Tanikella Bharani - OTT : నాలాంటి వాళ్లకి తలుపులు మూసేశాయి

ABN , First Publish Date - 2023-09-17T12:33:52+05:30 IST

‘‘40 ఏళ్ల సినీ ప్రయాణంలో నేను చేయాలనుకున్న ‘మిథునం’ సినిమా చేశా. ఇంకొక సినిమాని అంతర్జాతీయ స్థాయిలో తీయాలనే ఓ ఆలోచన ఉంది. నా తరహా కళాత్మక సినిమాలు చేసే నిర్మాతలే కనిపించడం లేదు. ఓటీటీ వేదికలు నాలాంటివాళ్లకి తలుపులు మూసేశాయి’’ అని తనికెళల భరణి అన్నారు. 

Tanikella Bharani - OTT : నాలాంటి వాళ్లకి తలుపులు మూసేశాయి

‘‘40 ఏళ్ల సినీ ప్రయాణంలో నేను చేయాలనుకున్న ‘మిథునం’ సినిమా చేశా. ఇంకొక సినిమాని అంతర్జాతీయ స్థాయిలో తీయాలనే ఓ ఆలోచన ఉంది. దర్శకుడిగా నా సినిమా వచ్చి పదేళ్లు అయింది. నా దగ్గర కథలు లేక కాదు. నేనేమో వాణిజ్య ప్రధానమైన సినిమాలు చేయను. నా తరహా కళాత్మక సినిమాలు చేసే నిర్మాతలే కనిపించడం లేదు. ఓటీటీ వేదికలు నాలాంటివాళ్లకి తలుపులు మూసేశాయి’’ అని తనికెళల భరణి (Tanikella Bharani) అన్నారు. హాస్యం, విలనీ, క్యారెర్టర్‌ ఆర్టిస్ట్‌ ఇలా ఏ తరహా పాత్ర ఇచ్చినా ఒదిగిపోయే నటుడు ఆయన. రచయితగా, దర్శకుడిగా కూడా గుర్తింపు పొందారు. ఇటీవల ఆయన ‘పెదకాపు - 1’ (peda kapu -1)చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. విరాట్‌ కర్ణ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంలో చిత్రంలో కీలక పాత్ర పోషించిన తనికెళ్ల భరణి విలేకర్లతో మాట్లాడారు.

నాలుగు దశాబ్దాల నట జీవితంలో 850కి పైగా చిత్రాలు చేశారు. వాటిలో కొన్ని పాత్రలే గుర్తంచుకోదగినవి. ‘పెద్దకాపు -1’ చిత్రం అలా గుర్తుండిపోయిన సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది. శ్రీకాంత్‌ అడ్డ్చా చిత్రాల్లో తెలుగుదనం ఉట్టిపడుతుంది. గోదావరి వెటకారం, యాస ఆయన సినిమాల్లో కనిపిస్తాయి. దర్శకుడు ఏ ప్రాంతంవాడైతే ఆ ప్రాంతం తాలుక మార్క్‌ సినిమాలో కనిపిస్తుంది. ఈ సినిమా విషయానికొస్తే తనకి సంబంధం లేని దర్శకుడు బయటికొచ్చాడు. ఈ చిత్రంతో శ్రీకాంత్‌లో మార్పు బలంగా కనిపించింది. ప్రతీకారాన్ని తీవ్ర స్తాయిలో చూపించాడు. కథానాయకుడు విరాట్‌ కర్ణ కొత్తలో కాస్త బెరుగ్గా కనిపించాడు కానీ, ఆ తర్వాత సునాయాసంగా చేసేశాడు. నాక్కూడా ఒకే తరహా కథలు చేసి ఈ మధ్య కాస్త విరక్తి చెందా. అలా ఈ ఏడాదిలోనే 18 చిత్రాలు వదిలేశా. ఈ మూడేళ్లల్లో నేను చేసిన ఉత్తమమైన పాత్ర ఇదే!

కళాత్మక చిత్రాలకు ఆదరణతోపాటు నిర్మించే నిర్మాతలు కరువయ్యారు. ఓటీటీ వేదికలు నాలాంటి వాళ్లకి తలుపులు మూసేశాయి. కళలో కూడా హింస, అసభ్యత కనిపించాల్సిందే అంటుంటారు.. వాళ్లకి కావల్సిన కంటెంట్‌ని సప్లై చేయాలంటారు. నేనేమో ద్వంద్వార్థాల నుంచి కూడా తప్పించుకుని వచ్చినవాణ్ని. మరి కళాత్మక సినిమాలు చేసే పరిస్థితులు ఇక లేవా? అనే ప్రశ్న భవిష్యత్తులో వస్తుందేమో. ప్రస్తుతం పరిస్థితులు ఇలా ఉన్నాయంతే. రేపటి రోజున ఓ సాత్వికమైన చిత్రం అద్భుతంగా ఆడిందనుకో... అందరూ అలాంటి సినిమాలపైనే దృష్టి పెడతారు.

Updated Date - 2023-09-17T12:58:43+05:30 IST