Minister Roja: రజినీకాంత్ ని నానా మాటలు అన్నప్పుడు తమిళ పరిశ్రమ స్పందించలేదెందుకో!

ABN , First Publish Date - 2023-10-09T14:13:27+05:30 IST

మొన్నీమధ్య తెలుగుదేశం నాయకుడు ఒకరు వైస్సార్సీపీ నాయకురాలు, నటి, మినిస్టర్ రోజా మీద ఎదో కామెంట్ చేశారని, తమిళ పరిశ్రమ నుండి చాలామంది నటీమణులు స్పందిస్తున్నారు. కానీ అదే పరిశ్రమకి చెందిన రజినీకాంత్ ని ఇదే రోజా, వైస్సార్సీపీ నాయకులూ నానా మాటలు అన్నప్పుడు వీళ్ళందరూ ఏమయ్యారు అని రజిని అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.

Minister Roja: రజినీకాంత్ ని నానా మాటలు అన్నప్పుడు తమిళ పరిశ్రమ స్పందించలేదెందుకో!
Radhika Sharath Kumar and Khushbu

కొన్ని రోజుల క్రితం నటి, వైసిపి మంత్రి రోజారెడ్డి (MinisterRoja) పై తెలుగు దేశం పార్టీకి (TeluguDesamParty) చెందిన విశాఖ సీనియర్ బిసి నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి (BandaruSatyanarayana) చేసిన విమర్శలను ఉద్దేశిస్తూ, తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన కొంత మంది సీనియర్ నటీమణులు వీడియోలు చేసి తమ సాంఘీక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ రోజాకి సపోర్ట్ చేస్తూ పెట్టిన ఈ వీడియోలు ఇప్పుడు ట్రోలింగ్ కు గురవుతున్నాయి. అయితే ఆలా పెట్టినవాళ్ళు కేవలం వాళ్ళచేత ఎవరో పెట్టించినట్టుగా ఈ వీడియోస్ పోస్టు చేసి పెట్టరేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అంతకు ముందు రోజా వైసిపి ఎంఎల్ఎ గా ఉన్నప్పటినుంచి, అటు అసెంబ్లీలో రోజా చేసిన అసహ్యకరమైన చేష్టలు, కులహంకారంతో ఎస్సిలను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్, ఎపిలో మహిళలపై జరుగుతోన్న అగాయిత్యాలు ఈ నటీమణులకు లకు కనబడటం లేదా అని నెటిజన్స్ అందరూ కామెంట్స్ చేస్తున్నారు.

rajinikanth-babu1.jpg

ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కొన్ని నెలల క్రితం తెలుగు లెజెండరీ నటుడు అయిన ఎన్టీఆర్ (NTR) శతజయంతి వేడుకలకు సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) విజయవాడ ప్రత్యేక అతిధిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. అది ఎన్టీఆర్ కి సంబదించిన వేడుక కాబట్టి, రజనీకాంత్ లెజెండరీ నటుడు ఎన్టీఆర్ గొప్పతనం గురించి, అలాగే తనని ప్రత్యేక అతిథిగా పిలిచిన మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు (NaraChandrababuNaidu), అతనితో తనకున్న ప్రత్యేక సాన్నిహిత్యాన్ని వివరించారు. అందులో భాగంగానే చంద్రబాబు 2020 విజనరీని తనకు ముందే తెలిపారని, అందుకు తగ్గట్టుగానే అతను సైబరాబాద్ నిర్మాణం చేపట్టారని, ఆయనకున్న భవిష్యత్ ప్రణాళికలకు తానూ అశ్చర్యపోయానంటూ చంద్రబాబుని కొనియాడారు రజినీకాంత్. అందులో ఏమీ తప్పు పట్టడానికి లేదు.

