Vikkatakavi Web Series Review: దేవతల గుట్టపై ఏం జరిగింది

ABN , Publish Date - Nov 29 , 2024 | 09:35 AM

నరేశ్‌ అగస్త్య ఏ తరహా పాత్రను అయినా అలవోకగా పోషించగల ప్రతిభ గల నటుడు. ‘మత్తు వదలరా’, 'సేనాపతి’, ‘పంచతంత్రం’, పరువు వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే విజయాలు అందుకున్నారు. తాజాగా ఆయన నటించిన  వెబ్‌ సిరీస్‌ ‘వికటకవి’.

వెబ్‌ సిరీస్‌ రివ్యూ: ‘వికటకవి’ (Vikkatakavi Web Series Review)
ఓటీటీ: జీ5(28-11-2024 నుంచి స్ట్రీమింగ్‌)
నటీనటులు: నరేశ్‌అగస్త్య, మేఘా ఆకాశ్‌ (Meghs Akash), షైజు, అమిత్‌ తివారీ, తారక్‌ పొన్నప్ప, రఘుకుంచె, నిమ్మల రవితేజ,  ముక్తార్‌ఖాన్‌ తదితరులు.

సంగీతం: అజయ్ అరసాడ  
నిర్మాత: ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, రామ్‌ తాళ్లూరి
దర్శకత్వం: ప్రదీప్‌ మద్దాలి (Pradeep Maddali)


నరేశ్‌ అగస్త్య ఏ తరహా పాత్రను అయినా అలవోకగా పోషించగల ప్రతిభ గల నటుడు. ‘మత్తు వదలరా’, 'సేనాపతి’, ‘పంచతంత్రం’, పరువు వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే విజయాలు అందుకున్నారు. తాజాగా ఆయన నటించిన  వెబ్‌ సిరీస్‌ ‘వికటకవి’. ప్రదీప్‌ మద్దాలి దర్శకత్వం వహించారు. మేఘా ఆకాష్‌ కథానాయిక.  జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ‘పరువు’ తర్వాత నరేష్‌ అగస్త్య, జీ5 కాంబోలో వచ్చిన ఈ సిరీస్‌ ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.. (zee5 Ott)

కథ: (Vikkatakavi Web Series Review)
రామకృష్ణ (నరేష్‌ అగస్త్య) డిటెక్టివ్‌. హైదరాబాద్‌లో కొన్ని కేసులు పరిష్కరించడానికి, కేసుల్లో చిక్కుముడులు విప్పడానికి పోలీసులు సైతం అతని సహాయం తీసుకుంటారు. రామకృష్ణ తెలివితేటలు చూసి తమ ఊరిలో సమాధానం దొరకని ప్రశ్నలకు, సమస్యలకు పరిష్కారం వెతికే సత్తా అతనికి ఉందని ఓ ప్రొఫెసర్‌ నమ్ముతాడు. ఆ నమ్మకంతో నల్లమల అటవీ ప్రాంతంలోని అమరగిరికి అతన్ని పంపుతాడు. శ్రీశైలం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురయ్యే గ్రామం కావడంతో ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమని ఆదేశిస్తుంది. అప్పటికి దాదాపు పాతికేళ్ల కిందట ఆ ఊరికి సమీపంలో ఉన్న దేవతల గుట్టపై జాతర జరుగుతున్న సమయంలో పెద్ద వర్షం కురిసి 100 మందికి పైగా ప్రజలు చనిపోతారు. దేవత శాపం వల్లే అలా జరిగిందని ఆ గ్రామస్థులు నమ్ముతారు. అప్పటి నుంచి ఆ గుట్ట పైకి ఎవరూ వెళ్లరు. పొరపాటున ఎవరైనా వెళితే, గతం మర్చిపోయి జీవచ్ఛవాల్లా మారిపోతారు. తన పరిశోధనలో భాగంగా అక్కడికి వెళ్లిన డిటెక్టివ్‌ రామకృష దేవతల గుట్టకు వెళ్లిన రామకృష్ణ ఏం తెలుసుకున్నాడు.  ఆ గుట్టపైకి వెళ్లి  మామూలుగా ఎలా రాగలిగాడు?  రామకృష్ణతోపాటు అమరగిరి రాజు రాజా నరసింహా (షిజు అబ్దుల్‌ రషీద్‌) మనవరాలు లక్ష్మి (మేఘా ఆకాష్‌) కూడా దేవతల గుట్ట మీదకు ఎందుకు వెళ్ళింది? అమరగిరికి  వచ్చిన శాపం ఏమిటి? ఏంటి అన్నది కుప్తంగా ఈ సిరీస్‌ కథ.  

