Thammareddy to enter into politics: కాంగ్రెస్ హై కమాండ్ నుండి తమ్మారెడ్డి భరద్వాజకి ఫోన్, అలెర్ట్ అయిన బిఆర్ఎస్

ABN , First Publish Date - 2023-06-30T18:37:39+05:30 IST

ప్రముఖ నిర్మాత, దర్శకుడు అయిన తమ్మారెడ్డి భరద్వాజ మీదే అందరి దృష్టి వుంది. ఢిల్లీ కాంగ్రెస్ హై కమాండ్ నుండి తమ్మారెడ్డి కి పార్టీలో చేరమని ఆహ్వానం వచ్చింది. అది తెలిసిన బిఆర్ఎస్ నాయకులు కూడా తమ్మారెడ్డిని కలవటానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు భోగట్టా. ఏ పార్టీలో చేరేదీ ఒక వారం రోజుల్లో తెలుస్తుందని అనుకుంటున్నారు.

Thammareddy to enter into politics: కాంగ్రెస్ హై కమాండ్ నుండి తమ్మారెడ్డి భరద్వాజకి ఫోన్, అలెర్ట్ అయిన బిఆర్ఎస్
Thammareddy Bharadwaja

ప్రముఖ తెలుగు దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (ThammareddyBharadwaja) కాంగ్రెస్ (CongressParty) లో చేరనున్నారనే ప్రచారం బాగా జోరందుకుంది. అయితే ఈ వార్తలో నిజం లేకపోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ హై కమాండ్ ఢిల్లీ నుండి తమ్మారెడ్డి భరద్వాజకు ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానం అందించారు. దానికి బదులుగా తమ్మారెడ్డి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని అతని సన్నిహితుల ద్వారా తెలిసింది. ఏ నిర్ణయం తీసుకునేది ఒక వారం రోజుల్లో చెపుతాను అన్నట్టుగా కాంగ్రెస్ హై కమాండ్ కి తమ్మారెడ్డి చెప్పినట్టుగా తెలిసింది.

తమ్మారెడ్డి భరద్వాజ కమ్యూనిస్ట్ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. అతని తండ్రి తమ్మారెడ్డి కృష్ణమూర్తి (ThammareddyKrishnamurthy) అప్పట్లో ప్రముఖ నిర్మాత, అలాగే అప్పట్లో అభ్యుదయ భావాలున్న సినిమాలని నిర్మించారు. 'లక్షాధికారి', 'జమిందార్', 'ధర్మదాత', 'సిసింద్రీ చిట్టిబాబు', 'డాక్టర్ బాబు' లాంటి ఎన్నో సినిమాలు అగ్ర నటులు అయిన ఎన్ టి రామారావు (NTRamaRao), అక్కినేని నాగేశ్వర రావు (Akkineni), శోభన్ బాబు (SobhanBabu) లాంటి వాళ్ళతో నిర్మించారు. తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నయ్య పేరు లెనిన్ (Lenin), అతను ఉస్మానియా యూనివర్సిటీ (OsmaniaUniversity)లో అప్పట్లో స్టూడెంట్ లీడర్ గా బాగా పేరు పొందిన జార్జి రెడ్డికి క్లాస్ మేట్. దివంగత లెనిన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం స్టూడెంట్స్ లీడర్ గా ఉండేవాడు, అలాగే సోషలిస్ట్ కూడా. లెనిన్ చిత్రపరిశ్రమలో కూడా పని చేశారు.

thammareddybharadwaj.jpg

అటువంటి కమ్యూనిస్ట్ కుటుంబం నుండి వచ్చిన తమ్మారెడ్డి తండ్రిలాగే మొదటి నుండి సిద్ధాంతాలకు బాగా అలవాటుపడిన వ్యక్తి. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరికి ఎటువంటి సాయం వచ్చినా, లేదా చిత్ర పరిశ్రమలో ఏదైనా ఒక సమస్య వచ్చినా, ఎదురైనా, పెద్ద చిన్నా తారతమ్యం లేకుండా అందరూ ముందు సంప్రదించేది తమ్మారెడ్డి భరద్వాజనే. పరిశ్రమలో వున్న అన్ని అసోసియేషన్స్ లోనూ తమ్మారెడ్డి పని చేశారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా, ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా, ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఇలా ఒకటేమిటి అన్నిటిలో అయన పాత్ర ఉంటుంది. అగ్ర నటుడు దగ్గర నుంచి, చిన్న నిర్మాత, దర్శకుడు వరకు ఏ సమస్య వచ్చినా, కమిటి వేయాలన్న, ప్రభుత్వాలతో మాట్లాడాలి అన్నా, తమ్మారెడ్డి అందులో ఉండాల్సిందే. ఎందుకంటే అతనికి వున్న అనుభవం, ఆ సబ్జెక్టు మీద వున్న కమాండ్ అటువంటిది.

