Aadujeevitham Movie Review: 'సలార్' రాజమన్నార్ నటించిన సినిమా ఎలావుందంటే...

ABN , Publish Date - Mar 28 , 2024 | 06:36 PM

మలయాళం నవల 'ఆడుజీవితం' ఆధారంగా అదే పేరుతో తెలుగులో విడుదలైన సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధానపాత్ర పోషించారు. బ్లెస్సి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా వుందో చదవండి.

Aadujeevitham Movie Review: 'సలార్' రాజమన్నార్ నటించిన సినిమా ఎలావుందంటే...
Aadujeevitham Movie Review

సినిమా: ఆడుజీవితం

నటీనటులు: పృథ్విరాజ్ సుకుమారన్, అమలా పాల్, జిమ్మీ జీన్ లూయిస్, శోభా మోహన్, కెఆర్ గోకుల్ తదితరులు

ఛాయాగ్రహణం: సునీల్ కెఎస్

సంగీతం: ఏఆర్ రహమాన్

నిర్మాతలు: బ్లెస్సి, జిమ్మీ జీన్ లూయిస్, స్టీవెన్ ఆడమ్స్

కథనం, దర్శకత్వం: బ్లెస్సి

విడుదల తేదీ: మార్చి 28, 2024

రేటింగ్: 2.5

-- సురేష్ కవిరాయని

మలయాళం నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ గురించి తెలుగులో అంతగా పరిచయం లేదు. ప్రభాస్ తో ఈమధ్యనే విడుదలైన 'సలార్' సినిమాలో నటించిన పృథ్విరాజ్ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అతను నటించిన 'గోట్ లైఫ్' (The Goat Life) అనే మలయాళం సినిమాని తెలుగులో 'ఆడుజీవితం' పేరుతో ఈరోజు విడుదల చేశారు. ఇది యధార్ధ సంఘటనల ఆధారంగా రూపొందించిన సినిమా. బెన్యామీన్ (Benyamin) అనే రచయిత 2008లో 'ఆడుజీవితం' అనే పుస్తకం రాసారు, ఇది అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకం. ఇందులో రచయిత తనకి జరిగిన అనుభవాలను పొందుపరిచి ఆ నవలను రాశారు. ఉద్యోగాలకోసం కేరళకి చెందిన ఒక యువకుడు సౌదీ వెళ్లి అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో చిక్కుకుంటాడు, అక్కడి భాష తెలియదు, ఎడారి ప్రాంతం, దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకున్న అతను ఎలా బయట పడ్డాడు, అతనికి ఎదురైన సంఘటనలు ఏంటి అనేది ఈ నవల, అదే విషయం సినిమాలో చెప్పారు. పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో కనిపిస్తే, అమల పాల్ అతనికి జోడీగా నటించారు. చాలా సంవత్సరాలపాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. (Aadujeevitham Movie Review)

aadujeevitham.jpg

Aadujeevitham story కథ:

నజీబ్ మహమ్మద్ (పృథ్విరాజ్ సుకుమారన్) కేరళలో భార్య (అమల పాల్), తల్లి (శోభా మోహన్) తో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఐదో తరగతి వరకు చదువుకున్న నజీబ్ భార్య గర్భవతి. పుట్టబోయే బిడ్డ కోసం, తన కుటుంబం కోసం, భవిష్యత్తులో బాగుండాలని, బాగా డబ్బు సంపాదించాలి అనుకుంటాడు. తన స్నేహితుడు బంధువు ఒకతను సౌదీ పంపిస్తాను అంటే ఇల్లు తాకట్టు పెట్టి 30 వేలు అతనికి ఇస్తాడు. నజీబ్ తో పాటు ఇంకో స్నేహితుడు హకీం (కెఆర్ గోకుల్) కూడా సౌదీ వస్తాను అంటే ఇద్దరూ వెళతారు. ఏజెంట్ మోసం చేసిన కారణంగా, ఇద్దరికీ సౌదీలో ఏమి చెయ్యాలో తెలియదు. అప్పుడు ఒక సౌదీ ఖఫీల్ (తాలిబ్ అల్ బలుషి) ఈ స్నేహితులిద్దరిని విడదీసి, పట్టణాలకు దూరాంగా వున్న ఎడారి ప్రాంతానికి తీసుకుపోయి గొర్రెలు, ఒంటెలు కాపరిగా పెట్టేస్తాడు. అక్కడ సరైన సదుపాయాలు లేక, మాట్లాడటానికి వేరే మనిషి లేక, బయటి ప్రాంతంతో సంబంధంలేని, మంచినీళ్లు కూడా సరిగా దొరకని ఆ ప్రాంతంలో నజీబ్ ఎలా జీవించాడు? తప్పించుకునే ప్రయత్నం చేసినప్పుడు ఖఫీల్ ఏమిచేసాడు? అతని స్నేహితుడు పరిస్థితి ఏంటి? ఆఫ్రికన్ అయిన ఇబ్రహీం కదిరి (జిమ్మీ జీన్ లోయిస్) ఎక్కడనుండి వచ్చాడు? అతనికి ఈ స్నేహితులకి ఏంటి సంబంధం? ఇవన్నీ తెలియాలంటే 'ఆడుజీవితం' సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

