Yearender 2024: టాలీవుడ్‌కు వివాదాస్పద నామ సంవత్సరం..

ABN , Publish Date - Dec 21 , 2024 | 02:45 PM

Rewind 2024: అగ్ర కథానాయకుడి అరెస్ట్‌, మరో లెజండరీ హీరో ఇంటి గొడవ, ఓ యువ హీరో ఎఫైర్‌, లైంగిక వేధింపుల కేసులో జాతీయ పురస్కారం వెనక్కి వెళ్ళిపోవడం.. ఇలా అనేక వివాదాలు టాలీవుడ్‌లో ట్రెండ్‌ అయ్యి వివాదస్పద నామ సంవత్సరంగా మారిపోయింది.  

సినిమా పరిశ్రమకు వివాదాలు, కేసులు కొత్తేమీ కాదు. అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అయితే ఈ ఏడాది అంతకుమించి అన్నట్లు టాలీవుడ్‌ను వివాదాలు చుట్టుముట్టాయి. ఇలాంటి వివాదాల సమయంలో ఇండస్ట్రీలో పెద్ద ఎవరో ఒకరు చనువు తీసుకుని వాటిని పెద్దవి కాకుండా సెటిల్‌ చేస్తుంటారు. ఇది దాసరి నారాయణరావు ఉన్న సమయంలో జరుగుతుండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. పోలీస్‌ స్టేషన్‌, కోర్టు గడప వరకూ వెళ్లిపోయాయి. అలా ఈ ఏడాది ఇండస్ట్రీని కుదిపేసిన వివాదాలెన్నో. అగ్ర కథానాయకుడి అరెస్ట్‌, మరో లెజండరీ హీరో ఇంటి గొడవ, ఓ యువ హీరో ఎఫైర్‌, లైంగిక వేధింపుల కేసులో జాతీయ పురస్కారం వెనక్కి వెళ్ళిపోవడం.. ఇలా అనేక వివాదాలు టాలీవుడ్‌లో ట్రెండ్‌ అయ్యి వివాదస్పద నామ సంవత్సరంగా మారిపోయింది.  (Tollywood controversy)

Raj-tarun.jpg

కేరాఫ్‌ నార్సింగి పోలీస్‌ స్టేషన్‌.. (Raj tarun Vs Lavanya)
హీరో రాజ్‌తరుణ్‌పై లావణ్య అనే యువతి చీటింగ్‌ కేసు పెట్టింది. పదేళ్ళు తనతో సహజీవనం చేసి, పలుమార్లు గర్భం తీయించి, అన్ని విధాలుగా వాడుకొని, చివరికి మాల్వీ మల్హోత్రా అనే హీరోయిన్‌ వలలో పడ్డాడని తనని దారుణంగా మోసం చేశాడని రాజ్‌ తరుణ్‌పై లావణ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. నార్సింగ్‌ పోలీసులను ఆశ్రయించింది. లావణ్య డ్రగ్స్‌కు బానిస, తనతో నాకు సంబంధం లేదని రాజ్‌ తరుణ్‌ తన వెర్షన్‌ పోలీసుల ముందుంచాడు. అయితే అక్కడితో ఆగలేదు ఈ కేసు. రోజుకో మలుపు తెరపైకి వచ్చింది. లాయర్‌ కళ్యాణ్‌ దిలీప్‌ సుంకర, ఆర్‌ జే శేఖర్‌ బాషా ఈ వివాదంలోకి ఎంటర్‌ అయ్యాక మరిన్ని ఆడియోలు బయటికి వచ్చాయి. టీవీ ఛానల్స్‌లో డిబేట్లు వరకూ వెళ్లి, లైవ్‌లో చెప్పు విసిరే వరకూ వెళ్లింది. లావణ్య, రాజ్‌ తరుణ్‌ని నీడలా వెంటాడింది. తన సినిమా ఈవెంట్లుకు వెళ్ళింది. మీడియా కూడా ఆమె ఇష్యూకి ఫుల్‌ కవరేజ్‌ ఇచ్చింది. ఏం సెటిల్‌మెంట్‌ జరిగిందో తెలియదు కానీ.. రాజ్‌ తరుణ్‌ లేకపోతే బతకలేనని, తనే సర్వం అని చెప్పిన లావణ్య ఒక్కసారిగా ౅సైలెంట్‌ అయిపోయింది. ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడింది.

