Naa Saami Ranga Movie Review: నాగార్జున సినిమా ఎలా ఉందంటే...

ABN , Publish Date - Jan 14 , 2024 | 01:54 PM

అక్కినేని నాగార్జున మరోసారి పల్లెటూరి నేపథ్యంతో వున్న సినిమా 'నా సామి రంగ' తో సంక్రాంతి పండగకు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విజయ్ బిన్ని దర్శకుడిగా ఆరంగేట్రం చేసిన ఈ సినిమా ఎలా వుందో చదవండి.

Naa Saami Ranga Movie Review: నాగార్జున సినిమా ఎలా ఉందంటే...
Naa Saami Ranga movie review

సినిమా: నా సామి రంగ

నటీనటులు: అక్కినేని నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, నాసర్, రవి రమేష్, ఆషిక రంగనాథ్, మిర్న మీనన్, రుక్షర్ థిల్లాన్, షబీర్ కల్లరక్కల్ (Shabeer Kallarakkal) తదితరులు

ఛాయాగ్రహణం: దాశరధి శివేంద్ర

సంగీతం: ఎంఎం కీరవాణి

రచన, మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ

నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి (Srinivasaa Chitturi)

కథనం, దర్శకత్వం: విజయ్ బిన్నీ

రేటింగ్: 3

-- సురేష్ కవిరాయని

అక్కినేని నాగార్జున ఇంతకు ముందు రెండు సినిమాలు 'సోగ్గాడే చిన్ని నాయనా', 'బంగార్రాజు' సంక్రాంతికి విడుదలచేసి విజయాన్ని అందుకున్నారు. ఈసారి కూడా సంక్రాంతికి ఎలా అయినా విడుదల చెయ్యాలని 'నా సామి రంగ' సినిమాని మూడు నెలల్లో పూర్తి చేసి అనుకున్నట్టుగానే ఈరోజు (జనవరి 14) న విడుదల చేశారు. నాగార్జునతో పాటు ఇందులో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ రెండు ముఖ్య పాత్రల్లో కనపడతారు. ఆషిక రంగనాథ్ నాగార్జున పక్కన కథానాయికగా నటించింది. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందించటం ఆసక్తికరం. మలయాళం సినిమా 'పొరింజు మరియం జోస్' ఆధారంగా తెలుగుదనానికి అనుగుణంగా రచయిత ప్రసన్న కుమార్ కొన్ని మార్పులు చేసి ఈ 'నా సామి రంగ' కథని తయారుచేశారు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. (Naa Saami Ranga movie review)

naasaamirangaposter.jpg

Naa Saami Ranga story కథ:

ఈ కథ అంబాజీపేటలో మొదలవుతుంది. అంజి (అల్లరి నరేష్) చిన్నప్పుడే అమ్మని పోగొట్టుకుంటాడు, కానీ కిష్టయ్య (నాగార్జున) అంజిని తన సొంత తమ్ముడిగా చూసుకుంటూ కలిసి మెలిసి వుంటారు. సాయం చేసినందుకు అంబాజీపేట ఊరి ప్రెసిడెంట్ పెద్దయ్య (నాజర్)కు అమితమైన గౌరవం ఇస్తాడు కిష్టయ్య. ప్రెసిడెంట్ కూడా కిష్టయ్యని తన సొంత మనిషిలా చూసుకుంటాడు. కిష్టయ్య, వరాలు (ఆషికా రంగనాథ్) చిన్నప్పటినుండి స్నేహితులు, ప్రేమించుకుంటారు, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటారు కానీ, వరాలు తండ్రి వరదరాజులు (రావు రమేశ్) ప్రెసిడెంట్ కొడుకు దాసు (షబ్బీర్ కాళ్లరక్కల్)కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు. కానీ కిష్టయ్య, వరాలు ప్రేమించుకున్నారని తెలిసి ప్రెసిడెంట్ తన కొడుక్కి చేసుకోను అంటాడు. కానీ వరాలు తండ్రికి మాత్రం ఆమె.. కిష్టయ్యని చేసుకోవడానికి ఇష్టపడడు, అందుకని ఒక షరతు పెడతాడు. ఈలోగా అంబాజీపేట కుర్రాడు భాస్కర్ (రాజ్ తరుణ్), పక్కూరు జగ్గన్నపేట ప్రెసిడెంట్ కుమార్తె కుమారి (రుక్షర్ థిల్లాన్) తో ప్రేమలో పడతాడు, ఆ ప్రేమ ఈ రెండు గ్రామాల మధ్య వైరం తెస్తుంది. ఇంకో పక్క ప్రెసిడెంట్ కొడుకు దాసు తనని కాదని వరాలు ఎలా కిష్టయ్యని పెళ్లి చేసుకుంటుందో చూస్తా అని పగ పడతాడు. ఇంతకీ వరాలు తండ్రి ఏమి షరతు విధించాడు? భాస్కర్, కుమారిల ప్రేమ పెళ్లివరకు వెళ్లిందా? కిష్టయ్యని చంపడానికి వచ్చిన దాసుని, అంజి ఏమి చేశాడు? సంక్రాంతి నాడు వచ్చే ప్రభల తీర్ధం పండగ ఎందుకు అంత ప్రాముఖ్యం అక్కడ? ఇవన్నీ తెలుసుకోవాలంటే 'నా సామిరంగ' సినిమా చూడాల్సిందే.

Naa-Saami-Ranga.jpg

విశ్లేషణ:

నాగార్జున ఇంతకు ముందు 'సోగ్గాడే చిన్ని నాయనా', 'బంగార్రాజు' సినిమాలు సంక్రాంతికి విడుదల చేసి విజయం సాధించారు. ఆ రెండు సినిమాలకి నేపధ్యం పల్లెటూరు, ఆ వూర్లో వుండే తగాదాలు, పండగ వాతావరణం. ఇప్పుడు 'నా సామి రంగ' లో కూడా అలాంటి నేపధ్యం వున్న కథనే ఎంచుకున్నారు నాగార్జున. దీనికి విజయ్ బిన్నీని దర్శకుడిగా పెట్టుకున్నారు. అతను కొరియోగ్రాఫర్‌గా పని చేశాడు. మలయాళం సినిమా 'పొరింజు మరియం జోస్' ని గోదావరి జిల్లాలోని ప్రాముఖ్యం వహించిన ప్రభల తీర్ధం పండగ నేపధ్యంగా మార్చారు. అది కూడా సంక్రాంతికి వచ్చే పండగే. అందుకే నాగార్జున ఈ సినిమాని సంక్రాంతి పండగకి పట్టుబట్టి మరీ విడుదల చెయ్యాలనే ఉద్దేశంతో మూడు నెలల్లో పూర్తి చేశారు. అది గొప్ప విషయమే. అందుకు క్రెడిట్ విజయ్ బిన్నీకి చెందాలి, దర్శకుడిగా ఈ సినిమాతో అరంగేట్రం చేసాడు, తొందరగా తీసినా మంచి క్వాలిటీతో తీశాడు.

ఇక సినిమా విషయానికి వస్తే ఇందులో కథ ఏమీ కొత్తగా ఉండదు, కానీ కథనం, మాటలు, సన్నివేశాలు బాగుంటాయి. ఉదాహరణకి నాగార్జున, అల్లరి నరేష్ మధ్య వచ్చే సన్నివేశాలు సరదాగా ఉంటాయి, అలానే నాగార్జున, ఆషిక రంగనాథ్ మధ్య వచ్చే సన్నివేశాలు, మాటలు అన్నీ బాగుంటాయి. నాగార్జున, అల్లరి నరేష్ ఇంకా చాలామంది ఈ సినిమాలో ఎక్కువగా లుంగీలు కట్టుకొని కనపడుతూ వుంటారు. అందువలన పల్లెటూరి నేపథ్యం, పండగ వాతావరణం సినిమాలో ఎక్కువగా కనపడి ప్రేక్షకులని అలరిస్తాయి. బెజవాడ ప్రసన్నకుమార్ ఈ సినిమాకి గోదావరి యాసలో మాటలు రాయడంతో సినిమాలో సన్నివేశాలు బాగా నవ్విస్తాయి.