'ఆడుజీవితం' అనే సినిమా అదే పేరుతో వచ్చిన మలయాళం నవల ఆధారంగా తీసిన కథ. సౌదీకి ఉద్యోగాల కోసం వెళ్లిన అనేక మంది భారతీయులు మోసపోతున్నారు, అక్కడ ఏవో పనులు చేసి కొన్ని సంవత్సరాల తరబడి చిక్కుకుంటున్నారు. కొందరు బతికి బట్టగలికి బయటపడుతున్నారు, మిగతా వాళ్ళు అక్కడ దుర్భర జీవితం గడుపుతున్నారు. సౌదీ ఎడారిలో ఒక మారుమూల ప్రాంతంలో ఎటువంటి మనుషులు లేని ప్రదేశంలో చిక్కుకున్న భారతీయుడు నజీబ్ కథే ఈ 'ఆడుజీవితం' సినిమా. దర్శకుడు బ్లెస్సి ఆ సంఘటనలను యథాతథంగా చూపించటంలో కొంత వరకు సఫలం అయ్యాడు. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాడు అని ఈ సినిమా విడుదలకి ముందు ప్రచారంలో చెప్పారు.

thegoatlifeone.jpg

అలాగే మలయాళం సినిమా అనగానే సహజత్వానికి దగ్గరగా వుండే కథలు వస్తాయి అని మొదటి నుండీ అనుకుంటూ వుంటారు. అలంటి సినిమాలు ఎన్నో వచ్చాయి కూడా. ఈ సినిమా కూడా దర్శకుడు సహజత్వానికి దగ్గరగా వుండేటట్టు సన్నివేశాలని మలిచారు. ఎడారి ప్రాంతంలో భాష సరిగ్గా తెలియక, మంచి నీళ్లు లేక, మాట్లాడటానికి మనుషులు లేని ప్రాంతంలో ఒక వ్యక్తి ఎలా బతకగలిగాడు అనే సన్నివేశాలు బాగున్నాయి. అయితే సినిమా కథ అంతా చాలా నెమ్మదిగా సాగుతూ ఉంటుంది. తప్పించుకునే ప్రయత్నంలో నజీబ్ అనే అతను తన స్నేహితుడితో సాహసమే చేస్తాడు, ఆ సన్నివేశాలని కొంచెం ఆసక్తికరంగా చూపిస్తే బాగుండేది అనిపిస్తుంది. ఆ ఎడారిలో తప్పించుకునే క్రమంలో వచ్చే సన్నివేశాలు చాలాసేపు చూపించడంతో ప్రేక్షకుడికి కొంచెం బోర్ గా ఫీలవుతాడు.

