Bhool Chuk Maaf: మళ్ళీ మళ్ళీ... అక్కడే...

ABN, Publish Date - May 13 , 2025 | 10:05 AM

రాజ్ కుమార్ రావ్ తాజా చిత్రం 'భూల్ చుక్ మాఫ్'లోని కథే ప్రస్తుతం బయట కూడా రిపీట్ అవుతోంది. హీరో, హీరోయిన్ల పెళ్ళి అవుతుందా లేదా అన్నట్టుగానే... ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అనే సందేశం కలుగుతోంది.

రాజ్ కుమార్ రావ్ (Rajkumar Rao) హీరోగా మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ (Maddock Films) నిర్మించిన చిత్రం 'భూల్ చుక్ మాఫ్' (Bhool Chuk Maaf). వామికా గబ్బి (Wamiqa Gabbi) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ చూసిన వారికి ప్రస్తుతం ఈ సినిమా తంతు చూస్తుంటే ఇదంతా కాకతాళీయం కదా అనిపించకమానదు. ఈ సినిమాలో హీరోహీరోయిన్ల పెళ్ళి రెండు రోజుల్లో జరగాల్సి ఉండగా, హల్దీ వేడుక దగ్గర సీన్ ఫ్రీజ్ అయిపోతుంది. టైమ్ లూప్ లో జరిగిందే మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి చిత్రమైన పరిస్థితి నుండి బయటకు వచ్చి... అసలు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోగలనా... లేదా అని హీరో సందేహ పడతాడు. సరిగ్గా అలాంటి పరిస్థితే ఇప్పుడీ సినిమాకు జరుగుతోంది. మే 9న 'భూల్ చుక్ మాఫ్‌' సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అన్ని రకాల ఏర్పాట్లను ప్రొడక్షన్ హౌస్ చేసేసింది. అయితే... ఎల్లుండి సినిమా విడుదల అనగా, ఠక్కున మ్యాడ్ డాక్ సంస్థ యూ టర్న్ తీసుకుంది.


ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా 'భూల్ చుక్ మాఫ్‌' సినిమాను థియేటర్లలో విడుదల చేయబోవడం లేదని, మే 16న డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించింది. తమ చిత్రాన్ని బిగ్ స్క్రీన్స్ లో చూసుకోవచ్చని ఆశపడిన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఆశలపైనే కాదు... రాజ్ కుమార్ రావ్ అభిమానులపై నీళ్ళు గుమ్మరించినట్టు అయ్యింది. అయితే... మరో వారం ఆగితే కనీసం ఓటీటీలో అయినా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చని అంతా అనుకున్నారు. కానీ ఆ కోరిక కూడా ఇప్పుడు తీరడం లేదు. సినిమా థియేట్రికల్ రిలీజ్ ను ఆపేసి, డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి పీవీఆర్ ఐనోక్స్ (PVR INOX) సంస్థ ఒప్పుకోవడం లేదు. తమతో అగ్రిమెంట్ చేసుకుని, ఇప్పుడు దానిని కాలరాచి, ఓటీటీకి ఎలా వెళ్తారంటూ ప్రశ్నిస్తోంది. ఈ సినిమా విడుదల అవుతుందనే నమ్మకంతో తాము 9వ తేదీకంటే ముందే ఆన్ లైన్ బుక్కింగ్స్ ఓపెన్ చేసి, ఆడియెన్స్ చేతిలో భంగపడ్డామని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఎనిమిది వారాలకు ఓటీటీకి ఇవ్వాలనే అగ్రిమెంట్ ను నిర్మాణ సంస్థ ఎలా కాలరాస్తుందని ప్రశ్నిస్తోంది. వీటికి సమాధానం కోసం కోర్టు తలుపు తట్టింది. దాంతో కోర్ట్ ఓటీటీ విడుదలపై స్టే విధించింది.

ఈ పరిస్థితిని చూస్తుంటే... సినిమాలో హీరో పెళ్లి అవుతుందా? లేదా? అని సందేహపడినట్టే... ఈ సినిమా అసలు ఇప్పుట్లో విడుదల అవుతుందా, లేదా? అనే సందేహం కలుగుతోందని ప్రేక్షకులు వాపోతున్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి కేసును జూన్ 16కు వాయిదా వేశారు. సో.. అప్పటి వరకూ 'భూల్ చుక్ మాఫ్' సినిమా గురించి మర్చిపోవడమే కరెక్ట్. అప్పటికి కోర్టు ఇచ్చే తీర్పును బట్టి థియేటర్లలో ఇది విడుదల అవుతుందా? లేక డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా అనేది తెలుస్తుంది.

Also Read: Bollywood: అక్తర్ సాబ్ దీనికేమంటారు!?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 13 , 2025 | 10:05 AM