Deepika Padukone: దీపిక పదుకొణె.. ఇక కేంద్రం రాయబారి! దేనికంటే
ABN, Publish Date - Oct 11 , 2025 | 11:01 AM
దీపికాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా దీపికా పదుకొణెను ఇండియాకు అంబాసిడర్‌గా నియమించారు.
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika padukone) ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇండస్ట్రీలో 8 గంటల పనిపై కామెంట్స్ చేయడం అందుకు ఓ కారణం. స్టార్ హీరోలంతా కేవలం 8 గంటలే పని చేస్తున్నారని, తాను కూడా అంతే సమయం పని చేస్తానని తేల్చి చెప్పేసింది. ఇటీవలే కల్కి 2, స్పిరిట్ వంటి రెండు పెద్ద సినిమాల నుంచి ఆమె తప్పుకుంది. అందుకు పారితోషికం కూడా బాగా డిమాండ్ చేసిందని టాక్ నడుస్తోంది. తనతోపాటు తన టీమ్ మొత్తానికి వానిటీ వ్యాన్లు, లగ్జరీ హోటల్స్‌లో వసతులు కల్పించాలని కండీషన్స్ పెట్టినట్లు కూడా ప్రచారం జరిగింది. కారణాలు ఏమైనా గానీ ఆమె ఈ చిత్రాల నుంచి తప్పుకొంది.
తాజాగా దీపికాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా దీపికా పదుకొణెను ఇండియాకు అంబాసిడర్‌గా నియమించారు. ‘ది లివ్ లవ్ లాఫ్’ ఫౌండేషన్ వ్యవస్థ్థాపకురాలైన దీపికాను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మన దేశ మొట్టమొదటి మానసిక ఆరోగ్య రాయబారిగా ఎంపిక చేసింది. దీపికా ఎంపిక భారతదేశంలో మానసిక ఆరోగ్య సమస్యల గురించి విస్తృతంగా అవగాహన కల్పించడంలో సహాయపడుతుందని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది.
దీనిపై దీపికా పదుకొణె మాట్లాడుతూ ‘కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు మొదటి మానసిక ఆరోగ్య రాయబారిగా పనిచేయడం నాకు చాలా గౌరవంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంలో ఎంతో పురోగతి సాఽధించింది. మనదేశంలో అవగాహన కల్పించడానికి.. మరింత బలోపేతం చేయడానికి మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను’’ అని అన్నారు. 2015లో దీపిక స్థాపించిన ‘ది లైవ్ లవ్ లాఫ్’ ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు. దాదాపు పదేళ్ల క్రితం ఈ సంస్థను ప్రారంభించానని తెలిపారు. కొందరు ప్రజలు నా దగ్గరికి వచ్చి ‘నువ్వు ఒక ప్రాణాన్ని కాపాడావు.. నువ్వు నా కూతురికి సహాయం చేశావు అని చెప్పినప్పుడు వచ్చిన ఆనందం మరెక్కడా తనకు లభించలేదని తెలిపారు.