Choo Mantar: 'ఛూ మంతర్'లో శ్రీలీలకు అవకాశం
ABN, Publish Date - Dec 12 , 2025 | 02:23 PM
హిందీ సినిమా 'ఛూ మంతర్'నుండి అనన్యపాండే బయటకు వచ్చేసిందని, ఆమె స్థానంలో మేకర్స్ శ్రీలీలను తీసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అదే జరిగితే... శ్రీలీలకు ఉత్తరాదిలో మంచి క్రేజే ఉన్నట్టు లెక్క.
తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా ఆశించిన స్థాయి హిట్స్ అందుకోకపోయినా, యువ నటి శ్రీలీల (Sree Leela)కు బాలీవుడ్ (Bollywood) నుండి ఊహించని డిమాండ్ ఏర్పడుతోంది. తాజాగా, ఆమెకు ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిల్మ్స్ (Maddock Films) నిర్మించబోయే ప్రతిష్టాత్మక ఫాంటసీ - రొమాన్స్ డ్రామా 'ఛూ మంతర్' (Choo Mantar) చిత్రంలో కీలక పాత్ర దక్కే సువర్ణావకాశం లభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పాత్ర కోసం మొదట ఎంపికైన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో, ఆమె స్థానంలో 'డ్యాన్స్ క్వీన్' శ్రీలీలను సంప్రదించినట్లు చిత్ర బృందానికి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామం శ్రీలీల అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
'ఛూ మంతర్' షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కావాల్సి ఉండగా, అనన్య పాండే మాత్రం తన డేట్స్ సర్దుబాటు చేయలేకపోయినట్లు తెలుస్తోంది. అనన్య తన బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్ 'కాల్ మీ బే' (Call Me Bae) రెండో సీజన్ షూటింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుండటంతో, ఈ కీలక ప్రాజెక్ట్‌ను వదులుకోవాల్సి వచ్చింది. 'ముంజ్య' (Munjya), 'స్త్రీ 2' (Stree 2) వంటి సూపర్ హిట్ చిత్రాల నిర్మాతలతో పనిచేయాలని అనన్య ఆశించినప్పటికీ, దురదృష్టవశాత్తు డేట్స్ క్లాష్ కారణంగా ఆ అవకాశాలు కూడా చేజారిపోయాయి. ఈ కారణంగానే ఆమె 'ఛూ మంతర్' నుండి వైదొలగక తప్పలేదని తెలుస్తోంది.
తెలుగులో చివరి చిత్రం మాస్ మహరాజా రవితేజ (Ravi Teja)తో చేసిన 'మాస్ జాతర' (Mass Jathara) బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినప్పటికీ, శ్రీలీల క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ దర్శక-నిర్మాతల దృష్టిని ఆమె ఆకర్షించింది. శ్రీలీల ఇప్పటికే బాలీవుడ్‌లో తన అరంగేట్రం కోసం సిద్ధమవుతోంది. ఆమె ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ (Karthik Aaryan) హీరోగా, దిగ్గజ దర్శకుడు అనురాగ్ బసు (Anuraghu Bhasu) రూపొందిస్తున్న భారీ చిత్రంలో నటిస్తోంది. మొదటి చిత్రం విడుదల కాకముందే, బాలీవుడ్ సర్కిల్స్‌లో శ్రీలీల హాట్ షాట్ గా మారిపోయింది. 'ఛూ మంతర్'తో పాటు, శ్రీలీల ఒక హిందీ సినిమా కోసం డాన్స్ నంబర్ గురించి కూడా చర్చలు జరుపుతోంది. దీనికి తోడు, మరికొన్ని కీలక ప్రాజెక్ట్‌ల కోసం ప్రముఖ దర్శక, నిర్మాతలతో ఆమె సంభాషణలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. తెలుగులో ఎదురుదెబ్బలు తగిలినా, 'ఛూ మంతర్' వంటి పెద్ద ఆఫర్ శ్రీలీల బాలీవుడ్ కెరీర్‌కు ఖచ్చితంగా పెద్ద 'బూస్ట్' ఇస్తుందని సినీ విశ్లేషకులు బలంగా భావిస్తున్నారు. ఈ అవకాశం కనుక దక్కితే, ఆమె బాలీవుడ్‌లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకోవడం ఖాయం అంటున్నారు.
అయితే, అనన్య పాండే స్థానంలో శ్రీలీలతో పాటు గుజరాతీ నటి జాంకీ బోడివాలా (Janki Bodiwala) పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. చివరకు 'చూ మంతర్' చిత్రంలో ఈ యువ హీరోయిన్లలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది త్వరలోనే తెలియనుంది.