Jony.jpg

లైంగిక వేధింపులు.. నేషనల్‌ అవార్డ్‌ క్యాన్సిల్‌.. (jani master)
టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌, బాలీవుడ్‌లోనూ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొంది నేషనల్‌ అవార్డుకు సెలెక్ట్‌ అయిన జానీ మాస్టర్‌ది ఒక వివాదం. తన సహాయకురాలు సృష్టి వర్మ జానీపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఆమె మైనర్‌ కావడంతో కనీసం ఆమె పేరుని కూడా రివీల్‌ చేయకుండా కేసు నడిచింది. ఆయనపై పోక్సో కేసు నమోదైంది. ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఈ వివాదంపై ప్రెస్‌ మీట్‌ పెట్టి కొన్ని వివరాలు వెల్లడించింది. ఈ కేసులో జానీ మాస్టర్‌ అరెస్ట్‌ అయ్యాడు. బెయిల్‌ మీద బయటికి వచ్చినప్పటికీ తనకు వచ్చిన జాతీయ అవార్డుని కేంద్రం వెనక్కి తీసుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.  మొత్తం ఎపిసోడ్‌ లో ఓ అగ్ర హీరో బాధితురాలి వెనుక ఉన్నాడని ఆరోపణ సోషల్‌ మీడియాలో బలంగా వినిపించింది. కొన్నాళ్ళకి బాధితురాలి ఓ ఆడియో బయటికి వచ్చింది. అది విన్న జనాలు. ఈ కేసుపై ఓ క్లారిటీకి వచ్చారు. ప్రస్తుతం జానీ మాస్టర్‌ బెయిల్‌పై బయట ఉన్నారు.

Manchu.jpg

మంచు ఇంట్లో మంటలు...(Manchu Family)
టాలీవుడ్‌లో క్రమశిక్షణకు కేరాఫ్‌గా చెప్పుకొనే మంచు మోహన్‌బాబు ఇంటి గుట్టు రట్టు అయింది. కొంతకాలంగా విష్ణు, మనోజ్‌ల మధ్య మనస్పర్థలు ఉన్నాయన్న సంగతి పలు సందర్భాల్లో బయటకు వచ్చాయి. దానికి సంబంధించిన వీడియోలు కొన్ని వైరల్‌ అయ్యాయి. అయితే కొన్నాళ్లకు జనాలు కూడా వాటిని మరచిపోయారు. తాజాగా మంచు ఇంటి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కొన్నాళ్ళుగా తెర చాటున్న గొడవలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తనకు మనోజ్‌ వలన హాని ఉందని కేసు పెట్టారు మోహన్‌ బాబు. దీనికి  కౌంటర్‌గా మనోజ్‌ కూడా కేసు పెట్టాడు. పది అంశాలతో ఓ లేఖను సోషల్‌ మీడియా ద్వారా బయటకు వదిలాడు. ఆస్తుల కోసం కాదు... ఇది తన ఆత్మగౌరవ పోరాటం అన్నాడు. మీడియాని వెంటబెట్టుకొని మోహన్‌ బాబు ఇంటికి వెళ్ళాడు. ఈ వివాదంలో బౌన్సర్లు ఓవరాక్షన్‌ చేశారు. మోహన్‌ బాబు ఇంటి వద్ద  యుద్థ వాతావరణం నెలకొంది. సహనం కోల్పోయిన మోహన్‌ బాబు మీడియా ప్రతినిధి పై వీదిరౌడీల దాడి చేశాడు. ఈ దాడిలో సదరు జర్నలిస్ట్‌ గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ కాసేపటికే మోహన్‌ బాబు ఆడియో విడుదల చేసి మొత్తం ఎపిసోడ్‌ పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. క్రమశిక్షణ అంటే నేను.. నేనంటే క్రమశిక్షణ అని చెప్పుకునే మోహన్‌బాబు అసలు నైజం ఏంటో జనాలు చూశారు. పోలీసులు చాలా సెక్షన్స్‌ కింద కేసులు పెట్టారు. ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నం చేస్తున్న మోహన్‌ బాబు అజ్ఞాతంలోకి వెళ్లారనే కథనాలూ వచ్చాయి. ఈ మొత్తం వివాదంలో మోహన్‌ బాబు కచ్చితంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

