Alia Bhatt: ఆలియా భట్‌కు షాక్: ఫేక్ బిల్లులతో.. రూ.77 లక్షల మోసం
ABN, Publish Date - Jul 09 , 2025 | 01:41 PM
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కు తీవ్ర చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt)కు తీవ్ర చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన వద్ద వ్యక్తిగత సహాయకురాలిగా పని చేసిన వేదిక ప్రకాశ్‌శెట్టి (Vedika Prakash Shetty) ఆర్థిక వ్యవహారాల్లో తప్పుడు లెక్కలు చూపి రూ.77 లక్షల మేర మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడీ విషయం బాలీవుడ్‌తో పాటు టోటల్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
2021 నుంచి 2024 మధ్య కాలం వరకు ఆలియా పర్సనల్ అసిస్టెంట్ (PA)గా పని చేసిన వేదికా ప్రకాశ్ శెట్టి. ఆలియా నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ (Eternal Sunshine Productions) ఆర్థిక లావాదేవీలన్నింటినీ చక్క బెట్టేది. అయితే, ఆలియా తల్లి, సినీ నటి సోని రజ్‌దాన్ ఇటీవల కొన్ని లెక్కలపై అనుమానం వచ్చి పరిశీలించగా, వేదిక తప్పుడు బిల్లులు సమర్పిస్తూ భారీ మొత్తాన్ని కాజేసిందని అర్థమైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది.
ఆలియాకు సంబంధించిన ప్రయాణాలు, మీటింగ్స్, ఈవెంట్ ఖర్చుల పేరుతో పాటు ఆలియా వ్యక్తిగత ఖాతాల్లోంచి కూడా వేదిక ఫేక్ బిల్లులు సమర్పించి రూ.77 లక్షల మేర వంచించిందని, పోలీసులు వెల్లడించారు. ఆపై ఈ వ్యవహారం కాస్త వెలుగులోకి రావడంతో పోలీసుల దర్యాప్తు మొదలవగానే వేదికా పరారయ్యింది. రాజస్థాన్ అక్కడి నుంచి కర్ణాటక, ఆపై పూణే వంటి ప్రాంతాల్లో తిరుగుతూ చివరకు బెంగళూరులో పోలీసులకు చెక్కింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ముంబైకి తరలించారు.