Geethanjali Malli Vachindi Movie Review: అంజలి 50వ సినిమా ఎలా ఉందంటే...

ABN , Publish Date - Apr 11 , 2024 | 03:34 PM

అంజలి నటించిన 50వ సినిమా 'గీతాంజలి మళ్ళీ వచ్చింది'. పదేళ్ల క్రితం వచ్చిన 'గీతాంజలి' సినిమాకి సీక్వెల్ ఇది, శివ తుర్లపాటి దర్శకుడు, కోన వెంకట్ రచన. ఈ సినిమా ఎలా వుందో చదవండి.

Geethanjali Malli Vachindi Movie Review: అంజలి 50వ సినిమా ఎలా ఉందంటే...
Geethanjali Malli Vachindi Movie Review

సినిమా: గీతాంజలి మళ్ళీ వచ్చింది

నటీనటులు: అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్య, సత్యం రాజేష్, షకలక శంకర్, అలీ, రవి శంకర్, ప్రియ, రాహుల్ మాధవ్ తదితరులు

సంగీతం: ప్రవీణ్ లక్కరాజు

ఛాయాగ్రహణం: సుజాత సిద్ధార్థ

దర్శకత్వం: శివ తుర్లపాటి

కథ, కథనం, రచన: కోన వెంకట్

నిర్మాత: ఎంవివి సత్యనారాయణ

విడుదల: ఏప్రిల్ 11, 2024

రేటింగ్: 2 (రెండు)

-- సురేష్ కవిరాయని

అంజలి ప్రధాన పాత్రలో సుమారు పదేళ్ల క్రితం 'గీతాంజలి' అనే సినిమా వచ్చింది, విజయం సాధించింది. అదొక హర్రర్ కామెడీ. ఇప్పుడు అదే సినిమాకి సీక్వెల్ గా 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' అనే ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కూడా అంజలి ప్రధాన పాత్ర పోషించింది. అందులో నటించిన శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేష్, అలీ ఇందులో కూడా కనపడతారు. ఇది అంజలికి 50వ సినిమా అవటం విశేషం. 'గీతాంజలి' సినిమాకి పని చేసిన రచయిత కోన వెంకట్ ఈ సినిమాకి కూడా రచన చెయ్యడమే కాకుండా నిర్మాణంలో భాగస్వామిగా కూడా వున్నారు. ఇంతకీ ఈ సినిమా మొదటి సినిమా అంత బాగుందా, అంజలికి మళ్ళీ అంతటి బ్రేక్ ఇచ్చిందా? చదవండి.

geethanjalidance.jpg

Geethanjali Malli Vachindi Story కథ:

