Tollywood Box Office: భారీ నష్టాల్లో సినిమా పరిశ్రమ, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూసివేత

ABN , Publish Date - May 15 , 2024 | 11:24 AM

తెలుగు సినిమా పరిశ్రమ సంక్షోభంలో పడింది. మంచి సినిమాలు లేక, ప్రేక్షకులు థియేటర్స్ కి రాకపోవటం వలన, తెలంగాణా రాష్ట్రంలో సుమారు 450కి పైగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కొన్ని రోజులపాటు మూసివేస్తున్నట్టు ప్రకటించారు.

Tollywood Box Office: భారీ నష్టాల్లో సినిమా పరిశ్రమ, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూసివేత
Nearly 450 Single Theaters closing in Telangana

ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ, అటు ఆంధ్రప్రదేశ్ లోనూ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పరిస్థితి ఏమీ బాగోలేదు. ప్రేక్షకులు సినిమా థియేటర్స్‌కి రావటం మానేశారు, అలాగే మంచి సినిమాలు కూడా రావటం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కష్టం అని, తెలంగాణ రాష్ట్రంలో వున్న సుమారు 450 సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ని కొన్నాళ్ల పాటు మూసివేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి ధ్రువీకరించారు.

sudharshanone.jpg

"సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఇప్పుడు సరిగ్గా నడవటం లేదు, సినిమా వేస్తే రూ.6,000 నష్టం వస్తోంది, వెయ్యకపోతే రూ.4,000 నష్టంతో పోతుంది, అందుకని మూసెయ్యడమే మంచిది అని కొన్ని రోజులపాటు మూసేస్తున్నాం," అని చెప్పారు విజయేందర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 450 సినిమా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉన్నాయని చెపుతున్నారు.

ఇక్కడే కాకుండా అంధ్రప్రదేశ్ లో ఈపాటికే చాలా థియేటర్స్ మూసేసి ఉంచారని, మంచి సినిమాలు లేకపోవటం, ప్రేక్షకులు సినిమాకి రాకపోవటంతో సినిమా థియేటర్స్ బోసిపోతున్నట్టుగా కనిపిస్తున్నాయి. అయితే ఇవి సింగిల్ థియేటర్స్ లో మాత్రమే కాదు, మల్టి ప్లెక్స్ లలో కూడా ప్రేక్షకులు అంతగా రావటం లేదు అని తెలిసింది.

sridevitheater.jpg

"ప్రస్తుతం ఐపీఎల్, ఎన్నికలు, ఎండలు ఇలా అన్నీ ఒకేసారి రావటం, దానికితోడు మంచి సినిమాలు లేకపోవటం వలన, ప్రేక్షకులు థియేటర్స్ కి రావటం లేదు. అదీకాకుండా, మాకు కరెంట్ బిల్లులు చాలా ఎక్కువ వస్తూ ఉండటంతో, అవి కట్టుకోలేక, కొన్ని రోజులపాటు థియేటర్స్ మూసి ఉంచాలని నిర్ణయించాం," అని తెలంగాణ, ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు శ్రీధర్ వంకా చెప్పారు.

సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ప్రేక్షకులు కొంతమంది వచ్చినా, వాళ్ళ కోసం ఏసి నడపాలని, కలెక్షన్స్ ఏవీ లేకపోయినా, సౌకర్యాలు మాత్రం కలిపిస్తున్నామని, అందువలన థియేటర్ నడపడానికి ఎక్కువ భారం పడుతోందని, డబ్బులు చేతి నుండి పెట్టుకోవాల్సి వస్తోందని, అందుకనే మూసెయ్యాలని నిర్ణయించామని చెప్పారు శ్రీధర్.

Updated Date - May 15 , 2024 | 11:36 AM