evieew.jpeg

విశ్లేషణ: (Vikkatakavi Web Series Review)
ఈ సిరీస్‌ చూస్తున్న ప్రతి ఒక్కరికీ దేవతలగుట్టపై ఉన్న సమస్య, అక్కడుండే పరిణామాలు కచ్చితంగా ఎవరో ఒక వ్యక్తి చేస్తున్నాడనే అనిపిస్తుంది. అది ఎవరు? ఎందుకు చేస్తున్నారన్న విషయాన్ని ఆరు ఎపిసోడ్‌లలో  చెప్పారు. ‘వికటకవి’ సిరీస్‌ను తెరకెక్కించిన విధానం ఆసక్తిగా సాగుతుంది. మొదటి ఎపిసోడ్‌లో ఊరి సమస్య, ఇటు రామకృష్ణ తెలివితేటలను చూపించి.. టైమ్‌ వేస్ట్‌ చేయకుండా క్రిస్ప్‌గా కథానాయకుడిని, ప్రేక్షకుడిని అమరగిరి ప్రాంతానికి తీసుకొచ్చేశాడు దర్శకుడు. అదే క్రమంలో సైకాలజీ చదువుకొని ఊరికి వస్తున్న లక్ష్మీ(మేఘా ఆకాశ్‌) పరిచయమవుతుంది. గ్లామర్‌ హీరోయిన్‌ ఉందని లవ్‌, పాటలు, రొమాన్స్‌ అనే కమర్షియల్‌ అంశాలను ఇరికించకుండా సమస్య చుట్టూనే దర్శకుడు ట్రావెల్‌ చేశాడు. ఓ సమస్యతో సింపుల్‌గా మొదలైన కథను దేశ భక్తికి, పాక్‌ తీవ్రవాదానికి ముడిపెట్టడంతో సిరీస్‌ స్పాన్‌ పెరిగింది. దేవతల గుట్ట సమస్య పరిష్కారానికి వచ్చిన, రామకృష్ణకు ఊరి వాళ్ల నుంచి వ్యతిరేకత వచ్చినా, పోలీస్‌ ఆఫీసర్‌ (నిమ్మల రవితేజ) సాయంతో సాగించే ఇన్వెస్టిగేషన్‌ ఆసక్తికరంగా ఉంటుంది. గుట్టపైకి వెళ్లిన రామృకష్ణ మామూలుగా తిరిగి రావడం వెనుక చెప్పిన కారణం కూడా కథకు కనెక్ట్‌ అయింది. గుట్టపైన ఉన్న అంతుచిక్కని రహస్యానికి సంబంధించిన ఒక్కో చిక్కుముడి విప్పుతూ వీటన్నింటికీ కారణం వీరన్న (అమిత్‌ తివారీ) అని తెలిసిన తర్వాత అక్కడి నుంచి రామకృష్ణ సాగించే ఇన్వెస్టిగేషన్‌ మరో మలుపు తీసుకుంటుంది.

అప్పుడే అమరగిరి.. సంస్థానాధీశుడైన రాజనరసింహ రావు(షైజు) కుమారుడు మహదేవ్‌ (తారక్‌ పొన్నప్ప) గురించి రామకృష్ణ తెలుసుకొనే ట్విస్ట్‌ను ఎవరూ ఊహించలేరు. సిరీస్‌ మొదట్లో హైదరాబాద్‌ పోలీస్‌ స్టేషన్ లో  సన్నివేశంలో వచ్చే ఓ క్యారెక్టర్‌ కొన్ని మలుపు తర్వాత చాలా కీ రోల్‌ పోషిస్తుంది. కల్లు దుకాణంలో గ్యాంబ్లింగ్‌ ఆడే ఓ క్యారెక్టర్‌ కథను ఊహించని మలుపు తిప్పుతుంది. సాధారణ టీచర్‌ క్యారెక్టర్‌ హీరోకి ఓ దారి చూపించడంలో సాయపడుతుంది. కొనిర సన్నివేశాలను గ్రిప్పింగ్‌గా చూపించడంతో ప్రదీప్‌ మద్దాలి టాలెంట్‌ చూపించారు. చివరి రెండు ఎపిసోడ్స్‌ 25 ఏళ్ల  వెనక ఏం జరిగిందోనన్న ఫ్లాష్‌ బ్యాక్‌తో నడుస్తాయి. ఆ ఎపిసోడ్స్‌ కాస్త స్లోగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఫస్ట్‌ ఎపిసోడ్‌లో మత్స్యావతారం రిఫరెన్స్‌ చూపించిన దర్శకుడు.. జీవచ్ఛవాల్లా మారిన గ్రామ ప్రజలను మామూలే మనుషులు చేయడానికి కథానాయకుడు నదిలోనే పరిష్కారం కనిపెట్టడం ఆ రెండింటినీ కనెక్ట్‌ చేసిన తీరు బాగుంది. అమరగిరి సమస్యను పరిష్కరిస్తూ ఇచ్చిన ముగింపు బావుంది. మొదటి సీజన్‌ను కనెక్ట్‌ చేస్తూ ‘వికటకవి-2’ ఉంటుందని మేకర్స్‌ ప్రకటించారు. (Vikkatakavi Web Series Review)



