Eagle Movie Review: రవితేజ సినిమా ఎలా ఉందంటే...

ABN , Publish Date - Feb 09 , 2024 | 01:09 PM

రవితేజ, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తో కలిసి చేసిన 'ఈగల్' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఎలా వుందో చదవండి.

Eagle Movie Review: రవితేజ సినిమా ఎలా ఉందంటే...
Eagle Movie Review

సినిమా: ఈగల్

నటీనటులు: రవి తేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, శివన్నారాయణ, శ్రీనివాస రెడ్డి తదితరులు

ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, కామిల్ ప్లోస్కి, కర్మ చావ్లా

సంగీతం: దేవ్ జాండ్

కథ, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని

నిర్మాత: టిజి విశ్వప్రసాద్

విడుదల: 9 ఫిబ్రవరి, 2024

రేటింగ్: 2 (రెండు)

-- సురేష్ కవిరాయని

రవితేజ కథానాయకుడిగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా 'ఈగల్' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ ఇంతకు ముందు చేసిన సినిమా 'టైగర్ నాగేశ్వర రావు' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఛాయాగ్రాహకుడిగా వుండి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమనేనితో చేతులు కలిపి ఈ 'ఈగల్' చేశారు. దీనికి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టిజి విశ్వప్రసాద్ నిర్మాత. రవితేజ కెరీర్‌లో ఈ సినిమా కూడా పెద్ద బడ్జెట్ మూవీ అవుతుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ ఒక ముఖ్యపాత్రలో కనిపించగా, కావ్య థాపర్ కథానాయికగా నటించింది. ఈ సినిమా ప్రచార చిత్రాలు ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇంతకీ ఈ సినిమా రవితేజకి విజయాన్ని అందించిందా లేదా చూద్దాం.

Eagle.jpg

Eagle story కథ:

ఢిల్లీలోని ఒక జాతీయ వార్తాపత్రికలో పనిచేసే జర్నలిస్ట్ నళిని రావు (అనుపమ పరమేశ్వరన్) అనుకోకుండా ఒక చేనేత వస్త్రాన్ని చూస్తుంది, ఆసక్తిగా అది ఎక్కడనుండి వచ్చింది, అది తయారు చేసే వ్యక్తి గురించి ఆరా తీసి ఒక చిన్న వార్తగా పత్రికలో రాస్తుంది. ఆ వార్త చూసిన ఇంటిలిజెన్స్, రా డిపార్టుమెంట్స్ రంగంలోకి దిగి ఆ పేపర్ ఒకరోజు ప్రింట్ అవకుండా అడ్డుకొని, ఆ వార్త ఎలా వచ్చింది, ఎవరు రాసారు? అని ఆరా తీస్తారు. పత్రిక యాజమాన్యం ఆ వార్త రాసిన నళినిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు. అప్పుడు నళినికి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగి మదనపల్లి వచ్చి అక్కడ తన పరిశోధన ప్రారంభిస్తుంది. అక్కడ వున్న పోలీసు అధికారి చెంగల్ రెడ్డి (మిర్చి కిరణ్), ఎంఎల్ఏ (అజయ్ ఘోష్) అతని పిఏ (శ్రీనివాస్ రెడ్డి) వీళ్లందరినీ అడిగితే అతని పేరు సహదేవ్ వర్మ (రవి తేజ) అని తెలుస్తుంది. అతను అక్కడ పత్తిని పండించి చేనేత కార్మికులకు అండగా వున్నాడు అని తెలుస్తోంది. అతని గురించి చాలా లోతుగా పరిశోధన మొదలుపెట్టిన నళినికి సహదేవ్ వర్మ గురించి అనేక ఆసక్తికరమైన అంశాలు తెలుస్తాయి. భారతదేశంతో పాటు విదేశీ ప్రభుత్వాలు కూడా ఈ సహదేవ్ వర్మ గురించి వెదుకుతున్నారని, ఎక్కడో యూరప్‌లో మారణాయుధాలు ఈగల్ పేరుపై దొంగతనంగా సప్లై చేసే అతను.. ఇక్కడ సహదేవ్ వర్మగా ఎందుకున్నాడు? అతని భార్య రచన (కావ్య థాపర్)కి ఏమైంది? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ప్రశాంత్ నీల్ 'కేజిఎఫ్' అనే సినిమా తీసి చాలామంది యువ దర్శకులను నాశనం చేశాడేమో అనిపిస్తుంది. దానర్థం అతను మంచి దర్శకుడు కాదని కాదు, గొప్ప దర్శకుడు, గొప్ప సినిమా తీశాడు. కానీ ఇప్పుడొస్తున్న యువ దర్శకులు అందరూ తమ సినిమాలని 'కేజీఎఫ్' సినిమాలా తీయాలని అనుకుంటూ భారీ బడ్జెట్‌ పెట్టి.. పెద్ద పెద్ద గన్స్, విచిత్రమైన మారణాయుధాలు చూపించి, నేపధ్యం కొండలు, మాఫియా పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తీసిన ఈ 'ఈగల్' కూడా అదే కోవలోకి వస్తుంది. సినిమా అనుపమ పరమేశ్వరన్ కథ చెప్పడంతో మొదలవుతుంది. అక్కడనుండి ఆమె పరిశోధనకు మదనపల్లె వస్తుంది, ఇక అక్కడనుండి రవితేజ పాత్ర కోసం బిల్డప్ మొదలవుతుంది. కథ ఏమీ లేకుండా వూరికే అందరూ రవితేజ పాత్ర కోసం బిల్డప్ ఇచ్చుకుంటూ వెళతారు. సినిమా మొదలైన 45 నిముషాల వరకు రవి తేజ పాత్ర అసలు తెరమీదకి రాదు అంటే దర్శకుడు ఈ బిల్డప్ ల మీద ఎంత దృష్టి పెట్టాడో ఆలోచించండి.

