సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dharmendra: ఒంట‌రిగా వ‌చ్చి.. బాలీవుడ్‌ను ఏలిన 'ధర్మేంద్ర' జీవిత చ‌రిత్ర‌

ABN, Publish Date - Nov 25 , 2025 | 05:52 AM

చిత్ర పరిశ్రమలో తనకు గాడ్‌ఫాదర్‌ అంటూ ఎవరూ లేకపోయినా నట వారసులే కాదు బయటి నుంచి వచ్చిన వారు కూడా హీరోలుగా రాణించగలరని నిరూపించారు ధర్మేంద్ర.

Dharmendra

ఆ తరం అమ్మాయిలకు ఆయన కలల రాకుమారుడు. ‘హీ మ్యాన్‌’ అని నాటి యువతరం ప్రశంసలు అందుకొన్న ధర్మేంద్ర (Dharmendra) పూర్తి పేరు ధర్మేంద్ర కేవల్‌ కిషన్‌ డియోల్‌. నటుడు, నిర్మాత మాత్రమే కాకుండా రాజకీయ వేత్తగానూ పలువురి ప్రశంసలు అందుకొన్నారు. ఆరున్నర పదుల తన నటజీవితంలో 300కు పైగా చిత్రాల్లో నటించి అందగాడుగా, కమర్షియల్‌గా సక్సెస్‌ అయిన హీరోగా గుర్తింపు పొందారు. చిత్ర పరిశ్రమలో తనకు గాడ్‌ఫాదర్‌ అంటూ ఎవరూ లేకపోయినా నట వారసులే కాదు బయటి నుంచి వచ్చిన వారు కూడా హీరోలుగా రాణించగలరని నిరూపించారు ధర్మేంద్ర. తాను హీరోగా పరిశ్రమలో మంచి పొజిషన్‌ సంపాదించుకోవడమే కాకుండా తన కుటుంబం నుంచి మరికొందరు పరిశ్రమలోకి రావడానికి స్ఫూర్తిగా నిలిచారు. తన కుమారులు సన్నీ డియోల్‌, బాబీ డియోల్‌, కుమార్తెలు ఈషా డియోల్‌, అహనా డియోల్‌ కూడా సినిమాల్లో తండ్రి వారసత్వం కొనసాగిస్తున్నారు.

19 ఏళ్లకే పెళ్లి

ధర్మేంద్ర 1935 డిసెంబర్‌ 8న పంజాబ్‌లోని లూథియానా జిల్లా నస్రాలీ గ్రామంలో జన్మించారు. 1952లో మెట్రిక్యులేషన్‌ పాసయ్యారు. 19 ఏళ్లకు ప్రకాశ్‌ కౌర్‌ను పెళ్లి చేసుకున్నారు. కెరీర్‌ ఆరంభంలో చిన్న పాత్రల్లో నటించారు ధర్మేంద్ర. ఆయన నటించిన తొలి చిత్రం ‘దిల్‌ భీ తేరా హమ్‌ భీ తేరే’ 1960లో విడుదల అయింది. ‘ఆయే మిలన్‌ కీ బేలా’, ‘ఫూల్‌ ఔర్‌ పత్తర్‌’, ‘ఆయే దిన్‌ బహర్‌ కే’ వంటి చిత్రాలతో 60ల దశకంలోనే ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. 1960-80 మధ్య కాలంలో హీరోగా ఓ వెలుగు వెలిగారు. ‘ఆంఖేన్‌’, ‘షికార్‌’, ‘సావన్‌ ఝామ్‌ కీ, ‘బందినీ’, ‘అనుపమ’, ‘అన్‌పఢ్‌’, ‘జీవన్‌ మృత్యు’, ‘మేరా గావ్‌ మేరా దేశ్‌’, ‘సీతా ఔర్‌ గీత’, ‘రాజా జానీ’, ‘జుగ్ను’, ‘యాదోంకి బారాత్‌’, ‘దోస్త్‌’, ‘షోలే’, ‘చరస్‌’, ‘ధర్మ వీర్‌’ వంటి చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. 1973 ఆయన కెరీర్‌లోనే లక్కీ ఇయర్‌. ఆయన నటించిన ఎనిమిది చిత్రాలు బ్లాక్‌బస్టర్లు అయ్యాయి. 1987లో వరుసగా ఏడు సూపర్‌ హిట్స్‌ అందుకున్నారు ఆయన. ఇవి కాకుండా ఒకే ఏడాది తొమ్మిది హిట్‌ చిత్రాలు.. ఇలా రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతూ సాటి హీరోలకు అందనంత దూరంగా ఉండేవారు ధర్మేంద్ర. ఇప్పటికీ ఆ రికార్డ్స్‌ ధర్మేంద్రకే సొంతం. ఆ రోజుల్లో మూడు, నాలుగు షిఫ్టుల్లో పని చేస్తూ బిజీగా ఉండేవారు.

తొలినాళ్లలో సాఫ్ట్‌, రొమాంటిక్‌ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన ఆయన.. 1970 నుంచి యాక్షన్‌ మ్యాన్‌ అనే ఇమేజ్‌ను సొంతం చేసుకుని షోలే చిత్రంతో స్టార్‌ స్టేటస్‌ సంపాదించారు. బలమైన దేహదారుఢ్యంతో ఉండే ఆయన తెరపైన శక్తిమంతమైన యాక్షన్‌ రోల్స్‌తో అలరించేవారు. పోరాటాలు కూడా డూప్‌ లేకుండా చేసేవారు. అందుకే ఆయనను ‘హీ మ్యాన్‌’, ‘యాక్షన్‌ కింగ్‌’ అని పిలిచేవారు.

