'రామాయణ్‌’పై మహారాష్ట్ర సీఎం ప్రశంసలు..

ABN, Publish Date - May 05 , 2025 | 02:34 PM

బాలీవుడ్‌లో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్‌ ‘రామాయణ’ (Ramayan) ఇటీవల జరిగిన వేవ్స్‌ సమ్మిట్‌లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ ( Devendra Fadnavis)ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు


బాలీవుడ్‌లో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్‌ ‘రామాయణ’ (Ramayan) ఇటీవల జరిగిన వేవ్స్‌ సమ్మిట్‌లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ ( Devendra Fadnavis)ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత గొప్పది గా నిలిచే చిత్రమని కొనియాడారు. నిర్మాత నమిత్‌ మల్హోత్రాతో కలిసి ఓ చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి నితేశ్‌ తివారీ దర్శకుడు. బీటౌన్‌ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్‌ను వేవ్స్‌ సమ్మిట్‌లో ప్రదర్శించారు.

ఈ సినిమా గురించి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడనవీస్‌ మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో ఎన్నో గొప్ప కథలు తెరకెక్కాయి. మన కళ, నాటక రంగం, సంగీతం చాలా పురాతనమైనవి. వీటికి తాజాగా కొత్త టెక్నాలజీని జోడించాలని అనుకుంటున్నాం. రామాయణ విషయంలో ఇదే జరుగుతోంది. నేను ప్రధానితో కలిసి ఈ సినిమాకు సంబంధించిన సెట్స్‌ను సందర్శించాను. దాని క్వాలిటీ చూసి ఆశ్చర్యపోయాను. కొత్త తరానికి మనం కథలు చెప్పడానికి ఇదే సరైన మార్గం. మీరు తీస్తోన్న సినిమా ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉంటుందని నేను నమ్ముతున్నా’’ అని అన్నారు. ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ నటిస్తున్నారు. సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్‌ కనిపించనున్నారు.  హనుమంతుడిగా సన్నీ దేవోల్‌, కేౖకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కనిపించనున్నట్లు తెలుస్తోంది. రెండు పార్టులుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో పార్ట్‌ విడుదల కానుంది.  

Updated Date - May 05 , 2025 | 02:35 PM