Manchu Family: ఇప్పుడు మనోజ్ పరిస్థితేంటి? మదర్ కూడా అటు వైపే..
ABN , Publish Date - Dec 17 , 2024 | 10:53 PM
మంచు ఫ్యామిలీలో వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇటీవల మంచు హీరోల మధ్య యుద్ధం జరగగా.. పోలీసులు కలగజేసుకుని కాస్త శాంతపరిచారు. కానీ మోహన్ బాబు భార్య నిర్మలా దేవి పుట్టినరోజున మరోసారి మనోజ్, విష్ణుల మధ్య వార్ జరగడంతో ఆ వార్‌లో విష్ణు తప్పు ఏం లేదని.. మోహన్ బాబు భార్య, మనోజ్ తల్లిగారైన నిర్మలా దేవి లెటర్ విడుదల చేశారు. దీంతో మంచు ఫ్యామిలీ వ్యవహారం మరింత హాట్‌గా మారింది.
మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో తలెత్తిన గొడవ రోజుకో మలుపు తీసుకుంటోంది. మొన్నటి వరకు మోహన్ బాబు, విష్ణు, మనోజ్.. పరస్పరం ఫిర్యాదులు చేసుకుని రచ్చకెక్కారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఈ వివాదానికి బ్రేక్ పడుతుందని అంతా అనుకున్న సమయంలో మళ్లీ మనోజ్, విష్ణుల మధ్య గొడవ మొదలైంది. తన తల్లి నిర్మలా దేవి పుట్టినరోజున మనోజ్ మరోసారి పోలీసుల దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించడం, విష్ణుపై ఆరోపణలు చేయడం, ముఖ్యంగా జనరేటర్‌లో పంచదార కలిసిన డీజిల్ పోశారనేలా ఆరోపణలు చేస్తూ.. కొన్ని ఫొటోలను కూడా విడుదల చేశారు. అయితే ఈ గొడవలో మంచు విష్ణుది తప్పేం లేదని.. తాజాగా మోహన్ బాబు భార్య నిర్మలా దేవి ఓ లేఖను విడుదల చేయడంతో.. అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుందో అర్థం కాక అంతా తలలు పట్టుకుంటున్నారు.
Also Read-Allu Arjun: అల్లు అర్జున్ బెయిల్ రద్దు? పోలీసుల షాకింగ్ డెసిషన్..
పహాడి షరీఫ్ పోలీసులకు ఆమె రాసిన లేఖలో షాకింగ్ విషయాలను నిర్మలా దేవి ప్రస్తావించారు. దీంతో ప్రస్తుతం ఈ లేఖ టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. అసలు ఆమె పోలీసులకు రాసిన లేఖలో ఏం చెప్పారంటే.. మంచు నిర్మల మోహన్ బాబు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్.. ఆమె మాటల్లోనే...
‘‘పహాడి షరీఫ్ పోలీస్ గారికి, నమస్కరించి వ్రాయునది ఏమనగా.. నేను అనగా, మంచు నిర్మలా మోహన్ బాబు, W/o. మంచు మోహన్ బాబు, వయసు: 64 సం॥లు, నివాసం: జల్పల్లిలోని మంచుటౌన్లో ఉంటున్నాను.. డిసెంబరు 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు అయిన విష్ణు మంచు జల్పల్లి ఇంటికి వచ్చి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడు. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్.. ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజ్ బయట పెట్టి, దాన్ని విష్ణు గొడవ చేసినట్టు లేనిపోని అభాండాలు వేసి పోలీస్ కంప్లయింట్ ఇచ్చినట్టు తెలిసింది.
నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే, నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకుని ఇంటికి వచ్చాడు. అలాగే తన రూములో ఉన్న సామాన్లు తీసుకున్నాడు. ఉన్న కొద్దిసేపు నాతోటి ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశాడు. నా చిన్న కొడుకైన మనోజ్‌కు ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో, అలాగే నా పెద్ద కొడుకు అయిన విష్ణుకి కూడా అంతే హక్కు ఉంది. నా పెద్ద కొడుకు అయిన విష్ణు దౌర్జన్యం చేయడం కానీ, మనుషులతో ఇంట్లోకి వచ్చి గొడవ చేయడం కానీ చేయలేదు..
మనోజ్ ఇచ్చిన కంప్లయింట్‌లో నిజం లేదు. ఈ ఇంట్లో పని చేస్తున్న వాళ్ళు కూడా 'మేమిక్కడ పని చేయలేమని'.. వాళ్ళే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంత మాత్రం లేదు. విష్ణు మా జల్పల్లి ఇంటికి వచ్చాడు. నా పుట్టిన రోజు సెలబ్రేట్ చేశాడు. విష్ణు గదిలో ఉన్న తన సామాన్లు తీసుకుని వెళ్ళిపోయాడు.. అంతకు మించి ఇక్కడ జరిగింది ఏమీ లేదని మీకు తెలియజేయుచున్నాను..’’.. అంటూ మంచు నిర్మల మోహన్ బాబు పోలీసులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.