Eagle.jpg

అదీ కాకుండా దర్శకుడు ప్రస్తుత కథ నుండి, వెనక్కి తీసుకు వెళతాడు (ఫ్లాష్ బ్యాక్) అందులో కూడా మళ్ళీ ఇంకో వెనకాల కథ, ప్రేక్షకుడికి అది ప్రస్తుత కథా.. లేదా వెనకాల జరుగుతున్న కథా, ఇలా కాస్త గందరగోళంగానే ఉంటుంది. టూకీగా చెప్పాలంటే మారణాయుధాలని దొంగ రవాణా చేసి యూరప్ దేశాల్లో ఈగల్ గా పేరొంది తుపాకీ అద్భుతంగా పేల్చగల వ్యక్తి.. అదే మారణాయుధాలని ఎక్కడ దొంగ రవాణా అవుతున్నా పట్టుకొని తనదగ్గర ఉంచుకుంటాడు, ఎందుకు? దాని వెనకాల వుండే నేపధ్యం ఏమిటి అనేది కథ. వినటానికి చాలా బాగుంది, ఇది బాగా చెప్పొచ్చు కూడా. కానీ దర్శకుడు ఈ కథనే చిలవలు పలవలుగా చేసి, అటు ఇటు తిప్పి, ఎంతసేపూ ఒక్కో సన్నివేశం మీదే దృష్టి పెట్టాడు కానీ, కథ, కథనం మీద సరిగ్గా దృష్టి పెట్టలేదు. అలా పెట్టి ఉంటే ఈ సినిమా బాగా వచ్చి ఉండేది అనిపిస్తుంది.