naasaamirangaaashika.jpg

కీరవాణి సంగీతం సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. పాటలు స్క్రీన్ మీద బాగా కొరియోగ్రఫీ చేశారు బాగున్నాయి, నేపధ్య సంగీతం కూడా బాగుంది. అల్లరి నరేష్ పాత్రకి ప్రేక్షకుల నుండి బాగా సింపతీ వస్తుంది, ఎందుకంటే అతను అంత బాగా చేశాడు, హైలైట్ అయింది అతని పాత్ర. అలాగే రావు రమేష్ పాత్ర చిన్నదైనా అతని ప్రభావం పెద్దగా ఉంటుంది, తనకి ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో ఇమిడిపోయి చేస్తాడు, వైవిధ్యం చూపిస్తాడు. రాజ్ తరుణ్ పాత్రకి అంతగా ప్రాముఖ్యం లేకపోయినా పరవాలేదు అనిపించేట్టు వుంది. ఆషిక రంగనాథ్ వరాలుగా చాలా బాగా నటించింది. రెండు కోణాలుంటాయి ఆమె పాత్రకి, ఒకటి టీనేజ్, రెండోది ఒక పెద్దమనిషి తరహాలో వుండే పాత్ర, ఆమె బాగా అభినయించి చూపించింది. అందంగా కూడా కనపడుతుంది. నాజర్ ఊరి పెద్దగా బాగున్నారు. తమిళ సినిమాలలో కనిపించే షబీర్ ఈ సినిమాలో ఒక విలన్ పాత్రలో కనిపిస్తాడు, బాగా చేసాడు. ఇక మిర్నా మీనన్, రుక్షర్ థిల్లాన్ తమ పాత్రల పరిధి మేరకు చేశారు.

nagarjunallarinaresh.jpg

వీళ్లందరికన్నా కథానాయకుడి పాత్రలో నాగార్జున మరోసారి గోదావరి జిల్లా యాసతో ప్రేక్షకులని కట్టి పడేసారు. డాన్సులు, పోరాట సన్నివేశాలు అదరగొట్టారు. ముఖ్యంగా ఆషిక రంగనాథ్ తో వచ్చిన సన్నివేశాల్లో అయితే అతని అభిమానులకు పండగే అని చెప్పాలి. అయన ఆరోగ్య రహస్యం ఏంటో కానీ, నాగార్జునకి వయసు పెరుగుతున్నకొద్దీ మరింత చిన్నగా కనపడుతూ వుంటారు, అందులో మాత్రం యువ నటులతో సమానంగా కనిపిస్తారు. అక్కినేని నాగేశ్వర రావు అభిమానులు కూడా సంతోష పడేట్టు ఏ.ఎన్.ఆర్ పాటలు వినపడతాయి. అలాగే ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్ నటించిన 'గుండమ్మకథ' సినిమా స్టిల్ కూడా కనపడుతుంది.

చివరగా, 'నా సామి రంగ' సినిమా కథ పాతదే అయినా, మాటలు, కథనం మాత్రం కొత్తగా ఉంటాయి. నాగార్జున, నరేష్ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, కీరవాణి సంగీతం, ప్రసన్న కుమార్ మాటలు సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది. సినిమాలో పండగ వాతావరణం కనిపిస్తుంది. నాగార్జున అభిమానులకు నచ్చే సినిమా.

Updated Date - Jan 14 , 2024 | 02:04 PM