Tillu Square: సిద్ధు పుట్టినరోజుకి తరలివచ్చిన తారాలోకం, ఫోటోస్ వైరల్

ABN , Publish Date - Feb 10 , 2024 | 11:40 AM

ఫిబ్రవరి 8న జరిగిన సిద్ధు పుట్టినరోజు వేడుకకి వైష్ణవి చైతన్య, సీరత్ కపూర్, ఈషా రెబ్బ, ప్రియాంక, అనసూయ, శివాని, శివాత్మిక, ఫరియా అబ్దుల్లా, దర్శకులు చందు మొండేటి, నీరజ కోన ఇంకా చాలామంది నటీనటులు హాజరయ్యారు.

Tillu Square: సిద్ధు పుట్టినరోజుకి తరలివచ్చిన తారాలోకం, ఫోటోస్ వైరల్
Siddhu Jonnalagadda celebrated his birthday with friends and well wishers

సిద్ధు జొన్నలగడ్డ లేదా డీజే టిల్లు, ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. సిద్ధు పరిశ్రమలోకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్నా 'డీజే టిల్లు' తో బాగా పాపులర్ అవటమే కాకుండా, తన మార్కెట్ పరిధిని బాగా విస్తరించుకున్నాడు. ఇప్పుడు తన చేతినిండా నాలుగు సినిమాలు పెట్టుకున్నాడు, బిజీగా వున్న నటుల్లో సిద్ధూ ఒకడు.

siddhujonnalagadda.jpg

ఎప్పుడో 2009లో 'జోష్' సినిమాలో స్టూడెంట్ పాత్రలో కనపడిన సిద్ధూ ఆ తరువాత ఒకటి రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనపడ్డాడు. ప్రవీణ్ సత్తారు తను తీసిన 'ఎల్ బి డబ్ల్యూ: లైఫ్ బిఫోర్ వెడ్డింగ్' అనే సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డని ఒక కథానాయకుడిగా తీసుకున్నాడు. ఆ చిన్న సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకొంది, సిద్ధు పేరు అప్పుడే తెలిసింది. ఈ సినిమా 2011 లో విడుదలైంది.

sivanirajasekhar.jpg

తరువాత సిద్ధు కి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా 'గుంటూరు టాకీస్'. ఈ సినిమా కూడా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం చేశారు. అయితే ఈ సినిమాకి సిద్ధు జొన్నలగడ్డ కథ, మాటలు సమకూర్చడమే కాకుండా పాట కూడా పాడాడు. ఇందులో రష్మీ గౌతమ్ కథానాయిక. ఈ సినిమాలో కొంచెం అడల్ట్ జోక్స్ ఉండటంతో విమర్శించినా, ఈ సినిమా అయితే సిద్ధుకి మొదటి పెద్ద విజయం అనే చెప్పాలి. ఈ సినిమా 2016లో విడుదలైంది.

anasuyasiddhuparty.jpgఆ తరువాత సిద్ధు తను సొంతగా ఒక కథని రాసుకొని 'కృష్ణ అండ్ హిజ్ లీల' అనే సినిమా చేసాడు. దీనికి రవికాంత్ పారేపు దర్శకత్వం వహిస్తే, ఇందులో సీరత్ కపూర్ కథానాయికగా నటించింది. శ్రద్ధ శ్రీనాథ్ ఇంకొక కథానాయిక. ఈ సినిమాకి ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి సమర్పకులుగా వ్యవహరించారు, సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థ ఈ సినిమాకి నిర్మాత. ఈ సినిమాకి సిద్ధు ఎడిటర్ గా కూడా పనిచేశాడు. ఈ సినిమా నేరుగా ఓటిటి లో అంటే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఇది సిద్ధు కి మంచి పేరు తీసుకువచ్చింది.

siddhupriyanka.jpg

ఆ తరువాత 'మా వింత గాధ వినుమా' అని ఇంకో సినిమాలో కూడా సిద్ధూ నటించాడు. ఆదిత్య మండల దీనికి దర్శకుడు, ఇందులో కూడా సీరత్ కపూర్ కథానాయిక. ఈ సినిమా కూడా నేరుగా ఓటిటి లో విడుదలయింది. ఈ సినిమాకి కూడా సిద్ధు కథ ఇవ్వడమే కాకుండా, ఎడిటర్ గా పని చేసాడు, అలాగే క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా కూడా ఈ సినిమాకి పని చేసాడు. ఈ సినిమా 2020లో వచ్చింది.

siddhuvaishu.jpg

2022 లో వచ్చిన 'డీజే టిల్లు' సినిమా సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ లో ఒక మైలురాయి అని చెప్పొచ్చు. ఇందులో డీజే టిల్లుగా సిద్ధూ యువతని బాగా ఆకర్షించడమే కాకుండా, ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. ఇందులో కొన్ని అడల్ట్ జోక్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. నేహా శెట్టి కథానాయిక ఆమె పాత్ర పేరు రాధిక ఇందులో. ఆ పాత్ర కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఈ సినిమాకి రచయితగా సిద్ధు పని చేసాడు. విమల్ కృష్ణ దీనికి దర్శకుడు. ఈ సినిమాతో సిద్ధు పేరు మారుమోగింది అనే చెప్పాలి.

siddhusivatmika.jpg

ఇప్పుడు ఈ 'డీజే టిల్లు' కి సీక్వెల్ గా 'టిల్లు స్క్వేర్' అనే సినిమా వస్తోంది. అది మార్చి 29న విడుదలకి సిద్ధం అవుతోంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక కాగా, ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకుడు. ఈ సినిమాకి నిర్మాతలు 'డీజే టిల్లు' ని నిర్మించిన సితార ఎంటర్ టైనమెంట్ సంస్థే ఈ సినిమాకూడా నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రచార వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి.

siddhuseerat.jpg

ఇవి కాకుండా సిద్ధు నటిస్తున్న ఇంకో రెండు సినిమాలు కూడా షూటింగ్ లో వున్నాయి. 'జాక్' అని ఒక సినిమా, ఇంకోటి 'తెలుసు కదా' అనే సినిమా. ఈ 'తెలుసు కదా' సినిమాతో ప్రముఖ టాలీవుడ్ స్టయిలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా ఆరంగేట్రం చేస్తోంది. మొన్న ఫిబ్రవరి 8న సిద్ధు పుట్టినరోజు జరుపుకున్నాడు, ఈ పార్టీకి అతనితో పనిచేస్తున్న నటీనటులు, అతని స్నేహితులు అందరూ వచ్చారు.

Updated Date - Feb 10 , 2024 | 11:40 AM