Aamir Khan: ఆగస్ట్ నుంచి ఆమిర్ మహాభారతం
ABN, Publish Date - Jul 09 , 2025 | 06:40 PM
ఒక కథను రెండు సార్లు చూడటమే కష్టం. కానీ పదుల సంఖ్యలో తెరకెక్కిన కథను మళ్లీ వెండితెరపై ఆవిష్కరించేందుకు పోటీపడుతున్నాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్. అదే తన కలల ప్రాజెక్టు అని, ఎలాగైనా తీసి తీరుతానని ప్రకటించడమే కాదు... పని కూడా మొదలు పెట్టేయబోతున్నాడు.
ఎవరెన్ని సార్లు తీసినా, మహాభారతం(Mahabharatam)పై చాలా మంది మేకర్స్ ఇంకా మనసు పారేసుకుంటూనే ఉన్నారు. ఎన్ని కోట్ల ఖర్చు అయినా సరే తాము కూడా తీస్తామని ముందుకు వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది డైరెక్టర్లు ఈ కథాంశాన్ని వెండితెర పైకెక్కించి తమదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ కూడా చేరాడు. మహా భారతం తన కలల ప్రాజెక్ట్ అని చెప్పుకుంటున్న ఆమిర్ ఖాన్ (Aamir Khan) ఈ ఆగస్టు నుంచి ప్రాజెక్టును ప్రారంభించబోతున్నాడట. అయితే మొదలుపెట్టక ముందే క్యూరియాసిటీ పెంచే అనౌన్స్మెంట్ చేశాడు ఆమిర్.
తాను తీసే మహాభారతాన్ని ఒకే సినిమాలో చెప్పలేనని, కొన్ని సినిమాల సిరీస్‌గా తీసుకొస్తానని ఆమిర్ ప్రకటించాడు. తన మనసులో ఉన్న మహాభారతాన్ని తాను అనుకున్న విధంగానే చెప్పబోతున్నానని చెప్పుకొచ్చాడు. అంతేకాక ఇందులో ఆమిర్... అర్జునుడిగానో, కృష్ణుడిగానో నటించబోడట. ఇందులోని కీ రోల్స్ లో ఇండస్ట్రీకి చెందిన స్టార్ యాక్టర్స్ నటించే అవకాశం ఉందని, మిగిలిన పాత్రలను కొత్తవారితో చేయిస్తానని అంటున్నాడు. కాగా ఆమిర్ తీయబోయే 'మహాభారతం' ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే భారీ ప్రాజెక్ట్ కాబోతోందట. ఐదారు సీరిస్ లుగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ కు దాదాపు ఐదువేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ భారతీయ చలన చిత్ర చరిత్రలో మైలు రాయిగా నిలిచిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు ఈ సినిమాలో దేశవ్యాప్తంగా పలు ఇండస్ట్రీల నుంచి స్టార్ యాక్టర్స్ నటించబోతున్నారని తెలుస్తోంది. ఆమిర్ ఖాన్ ఈ ఎపిక్ స్టోరీని తనదైన విజన్‌తో ఆవిష్కరిస్తాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ కథలో కీలక పాత్రలను ఎవరు పోషిస్తారనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఇదిలా ఉంటే దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి (S. S. Rajamouli) సైతం మహాభారతాన్ని తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా గతంలో ప్రకటించాడు. అమీర్ ఖాన్ ఈ ప్రాజెక్ట్‌తో ముందుకు వెళ్తుండటం రాజమౌళి ప్లాన్స్‌పై ఏమైనా ప్రభావం చూపుతుందేమో చూడాలి.