అప్పుడు ఇదే వైసీపీ నాయకులు, ఎపిలో జగన్ ను తప్ప ఇంకెవరిని ప్రశంసించకూడదు అన్నట్లుగా వరుస పెట్టి ఒక్కొక్కరూ మీడియా ముందుకు వచ్చి, రజనీకాంత్ పై విరుచుకుపడ్డారు. ఆయన వయస్సుకి, సినీరంగంలో ఆయనకున్న స్థానానికి కనీస మర్యాద ఇవ్వకుండా ఇదే రోజా (Roja), ఆమెతో పాటు కొడాలి నాని (KodaliNani), పేర్ని నాని (PerniNani) లాంటి నేతలు హద్దులు దాటి రజినీకాంత్ మీద అభ్యంతరకర రీతిలో విమర్శల దాడిని కొనసాగించారు. సినీ పరిశ్రమ నుండి వచ్చిన రోజా కూడా తోటి నటుడిపై మర్యాద లేకుండా రజనీకాంత్ మీద చేసిన చవకబారు విమర్శలు, అటు తమిళనాడులోనూ, ఇటు ఆంధ్రరాష్ట్ర రాజకీయాల స్థాయిని దిగజార్చిందనే చెప్పాలి. సూపర్ స్టార్ అభిమానులే కాకుండా, సాధారణ ప్రజలు కూడా ఏపీలో వైసీపీ నేతల రాజకీయ విమర్శలను చూసి చిరాకు పడే పరిస్థితికి కనిపించింది.

roja.jpg

అప్పుడు రజనీకాంత్ మీద చేసిన దాడికి తమిళనాడు సినీ పరిశ్రమ నుండి ఒక్కరు కూడా స్పందించలేదు. రజనీకాంత్ కి మద్దతు తెలిపితే, విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి సినీ పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మాట్లాడలేదు అని అప్పుడు రజినీకాంత్ అభిమానులు చాలా నిరాశ చెందారు. కానీ ఇప్పుడు తమిళ పరిశ్రమకి సంబంధం లేకపోయినా, ఆంధ్ర రాజకీయాల్లో ఎదో ఇద్దరు మాటా మాటా అనుకుంటే ఈ తమిళ నటీమణులు పనికట్టుకొని తమ సాంఘీక మాధ్యమంలో వీడియోలు పెట్టడం రజినీకాంత్ అభిమానులకు కోపం తెప్పించింది. అందుకే రోజాకి అనుకూలంగా వీడియోలు పెట్టిన వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు.

అదీ కాకుండా, తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుండి ఒక్కరు కూడా మాట్లాడలేదు కానీ, తమిళ పరిశ్రమ నుండి రావడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలను, తాము ఖండిస్తున్నాం అంటూ రాధిక (RadhikaSharathKumar), ఖుష్బూ (Khushbu) వంటి సీనియర్ నటీమణుల ప్రకటనలు రజినీకాంత్ అభిమానుల ఆగ్రహానికి కారణాలయ్యాయి. రోజాతో సహా ఇదే వైసీపీ నాయకులు రజనీకాంత్ ను కించపరుస్తూ అవమానకరంగా చేసిన విమర్శలు వీరికి వినపడలేదా అని ప్రశ్నిస్తున్నారు.

ఎంఎల్ఎగా రోజా చేసిన చిల్లర చేష్టలు కనిపించలేదా వీళ్ళకి, మరీ అప్పుడు రాని ఈ ప్రకటనలు ఇప్పుడు ఎలా అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తొంది. ఇంకొక చర్చ ఏంటంటే రోజానే వీళ్ళందరికీ ఫోనులు చేసి తన తోటి నటీమణులతో ఇల్లా వీడియోలు పెట్టించి ఒక క్యాంపెనింగ్ రన్ చేసుకుంటోంది అని కూడా అంటున్నారు. నటిగా గతంలో రోజాతో ఉన్న సాన్నిహిత్యమో, ప్రస్తుతం రోజా భర్త సెల్వమణితో (Selvamani) వారికున్న అవసరమో ఎదైనా కానీ రోజాకు అనుకూలంగా మాట్లాడినందుకు ఈ నటీమణులపై ఇప్పుడు ట్రోలింగే గట్టిగానే జరుగుతోంది. రజినీకాంత్ అభిమానులతో పాటు, మెగా అభిమానులు కూడా ట్రోల్ చేస్తున్నారు.

Updated Date - 2023-10-09T14:17:35+05:30 IST