రవితేజ 'ఈగల్'కు రజనీకాంత్ సినిమా నష్టం చేస్తుందా?

ABN , Publish Date - Jan 19 , 2024 | 09:19 AM

ఈ వారం, వచ్చే వారం పెద్ద తెలుగు సినిమా ఏదీ విడుదలవడం లేదు. సంక్రాంతి పండగకి రావాల్సిన రవితేజ 'ఈగల్' ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. పోటీ ఉండదు అని భావించిన అతనికి, రజినీకాంత్ పెద్ద పోటీ ఇస్తున్నారు. ఫిబ్రవరి 9 కి వాయిదా వేసి తప్పు చేశారేమో అని పరిశ్రమలో కొందరి అభిప్రాయం, మరి విడుదలయ్యాక చూడాలి ఏమవుతుందో...

రవితేజ 'ఈగల్'కు రజనీకాంత్ సినిమా నష్టం చేస్తుందా?
Ravi Teja from Eagle

రవితేజ నటించిన 'ఈగల్' సంక్రాంతికి విడుదలవ్వాలి, కానీ పండగ సినిమా నిర్మాతల అభ్యర్ధన మేరకు ఆ సినిమా విడుదల ఫిబ్రవరి 9 కి వాయిదా వేశారు. ఆ సినిమాకి పోటీ ఉండదు అని భావించారు, కానీ ఫిబ్రవరి 9న రజనీకాంత్ నటించిన 'లాల్ సలామ్' విడుదలవుతోంది. ఇది తమిళ, తెలుగు మిగతా భాషల్లో కూడా విడుదల అవుతోంది. ఇందులో రజనీకాంత్ ఒక ముఖ్య పాత్రలో కనపడతారని తెలుస్తోంది. ఈ సినిమాకి రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకురాలు. సందీప్ కిషన్ నటించిన 'ఊరు పేరు భైరవ కోన' అనే చిన్న సినిమా కూడా విడుదలవుతోంది. మరి రజినీకాంత్ సినిమాతో రవితేజ సినిమా నిలబడుతుందా, అని ఒక టాక్ నడుస్తోంది. (Ravi Teja is facing a stiff competition from Rajinikanth's Lal Saalam on February 9)

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ రవితేజ సినిమాకి పోటీ ఉండదు అని భావించి ఫిబ్రవరి 9 విడుదల అని పెట్టుకున్నారు. సంక్రాంతికి విడుదలైన సినిమాలు ఒక్క 'హనుమాన్' తప్పితే మిగతా సినిమాలన్నీ అంతంతమాత్రంగానే ఆడాయి అని చెప్పాలి. ఈ వారం ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవటం గమనార్హం. అలాగే వచ్చే వారం కూడా ఒక్కటైనా పెద్ద తెలుగు సినిమా విడుదలవడం లేదు, రెండు డబ్బింగ్ సినిమాలు మాత్రమే వున్నాయి. పాపం రవితేజ తన సినిమాని ఫిబ్రవరి 9 కి వాయిదా వేసుకొని తప్పు చేశారని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది.

Eagle.jpg

రవితేజ పుట్టినరోజు అయిన జనవరి 26న విడుదల చేస్తే ఆరోజు సెలవురోజు కూడా కావటంతో, రవితేజ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చేవని పరిశ్రమలో అనుకుంటున్నారు. అలాగే ఎక్కువ థియేటర్స్ కూడా దొరికేవని కూడా అంటున్నారు. మరి ఫిబ్రవరి 9 న రజినీకాంత్ సినిమా విడుదలవుతోంది అంటే, తమిళంలో, అలాగే మిగతా భాషల్లో కూడా ఆ సినిమాకే క్రేజ్ ఉంటుంది. రవితేజ తన 'ఈగల్' సినిమాని హిందీలో 'సహదేవ్' అనే పేరుతో విడుదల చేస్తున్నారు. అయితే ఈసారి హిందీలో ప్రచారం చేస్తారా, లేక డబ్బింగ్ చేసి ఊరుకుంటారా అనేది చూడాలి. ఏమైనా రవితేజ తన సినిమా ఫిబ్రవరి 9 కి వాయిదా వేసి తప్పు చేశారేమో అని పరిశ్రమలో ఒక చర్చ అయితే నడుస్తోంది.

Updated Date - Jan 19 , 2024 | 10:01 AM