RGV: బాలీవుడ్‌లో.. మళ్లీ పాదం మోపుతున్న వర్మ! లైన్‌లో.. రెండు భారీ చిత్రాలు
ABN, Publish Date - Oct 24 , 2025 | 12:38 PM
రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్‌కు విరామం ఇచ్చి మళ్లీ బాలీవుడ్‌లో పాదం మోపుతున్నాడు.
తెలుగు, భారతీయ సినీప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma). ఒకప్పుడు సస్పెన్స్, క్రైమ్, హారర్ జానర్స్‌కి కొత్త దశ, దిశ చూపిన దర్శకుడు. క్రియేటివ్ జీనియస్ అనే పేరు సైతం సంపాదించుకున్నాడు.‘శివ’ అంటూ తెలుగు నుంచి ఆరంభించి రంగీలా, ‘సత్య’, ‘కంపెనీ’, ‘రాత్రి’, ‘భూత్’ వంటి సినిమాలతో బాలీవుడ్‌లో తనదైన శైలి సృష్టించారు. అమితాబ్‌బో సర్కార్ వంటి కల్ట్ హిట్ తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయం రుచి చూడలేదు, ఆపై పది,పదిహేను సంవత్సరాలుగా బాలీవుడ్‌కు దూరంగా ఉంటూ తెలుగులో తన ప్రతాపం చూపిస్తూ ఒకదాన్ని మించి మరోటి పరాజయ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇక ఏపీలో టీడీపీ ప్రభుత్వం వచ్చాక కాస్త సల్లబడ్డ ఆర్జీవీ మళ్లీ తన మార్గం మార్చి తిరిగి బాలీవుడ్ పయనం రీ స్టార్ట్ చేశాడు.
ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్య్వూలో వెళ్లడించాడు. “నేను మళ్లీ బాలీవుడ్‌కి వెళ్తున్నాను. త్వరలోనే నా కొత్త హిందీ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఇప్పుడు నా దృష్టి అంతా ఆ ప్రాజెక్టు పైనే ఉంది” అని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో ఆయన అభిమానుల్లో మళ్లీ ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో హిందీలో ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ (Police Station Mein Bhoot) అంటూ పోలీసులతో హారర్ కామెడీ అంటూ కొత్త ప్రయత్నానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో తన అస్థాన నటుడు నటుడు మనోజ్ బాజ్‌పేయి (Manoj Bajpayee) ప్రధాన పాత్రలో కనిపించనుండగా, జెనీలియా డిసౌజా (Genelia) కీలక పాత్ర పోషిస్తుండడ విశేషం.
ఒక పోలీస్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్ ఆత్మగా మారి పోలీసులను ఎలా, ఎందుకు వెంటాడాడు అనే ఆసక్తికరమైన కథతో కామెడీని మేళవించి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ చిత్రంపై మంచి బజ్ సృష్టించింది. గతంలోనే ఆర్జీవీ ‘రాత్రి’, ‘దెయ్యం’, ‘భూత్’ వంటి సినిమాలతో భయాన్ని కొత్త రీతిలో ప్రజెంట్ చేశాడు. ఇప్పుడు అదే జానర్‌లో మరోసారి ‘పోలీస్ స్టేషన్ మే భూత్’తో ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. చూడాలి మరి ఈ చిత్రమైనా విజయం సాధించి ఒకప్పటి రాంగోపాల్ వర్మను తిరిగి తీసుకువస్తుందేమో.
ఇదిలాఉంటే.. ప్రస్తుతం ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ అనే సినిమా చిత్రీకరణ జరుగుతుండగానే సర్కార్ (Sarkar) సీక్వెల్ సైతం పట్టాలెక్కిచేందుకు ఆర్జీవీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వచ్చిన సర్కార్ రెండు చిత్రాలు మంచి విజయం సాధించడమే కాక విమర్శకుల ప్రశంసలు దక్కించుకుని ఆర్జీవీ పని తనాన్నిఓ రేంజ్‌లో మెచ్చుకున్నారు. సర్కార్2లో అభిషేక్ చనిపోవడంతో సినిమా ఎండ్ అవగా ఇక దీనికి సీక్వెల్ రావడం కష్టమే అని అంతా డిసైడ్ అయిపోయారు. సరిగ్గా ఇదే సమయంలో. సడన్‌గా వర్మ బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వడం సర్కార్ సినిమాకు సీక్వెల్ స్టోరీ సైతం రెడీగా ఉందని చెప్పినట్లు వార్తలు వినిపస్తున్నాయి. ఈ కథను అమితాబ్‌కు (Amitabh Bachchan) వివరించినట్లు ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా న్యూస్ వైరల్ అవుతుంది. చూడాలి మరి ఈ వార్తల్లో ఎంత నిజముందనేది.