రామకృష్ణగా డిటెక్టివ్‌ పాత్రలో నరేశ్‌ అగస్త్య (Naresh Agastya) పర్ఫెక్ట్‌గా యాప్ట్‌ అయ్యారు. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. మేఘా ఆకాశ్‌ హుందాగా కనిపించింది. ముక్తార్‌ ఖాన్‌, అమిత్‌ తివారీ, షైజు, రఘు కుంచె తదితరులు పాత్రల మేర చక్కగా నటించారు. 40-50వ దశకం.. అప్పటి వాతావరణాన్ని చూపించడానికి టీమ్‌ పడిన కష్టం స్ర్కీన్‌పై కనిపించింది. తెలంగాణ యాస సంభాషణలు, కాస్ట్యూమ్స్‌ ఆనాటి నేటివిటీకి అద్దం పట్టాయి. థ్రిల్లర్‌ సిరీస్‌లకు రచయిత, దర్శకులు పాటించే సూత్రం చివరి వరకు సస్పెన్స్‌ మైంటైన్‌ చేయడం! ఒక్కోసారి అనవసరమైన  క్యారెక్టర్లు తెరపైకి రావడం, ఆ క్యారెక్టర్ పై అనుమానం కలిగే సన్నివేశాలను చిత్రీకరించడం జరుగుతుంటాయి. అవేమీ లేకుండా ‘వికటకవి’ని రూపొందించిన దర్శకుడు ప్రదీప్‌ మద్దాలి - తేజ దేశ్‌రాజ్‌లను అభినందించాలి. దర్శకుడు కథను ఎక్కడా పక్కదారి పట్టించలేదు. టెక్నికల్‌గా మంచి అవుట్‌పుట్‌ ఇచ్చాడు. కథను క్రిస్పీ గా ముందుకు నడిపించాడు.  1970లో కథ మొదలై, 1940కు వెళ్లి మళ్లీ 70కు వస్తుంది. ఆ జానర్‌ వల్ల ఈ సిరీస్‌  కొత్తగా ఉంది. ఒక థ్రిల్లింగ్‌ సిరీస్‌కు కావాల్సిన సెటప్‌ క్రియేట్‌ చేయడమే కాదు.. మంచి స్టోరీ, స్క్రీన్  ప్లే ఇచ్చారు. బడ్జెట్‌ పరిమితి పలు సన్నివేశాల్లో కనిపించింది. కెమెరా వర్క్‌ బావుంది. అజయ్‌ అరసాడ నేపథ్య సంగీతం కథకు పర్ఫెక్ట్‌గా యాప్ట్‌ అయింది. ఆర్‌ఆర్‌ స్లోగా కథలో లీనం చేసేలా ఉంది. ఇందులో ఒక్కో ఎపిసోడ్‌ 25 నిమిషాల నుంచి 40 నిమిషాల మధ్యే ఉండడం ఒక ప్లస్‌. ఇందులో అసభ్యకర సంభాషణలు, సన్నివేశాలు ఒక్కటి కూడా లేదు. కుటుంబంతో కలిసి హాయిగా చూసే చక్కని సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇది.  

ట్యాగ్‌లైన్‌: థ్రిల్లింగ్‌ దేవతల గుట్ట


Updated Date - Nov 29 , 2024 | 09:36 AM