Abhishek Aishwarya Rai Bachchan: యూట్యూబ్‌పై రూ.4 కోట్ల పరువు నష్టం దావా

ABN , Publish Date - Oct 03 , 2025 | 06:13 AM

అనుమతి లేకుండా ఏఐ వీడియోలు, ఫొటోలు వాడారంటూ ఐశ్వర్య–అభిషేక్ దంపతులు యూట్యూబ్‌, గూగుల్‌పై రూ.4 కోట్ల పరువు నష్టం దావా వేశారు.

Abhishek Aishwarya Rai Bachchan

బాలీవుడ్‌ స్టార్‌ దంపతులు అభిషేక్‌, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ (Aishwarya Rai) మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఇటీవలే అనుమతి లేకుండా ఐశ్వర్య ఫొటోలు వాడుతున్నారంటూ ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేయగా, కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత కూడా యూట్యూబ్‌లో ఐశ్వర్యను కేంద్రంగా చేసుకుని ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ వీడియోలు, అనుచిత ఫొటోలు దర్శనం ఇస్తుండటంతో దంపతులు తాజాగా గూగుల్‌, యూట్యూబ్‌పై రూ.4 కోట్ల పరువు నష్టం దావా వేశారు.

“AI Bollywood Ishq” పేరుతో ఉన్న ఒక యూట్యూబ్‌ ఛానల్‌లోనే ఐశ్వర్యపై 259 కంటే ఎక్కువ వీడియోలు ఉన్నట్టు వారు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ వీడియోల వల్ల ఐశ్వర్య గౌరవం, ప్రతిష్ఠ దెబ్బతినడమే కాకుండా ఆర్థికంగా కూడా నష్టం కలిగిందని వాదించారు. కోర్టు ఇప్పటికే అనుమతి లేకుండా సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు వాడరాదని స్పష్టంగా చెప్పి, గుర్తించిన యూఆర్‌ఎల్‌లను 72 గంటల్లో బ్లాక్‌ చేయాలని గూగుల్‌ సహా ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను వారు పాటించక పోవడంతో మళ్లీ కోర్టు తలుపులు తట్టాల్సి వచ్చిందని దంపతులు పేర్కొన్నారు.

ఈ కేసుతో భారతదేశంలో పర్సనాలిటీ రైట్స్, AI–డీప్‌ఫేక్ దుర్వినియోగం, డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ల బాధ్యతలు అనే అంశాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. ఇప్పటికే గాయని ఆషా భోస్లే వాయిస్‌ క్లోనింగ్‌పై బాంబే హైకోర్టు జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఐశ్వర్య–అభిషేక్‌ కేసు కూడా ప్రముఖుల వ్యక్తిగత హక్కులకు న్యాయ పరిరక్షణ లభించే దిశగా ఒక మైలురాయిగా నిలుస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవ‌లే అక్కినేని నాగార్జున సైతం ఢిల్లీ హైకోర్టును అశ్ర‌యించి త‌న పేరు ఎక్క‌డా వాడ‌కుండా చూసేలా కోర్టు నుంచి ఉత్త‌ర్వులు తెచ్చుకున్నాడు.

Updated Date - Oct 03 , 2025 | 06:13 AM