Ranveer singh: 'దురంధర్'.. స్ట్రీమింగ్ రైట్స్ రూ. 285 కోట్లు! సినిమాకు పెట్టిన ఖర్చు వచ్చేసిందిగా
ABN, Publish Date - Dec 20 , 2025 | 02:49 PM
మూడో శుక్రవారం వసూళ్ళలో 'దురంధర్' అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రం రూ. 500 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. త్వరలోనే ఈ 'దురంధర్' ప్రధాన భారతీయ భాషల్లోకి డబ్ కాబోతోంది.
రణవీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'దురంధర్' (Dhurandhar) ఈ యేడాది ఆల్ టైమ్ హిట్ గా నిలవడానికి తహతహలాడుతోంది. ఈ యేడాది 'కాంతార 2' (Kanthara 2)రూ. 850 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి అగ్రస్థానంలో నిలువగా, 'ఛావా' (Chaava) చిత్రం రూ. 800 కోట్ల గ్రాస్ ను దక్కించుకుంది. దాని వెనుకే 'సయారా' (Saiyara) రూ. 550 కోట్ల వరకూ గ్రాస్ ను పొందింది.
విశేషం ఏమంటే... పదిహేను రోజుల్లో 'దురంధర్' సినిమా మూడో శుక్రవారానికి రూ. 503 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అలానే థర్డ్ ఫ్రైడే కలెక్షన్స్ లో ఈ సినిమా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. 'బాహుబలి 2' (Bahubali 2) హిందీ వర్షన్ మూడో శుక్రవారం రూ. 10.5 కోట్ల గ్రాస్ ను, 'పుష్ప 2' (Pushpa 2) రూ. 12.50 కోట్ల గ్రాస్ ను, 'ఛావా' చిత్రం రూ. 13.30 కోట్ల గ్రాస్ ను అందుకోగా, 'దురంధర్' మూడో శుక్రవారం నాడు రూ. 23.70 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. అతి త్వరలోనే ఈ సినిమా రూ. 600 కోట్ల క్లబ్ లో జాయిన్ కావడం ఖాయం.
'దురంధర్' హిందీ సినిమాను ఇప్పుడు తెలుగు, తమిళతో పాటు ఇతర భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. నిజానికి డిసెంబర్ 19నే దీన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల చేయాల్సింది. కానీ 'అవతార్ : ఫైర్ అండ్ యాష్' ఉన్న కారణంగా మేకర్స్ ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. అన్ని అనుకూలిస్తే, డిసెంబర్ 25 లేదంటే జనవరి 1 లేదా 2వ తేదీన విడుదల చేయడం ఖాయంగా అనిపిస్తోంది. అలా ఈ సినిమాకు ప్రాంతీయ భాషల్లోని కలెక్షన్స్ కూడా జత అయితే... ఈ యేడాది బ్లాక్ బస్టర్ మూవీగా 'దురంధర్' నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఎందుకంటే... 'కాంతార' కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. 'ఛావా' మొదట హిందీలో విడుదలై ఆ తర్వాత ఇతర భాషల్లోకి డబ్ అయ్యింది. 'సయారా' మాత్రం హిందీ భాషకే పరిమితం అయ్యింది. ఇదిలా ఉంటే... 'దురంధర్' మూవీని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ. 285 కోట్లకు స్ట్రీమింగ్ రైట్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఎనిమిది వారాలకు దీన్ని స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ ఉంది.