Tillu Square: వంద కోట్లు కలెక్టు చేస్తుందని అనుకుంటున్నాం: నిర్మాత వంశీ

ABN , Publish Date - Mar 29 , 2024 | 04:32 PM

సిద్దు జొన్నలగడ్డ మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర తన ప్రతాపం మరోసారి చూపించాడు. ఇంతకు ముందు 'డీజీ టిల్లు' తో మంచి విజయం సాధించిన సిద్దు, ఈరోజు విడుదలైన 'టిల్లు స్క్వేర్' తో ఇంతకు ముందు విజయానికి రెట్టింపు విజయం సాధించబోతున్నారు. ఈ సినిమా కలెక్షన్స్ భారీగా వుంటాయని నిర్మాత అంచనా వేస్తున్నారు.

Tillu Square: వంద కోట్లు కలెక్టు చేస్తుందని అనుకుంటున్నాం: నిర్మాత వంశీ
A still from Tillu Square

సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్' సినిమా ఈరోజు విడుదలైంది. మల్లిక్ రామ్ దర్శకుడు, సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాకి నిర్మాత. ఈ సినిమాకి ఈరోజు వేరే సినిమా పోటీ లేకుండా ఉండటం, ఈ సినిమా గురించి ఉదయం నుండి మంచి పాజిటివ్ వార్తలు వస్తూ ఉండటంతో ఈ సినిమాకి మొదటి రోజు కలెక్షన్స్ చాలా ఎక్కువగా వుంటాయని అనుకుంటున్నారు. అదీకాకుండా సిద్దు ముందు చేసిన 'డీజే టిల్లు' సినిమాకి మంచి క్రేజ్ రావటంతో ఈ సినిమా మీద అంచనాలు బాగా పెరిగాయి.

ఈ సినిమా విడుదలకి ముందు ప్రచార చిత్రాలు ట్రైలర్, టీజర్, పాటలు అన్నీ ఆసక్తిగా ఉండటంతో ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి ఆసక్తి పెరిగింది. ఈరోజు గుడ్ ఫ్రైడే సెలవు దినం కావటం కూడా ఈ సినిమాకి బాగా ఉపకరించింది అని అంటున్నారు. అందుకనే మొదటిరోజు ఉదయం ఆటలు అన్ని థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులతో నడవటం, తరువాత పాజిటివ్ టాక్ తో మధ్యాహ్నం, రాత్రి ఆటలు కూడా అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయని అంటున్నారు.

tillusquaresuccess.jpg

ఇదే విషయాన్ని నిర్మాత నాగవంశీ ని అడిగితే అతను సినిమా చాలా బాగా పోతోంది, ఇంకా కొన్ని థియేటర్స్ పెంచుతాం అని చెప్పారు. ఎంత కలెక్టు చేస్తుందని అనుకుంటున్నారు అంటే, 'ఈ సినిమా వంద కోట్లు కలెక్టు చేస్తుందని అనుకుంటున్నాం,' అని చెప్పారు. మొదటి రోజు సుమారు రూ. 25 కోట్లు గ్రాస్ ఉంటుందని అనుకుంటున్నాం, ఓవర్సీస్ లో బాగా నడుస్తోందని, అక్కడి కలెక్షన్స్ చాలా బాగున్నాయని చెప్పారు వంశీ. అలాగే నిజాం ఏరియాలో ఈ సినిమా మొదటి రోజు సుమారు రూ. 7 కోట్లు కలెక్టు చేస్తుందని అనుకుంటున్నాం, ఈరోజు సాయంత్రానికి ఎంత అనేది తెలుస్తుందని చెప్పారు.

ఈ సినిమా సిద్దు జొన్నలగడ్డ కెరీర్ లో ఒక మైలు రాయి అవుతుందని అనుకుంటున్నారు. ఈ సినిమాతో అతను స్టార్ గా ఎదిగాడని, ఇక అతని రాబోయే సినిమాలపై కూడా అంచనాలు భారీగా వుంటాయని అనుకుంటున్నారు. "మేము సినిమా విడుదలకి ముందు ఈ సినిమా కచ్చితంగా హిట్ అని చెపితే బాగోదు, ఈరోజు విడుదలైంది, ఫలితం ఏంటో అందరికీ తెలుసు, అందుకే ఈ సినిమా పెద్ద హిట్ అవబోతోంది అని ఇప్పుడు చెపుతున్నాను," అని సిద్దు ఈరోజు మీడియా సమావేశంలో చెప్పారు.

Updated Date - Mar 29 , 2024 | 04:45 PM