దర్శకుడు శ్రీను (శ్రీనివాస్ రెడ్డి), రచయితలు ఆత్రేయ (సత్యం రాజేష్), ఆరుద్ర (షకలక శంకర్) సినిమా ఛాన్స్ కోసం చూస్తూ వుంటారు. తమ స్నేహితుడు అయాన్ (సత్య) కథానాయకుడిగా దిల్ రాజు నిర్మాతగా సినిమా చేస్తున్నామని చెప్పి అయాన్ దగ్గర డబ్బులు తీసుకుంటూ వుంటారు. ఒకరోజు నిజం తెలిసిన అయాన్ వీళ్ళని నిలదీస్తే నిజం చెప్పేస్తారు, తమకి ఏ నిర్మాత ఆఫర్ ఇవ్వలేదని, స్నేహితుడు కదా అని అతనికి అబద్ధం చెప్పి డబ్బులు అవసరానికి వాడుకున్నామని ఒప్పుకుంటారు. సినిమాలు వద్దు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోదాం అనుకుంటున్న సమయంలో ఒక నిర్మాత విష్ణు (రాహుల్ మాధవ్) దగ్గర నుంచి సినిమా ఆఫర్ వస్తుంది, నిర్మాత ఊటీ రమ్మంటాడు. స్నేహితులు నలుగురూ ఊటీ వెళతారు, అక్కడ నిర్మాత తను చెప్పిన కథని సినిమాగా తీయాలని, అందుకు లొకేషన్ కూడా ఒక పెద్ద మహల్ లాంటిది ఉందని, అందులోనే తీయాలని చెప్తాడు. స్నేహితులు సరే అంటారు, అగ్రిమెంట్ కూడా రాసుకుంటారు. ఈ సినిమాలో కథానాయకురాలిగా అంజలి (అంజలి) అనే ఆమెనే పెట్టుకోవాలని చెప్తాడు నిర్మాత. స్నేహితులు అంజలి దగ్గరికి వెళితే, అంజలికి ఈ స్నేహితులకీ వున్న పాత పరిచయంతో ఆమె కూడా ఒప్పుకుంటుంది. అయితే వీళ్ళు తీయబోయే లొకేషన్ అయిన మహల్‌లో శాస్త్రి (రవి శంకర్) కుటుంబం మంటల్లో కాలిపోయి దెయ్యాలుగా తిరుగుతూ వుంటారు. శ్రీను తన క్రూ తో మహల్ కి చేరుకుంటాడు, అక్కడ వీళ్ళందరికీ శాస్త్రి గారి కుటుంబం దెయ్యాలుగా కనపడుతూ ఉంటాయి. మరోవైపు గీతాంజలి ఆత్మ (అంజలి) ఒక బొమ్మలో పాతిపెట్టబడి కొన్నేళ్ల తరువాత ఒక బొమ్మలు అమ్ముకునే అమ్మాయికి ఆ బొమ్మ దొరికితే, ఆమె ఆ బొమ్మని వెంకటరావు (అలీ) కి అమ్ముతుంది. వెంకట్ రావు ఆ బొమ్మని తీసుకొని ప్రోగ్రాం ఇవ్వడానికి ఊటీ వెళతాడు, ఆ బొమ్మలో వున్న గీతాంజలి ఆత్మ, వెంకటరావుని ఒక కోరిక కోరుతుంది? ఆ బొమ్మలో వున్న గీతాంజలి ఆత్మ అలీని ఏమి అడిగింది? ఆ నిర్మాత నేపథ్యం ఏంటి, ఎందుకు అతను ఆ మహల్ లోనే సినిమా తీయమన్నాడు? కెమెరామెన్‌గా వచ్చిన నాని (సునీల్) ఎటువంటి పరిస్థితులు ఆ మహల్‌లో చూశాడు? ఎందుకు శాస్త్రి కుటుంబం దెయ్యాలుగా తయారయ్యారు? ఇవన్నీ తెలియాలంటే 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' సినిమా చూడాల్సిందే.

geethanjalimallivachindi.jpg

విశ్లేషణ:

పదేళ్ల క్రితం వచ్చిన 'గీతాంజలి' సినిమాకి సీక్వెల్ గా ఈ 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' సినిమా ఈరోజు విడుదలైంది. అయితే మొదటి సినిమాకి రాజ్ కిరణ్ దర్శకుడు, ఈ సీక్వెల్‌కి శివ తుర్లపాటి దర్శకుడు. కోన వెంకట్ ఈ రెండు సినిమాలకి కీలకం, ఎందుకంటే అతనే రచన, కథ, నిర్మాణంలో భాగం అయ్యారు. మొదటి సీక్వెల్ లో అంజలి పాత్రని బలంగా రాస్తే, ఈ సీక్వెల్ లో ఆమె పాత్రని చాలా పేలవంగా రాశారు. టైటిల్ గీతాంజలి అని పెట్టినా గీతాంజలి పాత్ర చాలా తక్కువగా వుండి, కేవలం నాలుగైదు వినోదాత్మక సన్నివేశాలతో ఈ సీక్వెల్ నడిపించేయాలని అనుకున్నట్టుగా చేశారు.


అంజలి ఆత్మని చూపించారు కానీ, ఆ పాత్రను సరిగా ఎలివేట్ చేయలేకపోయారు. అసలు ఆ పాత్ర కేవలం పతాక సన్నివేశాల్లో వాడుకోవడానికి అన్నట్టుగా రచన చేశారు. అలాగే మొదటి సగం అంతా చాలా నీరసంగా, బోర్ గా సాగుతుంది. అలీ కామెడీ, సత్య వినోదం ఇవన్నీ అవుట్ డేటెడ్, రొటీన్ గా ఉండడంతో ప్రేక్షకులకు అంత ఆసక్తి ఉండదు. అది కాకుండా మొదటి సీక్వెల్లో రావు రమేష్ లాంటి బలమైన ప్రతినాయకుడు వుండి, చిన్న రివెంజ్ డ్రామా ఉంటుంది. కానీ ఇందులో ప్రతి నాయకుడు పాత్ర పేలవంగా ఉంటుంది, అసలు కథని వదిలేసి కేవలం ఏవో వినోదాత్మక సన్నివేశాలపైనే దృష్టి పెట్టారు. అదొక పెద్ద మైనస్ అయింది. ఈ సినిమాలో కేవలం రెండో సగంలో వచ్చే కొన్ని వినోదాత్మక సన్నివేశాలు తప్పితే బలమైన కథ లేకపోవడంతో ప్రేక్షకుడికి ఇదేదో జబర్దస్త్ షో చూస్తున్నట్టుగా ఉంటుంది తప్పితే, ఆసక్తికరమైన సినిమాగా అనిపించదు.

