DDLJ: 30 ఏళ్ల తర్వాత లండన్‌లో ఏం చేశారంటే..
ABN, Publish Date - Dec 05 , 2025 | 10:29 AM
ఇండియన్ సినిమా ప్రేమకథల్లో ‘దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే’ ((DDLJ)కు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సినిమాకు లండన్ లో అరుదైన గౌరవం దక్కింది.
భారతీయ సినిమా ప్రేమకథల్లో ‘దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే’ (DDLJ)కు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. షారుక్ ఖాన్, కాజోల్ జంటగా ఆదిత్యా చోప్రా దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఎవర్‌గ్రీన్ లవ్‌స్టోరీగా చెబుతారు. ఇప్పుడు ఈ సినిమాకి 30 ఏళ్లు. భారతీయ చిత్ర పరిశ్రమలో థియేటర్లలో అత్యధిక రోజులు ప్రదర్శితమైన సినిమాగా అరుదైన ఘనతను సాధించింది ఇది. అలాగే ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్‌లో కొన్నేళ్ల పాటు ఈ చిత్రం ఆడుతూనే ఉంది. ఈ రికార్డ్ ఈ సినిమాకు తప్ప మరో దానికి లేదు.
ఈ సందర్భంగా.. సినిమాలోని షారుక్ - కాజోల్ జోడీ సిగ్నేచర్ పోజుతో కూడిన కాంస్య విగ్రహాలను రూపొందించారు. లండన్‌లోని లీసెస్టర్ స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన విగ్రహాలను గురువారం షారుక్, కాజోల్ ఆవిష్కరించారు. ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ చిత్రమిది. ఇంతకుముందు.. ‘హ్యారీ పోటర్’, ‘మేరీ ఫాపిన్స్’ లాంటి హాలీవుడ్ చిత్రాలకు అక్కడ స్థానం దక్కింది. ఆ తర్వాత ఈ చిత్రానికే ఆ అవకాశం లభించింది.
ఈ సందర్భంగా షారుక్‌ఖాన్ మాట్లాడుతూ.. ‘డీడీఎల్‌జే’ నాకు మాటల్లో చెప్పలేనంత గుర్తింపు తీసుకొచ్చింది. ప్రేమ, ఎన్ని అడ్డంకులు ఎదురైనా అది ఎలా అధిగమించగలదు? అంతటా ప్రేమ ఉంటే ఈ ప్రపంచం ఎలా ఉంటుంది? అన్న ఆలోచనతో ఈ సినిమా తెరకెక్కింది’ అని అన్నారు.
‘డీడీఎల్‌జే’ విడుదల సమయంలో సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో ఇప్పుడు 30 వసంతాల తర్వాత కూడా అదే ఆదరణ ఉంది. సినిమాకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు’ అంటూ కాజోల్ ఆనందం వ్యక్తం చేశారు.