Geethanjali Malli Vachindi: ఆశకు అంతుండాలి, ఫ్లాపు సినిమాకి రూ. 50 కోట్లా ?

ABN , Publish Date - Apr 12 , 2024 | 03:24 PM

అంజలి నటించిన 50వ సినిమా 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' నిన్న విడుదలైంది. మొదటి ఆట పూర్తవగానే ఈ సినిమా అటు విమర్శకులకు, ఇటు ప్రేక్షకులకి నచ్చలేదు అని తెలిసిపోయింది. అయినా ఈ సినిమా రూ. 50 కోట్లు కలెక్టు చేస్తుందని కోన వెంకట్ చెప్పడంతో అందరూ షాకవుతున్నారు

Geethanjali Malli Vachindi: ఆశకు అంతుండాలి, ఫ్లాపు సినిమాకి రూ. 50 కోట్లా ?
Kona Venkat with Geethanjali Malli Vachindi team

ప్రముఖ నటి అంజలి నటించిన 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' ఎటువంటి బజ్ లేకుండా నిన్న విడుదలైంది. ఇది అంజలికి 50వ సినిమా కావటం ఆసక్తికరం. కోన వెంకట్ కథ, నిర్మాణ సారధ్యం వహిస్తే, శివ తుర్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. అయితే నిన్న పాత్రికేయుల కోసం ఒక మల్టి ప్లెక్స్ లో వేసిన ఈ సినిమాకి కేవలం పాత్రికేయులు, ఆ సినిమాకి సంబందించిన వారు తప్పితే మామూలు సినిమా ప్రేక్షకులు లేకపోవటం ఇంకో ఆసక్తికరమైన విశేషం.

geethanjalimallivachindi.jpg

నిన్న ఉదయం ఆట అయిపోగానే ఈ సినిమా ఫలితం ఏంటి అనేది అందరికీ తెలిసిపోయింది. విశ్లేషకులు కూడా ఈ సినిమా గురించి అంత పెద్దగా ఏమీ పట్టించుకున్నట్టు కనిపించలేదు. అలాగే ఈమధ్య టాలీవుడ్ లో కొత్త ఆనవాయితీ ఒకటి బయలుదేరింది. ఉదయం ఆట ఇంకా ముగియకుండానే, ఆ సినిమా విజయోత్సవాలు జరుపుకోవటం, వీలైతే కొన్ని టపాసులు కూడా కాల్చి తమ సినిమా కలెక్షన్స్ సాధించినా, లేకపోయినా విజయం సాధించింది అనే ఒక చిన్న సంతృప్తి కోసం చేస్తున్నారు.

ఇప్పుడు ఈ 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' సినిమా కూడా నిన్ననే విజయోత్సవ సభ జరిగింది. ఆశకు అంతుండాలి అని సామెత వుంది కదా, అచ్చం అలాగే మాట్లాడేరు ఈ సభలో ఈ సినిమా రచయిత, నిర్మాత కోన వెంకట్. తన 27 సంవత్సరాల కెరీర్ లో మొదటిసారిగా విజయం అనేది ఎంత ముఖ్యం అనే విషయం చెపుతూ, అది ఒక బలం, శక్తి ఇస్తుంది అని చెప్పారు కోన వెంకట్. సక్సెస్ వస్తే కొత్త సినిమాలు, కొత్త దర్శకులు, కొత్త సాంకేతిక నిపుణలని, కొత్త నటుల్ని పరిచయం చెయ్యడానికి ఉపయోగపడుతుంది అని చెప్పారు.

Geethanjali.jpg

తిరుపతి వెళ్లి ఈ సినిమా విజయం వరించాలని కోరిక కోరుకున్నాను అని చెపుతూ, భగవంతుడిని ఈ సినిమాతో రూ. 50 కోట్లు ఇచ్చేయి అని కోరారట కోన. శివ తుర్లపాటి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇంకా మాట్లాడుతూ మేజిక్ జరుగుతుంది అని నమ్మకం వుంది మాకు, అదే థియేటర్స్ లో జరిగింది అని కూడా అని చెప్పారు కోన. ఈ సినిమా గురించి మాట్లాడుతూ అల్ ఓవర్ బ్రహ్మాండంగా నడుస్తోందట, సినిమా ఆడుతున్న థియేటర్స్ హౌస్ ఫుల్స్ అంట, రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద నంబర్స్ చూడబోతున్నాం, రూ.50 కోట్లు కూడా చూడబోతున్నాం అని చెప్పారు కోన వెంకట్.

Geethanjali Malli Vachindi Movie Review: అంజలి 50వ సినిమా ఎలా ఉందంటే...

చెప్పిన మాటలు అన్నీ బాగున్నాయి, కానీ ఒక ఫ్లాపు సినిమాని పట్టుకొని రూ . 50 కోట్లు కలెక్టు చేస్తుంది అని ఎలా చెపుతారో అని పరిశ్రమలో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు అని తెలిసింది. ఉదయం ఆట తరువాత ఈ సినిమా ఫలితం ఏమిటి అనేది తెలిసినా, ఇలా మాట్లాడటం నిజంగా ఆశకు అంతుండాలి కదా అని అంటున్నారు. ఈ సినిమా 'జబర్దస్త్' షోలా ఉందని కొందరి విమర్శకులు అన్నారు, కొందరైతే మరీ విమర్శిస్తూ రాశారు, మరి ఇలాంటి సినిమా రూ. 50 కోట్లు కలెక్టు చెయ్యాలి అని కోన అంటూ ఉంటే పరిశ్రమలో షాకవుతున్నారు.

Updated Date - Apr 12 , 2024 | 03:24 PM