varmaakargv.jpg
ఆర్‌జీవీని భయపెట్టారు... (RGV Case)
వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చేతిలో మందు గ్లాసు, మరో చేతిలో ఫోన్‌, వడిలో అందాల భామలు ఉంటే ఎక్కిన మత్తులో ఆయన ఏం మాట్లాడతాడో కూడా తెలీదు. వైసీపీకి కోవర్ట్‌గా పని చేసిన ఆయన ఎన్నికల ప్రచార చిత్రాలుగా కొన్ని సినిమాలు తీసి విఫలయత్నం చేశాడు. ఆ సినిమాలను థియేటర్స్‌లో ఆపరేటర్స్‌, వైసీపీ పేటీఎమ్‌ బ్యాచ్‌ తప్ప ఎవరూ ఎవరూ పెట్టించుకోలేదు. చివరికి తన ఎక్స్‌ అకౌంట్‌ లో మార్ఫింగ్‌ ఫోటోలు పోస్టు చేసుకునే స్థితికి దిగజారాడు. దీనిపై ఆంధ్రా నుంచి పలువురు కేసులు పెట్టారు. పోలీసుల విచారణకు హాజరు కావాలని కోరిన పక్షంలో ఊరు వదిలి వెళ్లిపోయాడు. పోలీసులు అతని కోసం గాలించారు. లాయర్లుతో ముందస్తు బెయిల్‌ తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. ఈ కేసులో తనకు ఇబ్బంది లేదని తెలిసిన తర్వాతే మీడియా ముందుకు వచ్చాడు. సినిమా పని మీద బయటకు వెళ్లానని చెప్పుకొచ్చాడు. ఏం సినిమా అనే ప్రశ్నకు నో ఆన్సర్‌. సమాధానం చెప్పడానికి వర్మ పడిన ఇబ్బంది చూసిన జనం నవ్వుకున్నారు.  

Nagarjun.jpg

అక్కినేని ఫ్యామిలీ వర్సెస్‌ కొండా సురేఖ (Akkineni Vs konda surekha)
మాజీ మంత్రి కేటీఆర్‌ని ఉద్దేశిస్తూ అక్కినేని ఫ్యామిలీతో ముడిపెడుతూ కొండా సురేఖ సమంత విడాకుల గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ కూల్చకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్‌ కండీషన్‌ పెట్టాడు. నాగార్జున, నాగ చైతన్య మాట్లాడి సమంతను కేటీఆర్‌ దగ్గరికి వెళ్లాలని ఒత్తిడి చేశారు. అందుకు సమంత అంగీకరించలేదు. కేటీఆర్‌ దగ్గరకి వెళ్ళకపోతే మా ఇంట్లో ఉంటే ఉండు.. లేకపోతే వెళ్ళిపో అన్నారు. అది భరించలేకనే సమంత విడాకులు తీసుకుంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హుటాహుటిన పెళ్లి చేసుకోవడానికి కారణం కేటీఆర్‌. హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంటున్నాడు. వారికి మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్‌’’ అంటూ కొండా సురేఖ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. దీనిపై సమంత సురేఖకు ఘాటుగా స్పందించింది. ఇదే విషయంలో అక్కినేని కుటుంబం మొత్తం సురేఖకు కౌంటర్‌ ఇచ్చారు. నాగార్జున పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు కోర్టులో ఉంది. అలాగే హైడా ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను కూల్చివేయడం కూడా వివాదస్పదమైంది.