geethanjaliworkingstill.jpg

రెండో సగంలో సునీల్, సత్యలు దెయ్యాలతో చేసే ఒకటి రెండు సన్నివేశాలు వినోదాత్మకంగా వున్నా, కేవలం వాటికోసమే ప్రేక్షకుడు ఓపికగా థియేటర్ లో కూర్చోవాలంటే కష్టమే. టైటిల్ లో గీతాంజలి అని ఉంటుంది కానీ, సినిమాలో మాత్రం ఇద్దరు గీతాంజలిల పాత్రలు (అంజలి, ఇంకొకటి ఆత్మ) సరిగ్గా చూపించటంలో విఫలం అయ్యాడు దర్శకుడు, రచయిత. దానికితోడు కొన్ని సన్నివేశాలు బలవంతంగా చొప్పించినట్టు పెట్టారు, ఉదాహరణకు సురేష్ కొండేటి సన్నివేశం. అది అవసరం లేదు, కథకి కూడా ఏమాత్రం పనికిరాదు, కానీ కేవలం సురేష్ కొండేటి అనే వ్యక్తి వార్తల్లో వున్నాడని అతని సన్నివేశం పెట్టినట్టుగా అనిపిస్తుంది. రచయిత కోన వెంకట్ ఇంకా పాత కాలంనాటి కథలనే పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. కథ సరిగ్గా లేకపోవటమే కాకుండా, ముందు సన్నివేశాల్లో ఏమి జరుగుతుంది అనేది తెలిసిపోవటంతో ప్రేక్షకుడుకి అంత ఆసక్తి ఉండదు. అందుకే ఈ సీక్వెల్ మొదటి సినిమా అంత విజయం సాధించటం కష్టం అనిపిస్తుంది. శివ తుర్లపాటి దర్శకత్వ ఛాయలు ఎక్కడా కనిపించవు, ఎందుకంటే కోన వెంకట్ ఇంతకు ముందు సినిమాల్లో రాసినట్టుగా కొన్ని స్కిట్స్ రాసి రెండో సగం నడిపించేసారు అన్నట్టుగా ఉంటుంది. దర్శకుడు, రచయిత ఇద్దరూ మొదటి సినిమాకు వచ్చిన విజయాన్ని ఈ సినిమాకు సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారనే చెప్పాలి.

ఇక నటీనటుల విషయానికి వస్తే అంజలి పాత్ర బలంగా రాయలేదు, అందుకని ఆమె పాత్ర కేవలం కొన్ని సన్నివేశాలకి మాత్రమే పరిమితం అయిపోయింది. టైటిల్ పాత్ర ఆమెదే అయినా, ఆమె ప్రభావం మాత్రం సినిమాలో ఎక్కడా కనిపించదు, ఉండదు. శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేష్, కమెడియన్ సత్యలు అక్కడక్కడా నవ్విస్తారు. సునీల్ రెండో సగంలో వస్తాడు అక్కడక్కడా నవ్విస్తాడు అంతే. శ్రీకాంత్ అయ్యంగార్ తన పాత్ర పరిధి మేరకు నటించాడు. రాహుల్ మాధవ్ విలన్ గా మామూలుగా కనిపించాడు. రవి శంకర్ లౌడ్ గా కనిపిస్తే, ప్రియ పరవాలేదు అనిపించారు.

చివరగా, 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' సినిమాలో కథ ఏమీ కనిపించదు, టైటిల్ పెట్టినట్టుగా టైటిల్ పాత్రలో అంజలి పాత్ర కూడా అంత బలంగా లేదు. రెండో సగంలో కొన్ని వినోదాత్మక సన్నివేశాలు తప్పితే, సినిమాలో విషయం లేదు. అంజలి నటించిన 50వ సినిమా నిరాశ పరిచిందనే చెప్పాలి. ఇలాంటి అవుట్ పుట్‌తో వచ్చే లెక్క అయితే.. ఈ గీతాంజలి మళ్ళీ మళ్లీ రాకుండా ఉంటేనే బాగుంటుందనిపిస్తుంది.

Updated Date - Apr 11 , 2024 | 04:02 PM