Rajkumar Hirani: పీకే కాంబో రిపీట్
ABN , Publish Date - May 14 , 2025 | 05:50 PM
బాలీవుడ్ లో క్రేజీ కాంబో రిపీట్ అవుతోంది. దాదాపు 11 ఏళ్ల తర్వాత జతకట్టబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎలాంటి స్టోరీతో మ్యాజిక్ చేస్తారోనని మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నప్పటికీ.... కొంతమందికి మాత్రమే స్పెషల్ క్రేజ్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఫ్లాప్స్ లేని డైరెక్టర్స్ చాలా అరుదుగా ఉంటారు. అలాంటి లిస్ట్ లో బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani ) పేరు కూడా కనిపిస్తుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా ఓ రేంజ్ లో బాలీవుడ్ లో పాపులారిటీని క్రియేట్ చేసుకున్నాడు. ఇక చెప్పాలంటే ఆయనతో సినిమా అంటే బ్లాక్ బస్టర్ పక్కా అని ఫిక్స్ అయిపోతుంటారు సినీజనం. ఆయన నుంచి వచ్చే సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు మూవీ లవర్స్. దాదాపు మూడేళ్ల తర్వాత రాజ్ కుమార్ హిరానీ... ఓ సినిమా చేయడానికి రెడీ అవ్వడం బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తో 'డంకీ' (Dunki )మూవీ తీసిన తర్వాత హిరానీ నుంచి కొత్త ప్రాజెక్ట్ రాలేదు. ఆశించిన స్థాయిలో హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికి.... బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం పెద్దంతగా ఈ సినిమా కురిపించలేకపోయింది. అయితే ఈ మూవీ తర్వాత రాజ్ కుమార్ హిరానీ చాలా మంది హీరోలతో సినిమాలు చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ అవేవీ వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్ గా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) తో హిరానీ మూవీ చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 11 ఏళ్ల తర్వాత కొత్త ప్రాజెక్ట్ కోసం వీరిద్దరూ చేతులు కలిపినట్టు సమాచారం. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ''3 ఇడియట్స్ (3 Idiots ) , పీకే (PK)'' మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం వీరిద్దరూ మరోసారి జతకట్టడం బీటౌన్ లో చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం ఆమిర్ ఖాన్, జెనీలియా (Genelia)నటించిన 'సితారే జమీన్ పర్' (Sitaare Zameen Par) మూవీ జూలై 20న విడుదల కానుంది. దీని రిలీజ్ తర్వాత ఆమిర్ కూడా నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెడతాడట. రీసెంట్ గా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్, హిరానీ మధ్య స్టోరీ విషయంలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ప్రాజెక్ట్ 2026లో సెట్స్ పైకి వెళ్ళొచ్చట. హిరానీ రెండు మూడు స్టోరీలను అనుకున్నప్పటికీ కామెడీతో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ స్టోరీ వైపు ఆమీర్ మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. అయితే ఆమిర్ కంటే ముందు ఈ స్టోరీని హిరానీ... రణబీర్ కపూర్(Ranbir Kapoor) , విక్కీ కౌశల్ (Vicky Kaushal)కి వినిపించాడట. అయితే... ఈ ఇద్దరు హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండటంతో అమిర్ తో మూవీ చేయడానికి హిరానీ రెడీ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికార ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మరి ముందు రెండు సినిమాల మాదిరే ఇది కూడా విజయాన్ని అందుకుని ఈ జోడీకి హ్యాట్రిక్ ను ఇస్తుందేమో చూద్దాం.