అందుకే తమ్మారెడ్డి కి అన్ని పార్టీలతో ఆ నాయకులతో మంచి అనుబంధం వుంది. అందుకే పార్టీలకు అతీతంగా అతన్ని అందరూ గౌరవిస్తూ వుంటారు. తెరాస పార్టీ ఎన్నికల్లో గెలిచాక, ఆ పార్టీ నుండి కూడా ఆహ్వానం వచ్చింది. అలాగే భారతీయ జనతా పార్టీ కి చెందిన డికె అరుణకి, తమ్మారెడ్డి కుటుంబముతో మంచి అనుబంధం వుంది. "మా పార్టీ లో చేరన్నా" అని అరుణ ఎప్పుడో తమ్మారెడ్డి ని ఆహ్వానిస్తే, తమ్మారెడ్డి సున్నితంగానే తిరస్కరించారు. అప్పట్లో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాశ్ నారాయణ లోక్ సత్తా పార్టీ పెట్టి తరువాత కూకట్ పల్లి నుండి పోటీ చేసినప్పుడు ఆ పార్టీ లో చేరకుండా అతనికి మద్దతు ఇచ్చారు తమ్మారెడ్డి. అలాగే తమ్మారెడ్డి తన స్వంత యూట్యూబ్ ఛానల్ లో ఎటువంటి అరమరికలు లేకుండా ప్రతి ఇష్యూ మీదా తన అభిప్రాయాలను నిక్కచ్చిగా మాట్లాడుతూ వుంటారు కూడా.

ఇటు పరిశ్రమలోనూ, అటు రాజకీయ నాయకులతోనూ మంచి సంబంధాలు కొనసాగిస్తున్న తమ్మారెడ్డి కి కాంగ్రెస్ హై కమాండ్ నుంచి పిలుపు వచ్చిందంటే అందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ లేదు. అయితే తమ్మారెడ్డి కాంగ్రెస్ లో చేరి ఎటువంటి పాత్ర పోషిస్తారు అన్నదే పాయింట్. ఎందుకంటే అతను రానున్న ఎన్నికల్లో ఎక్కడా కంటెస్ట్ చెయ్యను అని చెప్పేసారు. తమ్మారెడ్డి కి అన్ని సబ్జక్ట్స్ మీద మంచి కమాండ్ వుంది, మంచి వక్త కూడా. అందుకని రానున్న ఎన్నికల్లో పార్టీ ప్రచారానికి, అలాగే స్థానిక సమస్యలని లేవనెత్తి ప్రభుత్వానికి వేలెత్తి చూపించడంలో కూడా తమ్మారెడ్డి అనుభవం వున్న వ్యక్తి. ఒకవేళ తమ్మారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ పార్టీకి చాలా లాభం చేకూరినట్టు అవుతుంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ బాగా బలం పుంజుకుంది, అలాగే వచ్చే ఎన్నికల్లో మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సత్తా వుంది అని పబ్లిక్ టాక్ కూడా నడుస్తోంది.

కొసమెరుపు: కాంగ్రెస్ హై కమాండ్ తమ్మారెడ్డి తో మంతనాలు జరుపుతోందని తెలిసిన వెంటనే, బిఆర్ఎస్ పార్టీకి చెందిన టాప్ నాయకత్వంలోని నాయకులు తమ్మారెడ్డి ని సంప్రదించి తమ పార్టీలోకి కూడా ఆహ్వానం పలకాలని నిర్ణయించుకున్నట్టు భోగట్టా. చేరితే మా పార్టీలో చేరండి, లేకపోతే కాంగ్రెస్ లో కూడా చేరకుండా తటస్థంగా ఉండిపోవాలని తమ్మారెడ్డికి చెప్పడానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు సమాయత్తం అవుతున్నారు అని తెలిసింది. అయితే కమ్యూనిస్ట్ భావజాలం వున్న తమ్మారెడ్డి ఎటువైపు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిందే.

Updated Date - 2023-06-30T18:42:23+05:30 IST