Allu-arjun.jpg

బన్నీ అరెస్ట్‌ సంచలనం... (Allu Arjun Arrest)
ఈ ఏడాది అత్యంత సంచలన విషయం ఏంటంటే.. టాలీవుడ్‌ ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ అరెస్ట్‌. పుష్ప బెనిఫిట్‌ షో చూడటానికి ఆర్‌టీసీ క్రాస్‌ రోడ్స్‌ సంధ్య థియేటర్‌కి వెళ్లారు బన్నీ. దురదృష్టవశాత్తూ అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది, రేవతి కొడుకు తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య కిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్‌ని ఏ11గా చేర్చి అరెస్ట్‌ చేయడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో నాంపల్లి కోర్టు బన్నీకి 14 రోజులు రిమాండ్‌ విధించింది. ఈ వార్త దేశం మొత్తం పాకింది. జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్‌ లు జరిగాయి. జాతీయ అవార్డు అందుకొని, పుష్పతో ఇండియన్‌ సినిమాని, బాక్సాఫీసు స్టామినాని పెంచిన ఓ హీరోని ఇలాంటి కేసులో అరెస్ట్‌ చేయడం తగదని కొందరు వాదిస్తే.. చట్టం ముందు అందరూ సమానమే అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితోపాటు కొందరు చెప్పారు. చివరికి హైకోర్టులో బన్నీకి మధ్యంతర బెయిల్‌ దొరికింది. అయినప్పటికీ పేపర్‌ వర్క్‌ ఫార్మాలిటీ ఆలస్యం కావడంతో ఓ రాత్రి అల్లు అర్జున్‌ జైల్లో గడపాల్సి వచ్చింది. అనంతరం ఇంటికి వచ్చిన బన్నీకి పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అందరూ పరామర్శకి వచ్చారు. అయితే చనిపోయిన రేవతి కుటుంబానికి జరిగిన అన్యాయం ఎవరికీ కనిపించలేదా? అనే కోణంలో కొందరు మాట్లాడారు. ఈ విమర్శలు రోజుకోజుకీ పెరగడంతో కేసులో వున్న బన్నీ కాకుండా అల్లు అరవింద్‌ రేవతి కుటుంబాన్ని పరామర్శించారు. రేవతి కుటుంబానికి అన్ని రకాలుగా ఆదుకుంటామని పుష్ప టీం అంతా చెబుతున్నారు. బన్నీకి పుష్ప ఇచ్చిన విజయం కంటే ఈ విషాదమైన వివాదమే దేశవ్యాప్తంగా సంచలనం గా మిగిలింది. ఓ స్టార్‌ హీరోని అరెస్ట్‌ చేయడం జైల్లో ఉంచడం పట్ల కొందరు విమర్శిస్తున్నారు.

Katsuri.jpg

తెలుగువారిపై వ్యాఖ్యలు.. కస్తూరిపై కేసు.. (Kasturi)
నటి కస్తూరి తమిళనాడులో ఓ వేదికపై తెలుగు ప్రజలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. ఆమెపై కేసులు పెట్టారు. తమిళనాట అధికార పక్షం తనపై కుట్ర చేస్తుందని చెప్పింది కస్తూరి. ఈ కేసులో అరెస్ట్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఆ క్రమంలో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా వార్తలొచ్చాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌ ఓ వారం రోజులుపాటు వార్తల్లో ఉంది. ఫైనల్‌గా మణికొండలోని ఓ ఇంట్లో ఉండగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు.

Harsha-sai.jpg

పెళ్లి పేరుతో రూ.2 కోట్లు స్వాహా.. (Harsha Sai)

ఇన్‌ఫ్లూయన్సర్‌ హర్షసాయిపై సెప్టెంబర్‌ 24న నార్సింగి పోలీస్‌ ేస్టషన్లో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో అత్యాచారం చేశాడంటూ హర్ష సాయిపై  ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నార్సింగి పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. హర్ష, అతడి తండ్రి రాధాకృష్ణ తన వద్ద రూ.2 కోట్లు తీసుకున్నారని ఫిర్యాదులో యువతి పేర్కొంది. తండ్రీ కొడుకు ఇద్దరిపై కేసు నమోదైంది.

Behara.jpg

పెళ్లి వారమండీ టు జైల్‌..(Prasad Behara)

పెళ్లి వారమండీ వంటి యూట్యూబ్‌ సిరీస్‌లతో పాపులర్‌ అయ్యాడు ప్రసాద్‌ బెహరా. కమిటీ కుర్రాళ్లు చిత్రం మంచి అవకాశం దక్కించుకుని వరుస అవకాశాలు అందుకుంటున్న తరుణంలో లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్‌ అయ్యాడు. ప్రసాద్‌ మంచి రైటర్‌, ఆర్టిస్ట్‌ కూడా. సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కమిటీ కుర్రాళ్ళు, బచ్చల మల్లి చిత్రాల్లో మంచి పాత్రలు పడ్డాయి. పరిశ్రమకి మంచి నటుడు దొరికాడని భావిస్తున్న తరుణంలో లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లడం కలకలం రేపింది.

Updated Date - Dec 22 , 2024 | 09:27 AM