రెండో సగంలో రవితేజ, కావ్య థాపర్ మధ్య నడిచే సన్నివేశాలు కథానాయకుడికి తుపాకీ పేల్చడంలో ఎంత ప్రవేశం వుందో చెప్పటం కోసం అన్నట్టుగా తుపాకీతో సమాధానాలు చెప్పించాడు. అలాగే సహదేవ్ వర్మ వుండే ఇంటి దగ్గర ఏమి జరిగింది అనేది చిన్న పిల్లాడితో ఫ్లాష్ బ్యాక్ చెప్పించాడు, అతను గ్రనేడ్స్, గన్స్, పోలీసులు, మిలిటరీ వీటన్నిటి గురించి చెప్పేస్తూ ఉంటాడు. ఇలాంటివి విచిత్రాలు చాలా వున్నాయి సినిమాలో. రా చీఫ్ మధుబాల, డిఫెన్స్ మినిస్టర్, మిగతా ఇంటిలిజెన్స్ సభ్యులు అందరూ ఢిల్లీలో ఒక గదిలో మదనపల్లిలో జరిగే విధ్వంసాన్ని సీసీ కెమెరాల్లో చూస్తూ ఉలిక్కిపడుతూ వుంటారు. అలాగే కొన్ని కొన్ని సన్నివేశాలు మరీ నవ్వు తెప్పిస్తాయి. టపాకాయలు పేల్చినట్టు తుపాకీలు, గ్రనేడ్స్, మిస్సైల్స్ లాంటివి పేలుతూ ఉంటాయి, హెలికాఫ్టర్ కూడా అక్కడే ఆ ఇరుకుగా వుండే ఇంటిమీద ఎగురుతూ ఉంటుంది, కొన్నయితే మరీ సినిమాటిక్ గా అనిపిస్తూ ఉంటాయి. అనుపమ మదనపల్లిలో ఉంటుంది, ఏదో తెలుసుకోవాలంటే అజయ్ (నవదీప్)ని అడగాలి అంటారు, వెంటనే పోలాండ్ రాజధాని వార్సా (Warsaw) లో నవదీప్ తో మాట్లాడుతూ కనిపిస్తుంది. దర్శకుడు కథని వెనక్కి, ప్రస్తుతానికి.. మళ్ళీ వెనక్కి ఇలా సరిగ్గా చెప్పలేకపోయాడు అనిపిస్తుంది.

Eagle.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే, రవితేజ పాత్రలో రెండు వైవిధ్యాలు కనబడతాయి. ఒకటి యంగ్, రెండోది మధ్యవయస్కుడి పాత్ర. అతనికి మాటలు కూడా చాలా తక్కువే వున్నాయి. రవితేజ తన పాత్ర బాగా చేశాడు, ముఖ్యంగా మధ్యవయస్కుడి పాత్ర ఆయనకు కొత్తగా ఉంది.. బాగుంది కూడా. ఇక నవదీప్, రవితేజతో పాటు సినిమా అంతా కనిపిస్తాడు. అనుపమ పరమేశ్వరన్‌కి ఇదేమి పెద్దగా పేరు తెచ్చే పాత్ర కాదు కానీ తన పరిధి మేరకి చేసింది. కావ్య థాపర్ రెండో సగంలో వస్తుంది. అజయ్ ఘోష్, శ్రీనివాస రెడ్డి, మిర్చి కిరణ్, శివన్నారాయణ అందరూ తమ పాత్రల పరిధి మేరకి చేశారు. మధుబాల రా చీఫ్‌గా సూట్ కాలేదు. అవసరాల శ్రీనివాస్ పాత్రని సరిగ్గా వాడుకోలేదు. ఛాయాగ్రహణం బాగుంది, నేపధ్య సంగీతం కూడా చాలా బాగుంది. మాటలు బాగా రాశారు.

చివరగా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కేవలం ఒక్కో సన్నివేశం బాగా రావాలని దృష్టి పెట్టి చేసినట్టుగా ఈ 'ఈగల్' సినిమా కనిపిస్తుంది. కథమీద దృష్టి పెట్టి, కథని ఫ్లాష్ బ్యాక్ లతో కాకుండా, నేరుగా వెండితెర పైన అర్థం అయేటట్టు చూపిస్తే బాగుందేమో అనిపిస్తుంది. భారీ బడ్జెట్ పెట్టి తీసిన ఒక యాక్షన్ సినిమాని, దర్శకుడు సరైన విధంగా చూపించడంలో పూర్తిగా విఫలం అయ్యాడు అనిపిస్తుంది.

Updated Date - Feb 09 , 2024 | 02:27 PM