవుడ్, టాలీవుడ్‌లో ఇండస్ట్రీల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ముకుల్ దేవ్(Mukul Dev) (54) కన్నుమూశారు. రవితేజ, వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన కృష్ణ సినిమాతో మంచి గుర్తింపు పొందిన ఈ నటుడు ఆ తర్వాత ఏక్ నిరంజన్, కేడీ, అదుర్స్ వంటి సినిమాల్లో ప్రతినాయక పాత్రల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా రవితేజ కృష్ణ సినిమా ఆయనకు విశేషమైన గుర్తింపును తీసుకు వచ్చింది. తెలుగులో ఆయన చివరి చిత్రం 2013లో నాగార్జున హీరోగా నటించిన భాయ్.
సుమారు పాతికేళ్ల క్రితం ఫైలట్ వృత్తికి మధ్యలోనే గుడ్‌బై చెప్పి 1996లో విశ్వ సుందరి సుస్మితసేన్‌కు జంటగా దస్తక్ అనే సినిమాతో హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు హిందీ, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ, ఒక మలయాళంలో అనేక సినిమాలు, సీరియల్స్ లలో నటించాడు.
ఇదిలాఉండగా సింహాద్రి, సీతారాముడు, నాయక్, ఎవడు వంటి సినిమాల్లో విలన్ గా నటించిన రాహూల్ దేవ్ ముకుల్‌కు స్వయానా సోదరుడు. అయితే.. తన తల్లిదండ్రుల మరణంతో కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న ముకుల్ అనుకోకుండా అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందాడు. ఆయన మరణంపై పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.