అయితే ఈ సినిమాలో సందేహాలు కూడా చాలానే వున్నాయి. ఎందుకంటే కేరళ నుండి వచ్చిన ముస్లిం అబ్బాయికి ఒక్క ముక్క కూడా హిందీ రాకపోవటం ఆశ్చర్యకరం. ఈ తెలుగు డబ్బింగ్ సినిమాలో అతను తెలంగాణా నుంచి వచ్చాను అంటాడు, అదీ మరీ విడ్డూరం. ఎందుకంటే తెలంగాణాలో వుండే ముస్లిం లకి హిందీ కొంచెమైనా వచ్చి ఉంటుంది. అసలు ఒక్క హిందీ పదం కూడా అర్థం కానట్టు సినిమాలో చూపించారు. 2008లో రాసిన నవల అని చెపుతున్నారు కానీ అప్పటికి తెలంగాణా ఇంకా ఏర్పడలేదు కూడా. అలాగే మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన ఆఫ్రికన్ సడన్ గా మాయం అయిపోతాడు, చివర్లో మిస్సింగ్ పర్సన్స్ లో చూపించేస్తారు, అతనికి ఏమైనట్టు. ఇలాంటివి సినిమాలో చాలానే వున్నాయి. కొన్ని సన్నివేశాలు మరీ లాగదీసినట్టుగా ఉంటాయి.

ఈ సినిమాకి మాత్రం ప్రధాన హైలైట్ ఏఆర్ రహమాన్ సంగీతం అనే చెప్పాలి. అతను ఈ సినిమాకి ఇచ్చిన నేపధ్య సంగీతం సినిమాని నిలబెట్టింది అనే చెప్పాలి. ఒక పాట మలయాళం పాటనే పెట్టేసారు అనిపించింది. అలాగే 'ఆడు' అనే పదానికి తమిళ భాషలో అర్ధం మేక అని, అందుకని 'ఆడుజీవితం' అనే తమిళ సినిమా టైటిల్ నే తెలుగుకి కూడా పెట్టేశారు. అందుకని తెలుగువాళ్ళకు ఆ టైటిల్ సరిగా అర్థంకాక ఈ సినిమాపై అంతగా ఆసక్తి చూపించలేదు అని కూడా అర్థం అవుతోంది. పృథ్విరాజ్ సుకుమారన్ తన నటనతో అందరినీ ఆకట్టుకుంటాడు, అతనికి, ఈ సినిమాకి అవార్డులు వస్తే రావచ్చు కానీ, తెలుగు ప్రేక్షకులకి మాత్రం ఈ సినిమా అంతగా సరిపడకపోవచ్చు.

aadujeevithamone.jpg

ఈ సినిమా చూస్తున్నంతసేపు మలయాళం సినిమా చూస్తున్నట్టుగానే ఉంటుంది. సౌదీ భాష మాట్లాడేటప్పుడు కొన్ని మాటలకి తెలుగులో సబ్ టైటిల్స్ వేశారు, కొన్ని మాటలకి వెయ్యలేదు. అవన్నీ సరిగ్గా అర్థం కాకపోవటంతో ప్రేక్షకుడు కొంచెం అసహనం ఫీల్ అవుతాడు. ఎడారిలో నీటికోసం పరితపించినప్పుడు, నడవలేక ఎటువంటి మానసిక పరిస్థితులకి లోనవుతారు అనే సన్నివేశాలు కొన్ని బాగున్నాయి. అమల పాల్ పాత్ర కేవలం పాటకి, ఇంకో రెండు మూడు సన్నివేశాలకు పరిమితం చేసేసారు. జిమ్మీ జీన్ లూయిస్, కెఆర్ గోకుల్ తమ పాత్రల పరిధి మేరకి నటించారు.

చివరగా 'ఆడుజీవితం' సినిమా తెలుగు ప్రేక్షకులకి అంతగా సరిపడక పోవచ్చు. నత్తనడకగా సాగే ఈ సినిమాలో ఏఆర్ రహమాన్ నేపధ్య సంగీతం, పృథ్విరాజ్ సుకుమారన్ నటన బాగుంటాయి. నటులకి, సాంకేతిక నిపుణలకి, సినిమాకి అవార్డులు వచ్చే అవకాశం వుంది. ఎడారిలో తప్పించుకునే తీరు ఆసక్తికరంగా చూపించి ఉంటే సినిమా బాగుండేదేమో? ఈ సినిమా చూడటానికి ప్రేక్షకుడికి కొంచెం సహనం ఉండాలి.

Updated Date - Mar 28 , 2024 | 07:15 PM