బయోపిక్‌ ఇష్టం లేదు

ధర్మేంద్ర బయోపిక్‌ను తెరకెక్కించడానికి ఆయనను చాలా మంది దర్శకనిర్మాతలు సంప్రదించినా సున్నితంగా తిరస్కరించేవారు. ‘నా బయోపిక్‌ తెరకెక్కిస్తే, అందులో నాలా నటించే నటులు ఎవరూ కనిపించలేదు’ అని ఆయన భావించడమే దానిక్కారణం.

అమితాబ్‌కు మాట సాయం

తొలినాళ్లలో ధర్మేంద్రతో అమితాబ్‌ ‘షోలే’ చేస్తున్న సమయమది. ఈ చిత్రం షూటింగ్‌ కోసం ధర్మేంద్రతో పాటు అమితాబ్‌ కూడా బెంగుళూరులో ఉండాల్సిన పరిస్థితి. అయితే అమితాబ్‌ బెంగుళూరులో ఉండడంతో బొంబాయిలో చాలా సినిమాల చిత్రీకరణలు ఆగిపోయాయి. ఈ విషయాన్ని దర్శకుడు రమేశ్‌ సిప్పీకు చెబితే, ‘ధర్మేంద్ర కేవలం మీ కోసం రెండు మూడు సినిమాలు రద్దు చేసుకుని వచ్చారు. ఆయన ఏమైనా అనుకుంటాడేమో... వెళ్లి అడుగు’ అని రమేశ్‌ సిప్పీ అన్నారు. కానీ అప్పటికే సూపర్‌స్టార్‌ హోదాలో ఉన్న ఆయనకు ఈ విషయాన్ని చెప్పాలంటేనే సందేహిస్తున్నారు. నిర్మాతల బలవంతం మీద అమితాబ్‌.. ‘మీరు వెళ్లమంటే బొంబాయి వెళ్లి మా నిర్మాతల పని పూర్తి చేస్తాను’ అని ధర్మేంద్రను అడిగారు. ఆయన ‘దానికేముంది.. ఇక్కడ పనిలేకపోతే వెళ్లండి.. నాకేం అభ్యంతరం లేదు’ అని బదులిచ్చారు.

హేమతో ప్రేమ.. పెళ్లి

బాలీవుడ్‌లోని ఐకానిక్‌ ప్రేమ జంటల్లో ఒకటిగా ధర్మేంద్ర, హేమమాలిని గుర్తింపు తెచ్చుకున్నారు. ‘తూ హసీనా మై జవాన్‌ తూ’ చిత్రంతో రీల్‌ లైఫ్‌లో మొదలైన వారి అనుబంధం.. రియల్‌ లైఫ్‌ వరకూ సాగింది.. మరోవైపు నటులు సంజీవ్‌ కుమార్‌, జితేంద్ర హేమమాలిని వెంట పడేవారు. కానీ ఆమె మాత్రం ధర్మేంద్రకే మనసిచ్చారు. ‘తూ హసీనా మై జవాన్‌ తూ’ లీడ్‌ పెయిర్‌గా నటించిన ఈ ఇద్దరూ చిత్రీకరణ పూర్తయ్యేసరికి ప్రేమలో పడ్డారు.

‘అయితే ప్రేమలో పడినంత సులభంగా వారి పెళ్లి జరగలేదు. హేమమాలినితో ప్రేమలో పడే సమయానికే ధర్మేంద్రకు ప్రకాశ్‌కౌర్‌తో పెళ్లై నలుగురు సంతానం ఉండేవారు. వారే సన్నీ డియోల్‌, బాబీ డియోల్‌, విజేత, అజీత. అలానే అప్పటికే పెళ్లైన వ్యక్తితో జీవితం ఎలా పంచుకుంటావు అని హేమమాలిని తల్లిదండ్రులు ఈ పెళ్లికి ససేమిరా అన్నారు. దాదాపు ఐదేళ్లు ప్రేమించుకున్నాక, వివాహం చేసుకుందాం అనే సమయానికి ప్రకాశ్‌ కౌర్‌ విడాకులకు అంగీకరించలేదు. అయినా అన్ని అడ్డంకులు దాటుకుని ప్రేమించుకున్న ఏడేళ్లకు వారు ఏడడుగులు వేశారు.

పెళ్లయ్యాక వారికి ఇద్దరు కుమార్తెలు ఈషా డియోల్‌, అహనా డియోల్‌ జన్మించారు. వారి వివాహ సమయంలోనూ పలు రూమర్స్‌ రావడం గమనార్హం. వారి పెళ్లికి హిందూ వివాహ చట్టం ప్రకారం న్యాయపరమైన సమస్యలు రావడంతో 1979లో ధర్మేంద్ర ముస్లింగా మారి హేమమాలినిని పెళ్లి చేసుకున్నారని.. ఇద్దరూ తమ పేర్లను దిలావర్‌, ఆయేషా బీగా మార్చుకున్నారని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయాన్ని చాలా కాలం వరకూ ధర్మేంద్ర ఖండించలేదు. 2004లో ఎలక్షన్లలో పోటీ చేస్తున్నప్పుడు స్పందించి, ‘మతం మార్చుకునే అవసరం నాకు లేదు’ అని స్పష్టం చేశారు.

Updated Date - Nov 25 , 2025 | 05:52 AM