Pawan Kalyan: పోలింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..

ABN , Publish Date - May 16 , 2024 | 07:41 PM

మే 13న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పోలింగ్ తర్వాత జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైమ్ రియాక్ట్ అయ్యారు. తన కోసం నిలబడిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు. అందులో పిఠాపురం నియోజకవర్గంలో తనకోసం ప్రచారం చేసిన, తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపి.. మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మాటిచ్చారు.

Pawan Kalyan: పోలింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
Pawan Kalyan

మే 13న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పోలింగ్ (AP Elections 2024) తర్వాత జనసేన (Janasena) అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫస్ట్ టైమ్ రియాక్ట్ అయ్యారు. తన కోసం నిలబడిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. పిఠాపురం (Pithapuram) నియోజకవర్గ ప్రజలకు, పిఠాపురం టిడిపి ఇంచార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ‌ (SVSN Varma), అలాగే ఆయన కార్యకర్తలకు.. తన కోసం పిఠాపురం నియోజకవర్గంలోని ప్రతీ గడపకు వెళ్ళి ప్రచారం చేసిన సినీ, బుల్లితెర నటీనటులకు, ఎన్నారై జనసైనికులకు, పిఠాపురంలో మార్పుకు ముందడుగు వేసేందుకు పనిచేసిన ప్రతీ ఒక్క నాయకుడికి, జనసైనికుడికి, వీరమహిళలకు, తెలుగుదేశం, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, పౌర సమాజానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన లేఖలో.. (Pawan Kalyan Says Thanks)

‘‘ప్రియమైన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు నమస్కారం,

ఈ నెల 13న జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం అభ్యర్ధిగా పోటీ చేసిన నన్ను ఆదరించి అండగా నిలిచి మీరు చూపించిన ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు. పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నాను అని ప్రకటించగానే స్వచ్చందంగా తరలివచ్చి మీ కుటుంబ సభ్యుడిగా భావించి పని చేయడం ఎంతో ఆనందం కలిగించింది. నిన్న జరిగిన ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా రాత్రి 10 గంటల సమయం వరకూ పోలింగ్‌లో పాల్గొని రికార్డ్ స్థాయిలో 86.63 శాతం ఓటింగ్ నమోదు అవ్వడం అనేది మీ ప్రేమను తెలియజేస్తుంది. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జన సైనికులు, టిడిపి, బిజేపి కార్యకర్తలు వ్యవహరించిన తీరు అభినందనీయం.

వర్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని తెలియగానే ఎంతో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ తన సీట్ త్యాగం చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించిన పిఠాపురం టిడిపి ఇంచార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ‌గారికి, వారి కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికల్లో వర్మ గారు అందించిన సహకారం మరువలేనిది. భవిష్యత్తులో కచ్చితంగా ఆయన చట్టసభల్లో అడుగుపెట్టి ప్రజల తరపున బలంగా పని చేస్తారని నమ్ముతున్నాను. అలాగే రానున్న రోజుల్లో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ది కోసం వర్మ గారి అనుభవం వినియోగించుకుంటూ కలిసికట్టుగా ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాను. అలాగే నిన్న పుట్టినరోజు వేడుకలు చేసుకున్న వర్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్ళు ఆయన ఆయురారోగ్యాలతో, ప్రజా జీవితంలో కొనసాగాలని శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి వారి ఆశీస్సులు ఆయనపై ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.


Janasena-1.jpg

సినీ కుటుంబ సభ్యుల ప్రేమ కదిలించింది

పిఠాపురంలో నేను పోటీచేస్తున్నాను అని తెలియగానే తమ సినీ కుటుంబ సభ్యుడికి అండగా ఉండేందుకు తమ సినిమాలు, ధారావాహిక లకు గ్యాప్ ఇచ్చి ముందుకు వచ్చి పిఠాపురంలో ప్రతీ గడపకు వెళ్ళి ప్రచారం చేసిన సినీ, బుల్లి తెర నటీ, నటుల ప్రేమ నన్ను కదిలించింది. నా విజయం కాంక్షిస్తూ ఎంతోమంది అగ్ర కథానాయకుల నుంచి, నవతరం నటుల వరకు అందరూ మద్దతు ప్రకటించడం సంతోషాన్నిచ్చింది. ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

Janasena-2.jpg

అలాగే దేశ విదేశాల నుండి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తరలివచ్చి తమ మాతృభూమి అభివృద్ధి ఆకాంక్షను వెల్లడించిన ఎన్నారై జనసైనికులకు నా అభినందనలు. పిఠాపురంలో మార్పుకు ముందడుగు వేసేందుకు పనిచేసిన ప్రతీ ఒక్క నాయకుడికి, జనసైనికుడికి, వీరమహిళలకు, తెలుగుదేశం, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, పౌర సమాజానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో అందరినీ కలుపుకుంటూ పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని మాటిస్తున్నాను..’’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Updated Date - May 16 , 2024 | 07:46 PM