Sankranthi controversy: తగ్గేదే లే, అంటున్న నిర్మాతలు, సమావేశం వాయిదా!

ABN , Publish Date - Dec 23 , 2023 | 01:54 PM

రానున్న సంక్రాంతి పండగకి విడుదలవుతున్న తెలుగు సినిమాలు ఒకేరోజు రెండు సినిమాలు విడుదల, అలాగే నాలుగు పెద్ద సినిమాలు పోటీ, ఈ నేపథ్యంలో ఆ సినిమా నిర్మాతల మధ్య తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు విఫలం అయ్యాయి

Sankranthi controversy: తగ్గేదే లే, అంటున్న నిర్మాతలు, సమావేశం వాయిదా!
Five films are releasing on this coming Sankranthi festival

సంక్రాంతి పండగ తెలుగు వాళ్ళకి చాలా ముఖ్యమైనది, అందులోకి తెలుగు సినిమా ప్రేక్షకులకి ఇంకా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ పండగకి తెలుగు సినిమాలు విడుదలవడం, ప్రేక్షకులు విపరీతంగా చూడటం, నిర్మాతలకి కాసుల వర్షం కురియడం పరిపాటి. అందుకనే సంక్రాంతికి మూడు నాలుగు సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. అయితే అవి విడుదలైనప్పుడు రెండు సినిమాలు ఒకే తేదీలో కాకుండా ఒక్కోరోజు ఒక్కో సినిమా విడుదలయేటట్టు చూసుకుంటారు. కానీ ఈసారి ఎక్కువ సినిమాలు, అదే ఒకటే రోజు రెండు సినిమాలు విడుదలవడంతో నిర్మాతలు తెలుగు ఫిలిం ఛాంబర్ లో సమావేశం నిర్వహించారు.

maheshbabugunturkaaram.jpg

ఈ సమావేశం తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి నిర్మాతలు నాగ వంశీ (గుంటూరు కారం), విశ్వ ప్రసాద్ (ఈగల్), శ్రీనివాస్ చిట్టూరి (నా సామి రంగ) హాజరు అయినట్టుగా తెలిసింది. 'హనుమాన్' నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ సమావేశానికి రాలేదు, అతని కోసం ఒక అరగంటపాటు ఎదురుచూసినా అతను రాలేను అని చెప్పినట్టుగా సమాచారం. అయితే 'సైంధవ్' నిర్మాత సెన్సారు కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో దర్శకుడు శైలేష్ కొలను హాజరయినట్టుగా తెలిసింది. ఈ సినిమాలే కాకుండా ఇంకో రెండు డబ్బింగ్ సినిమాలు కూడా సంక్రాంతికి విడుదలవుతున్నాయి, కానీ ఇక్కడ తెలుగు సినిమాలకే ప్రాముఖ్యం ఇవ్వనున్నారు అని కూడా తెలుస్తోంది.

naasaamiranga.jpg

ఈ సమావేశంలో జనవరి 12న విడుదలయ్యే 'గుంటూరు కారం', 'హనుమాన్' నిర్మాతలని ఒకరోజు ముందుకు జరపాలని సూచించారని తెలుస్తోంది. ఎందుకంటే ఒకేరోజు రెండు సినిమాలంటే రెవిన్యూ పోతుంది అనే ఉద్దేశంతో చెప్పారు, 'హనుమాన్' నిర్మాతలు తమకి హిందీ భాషతో ఒప్పదం అయిపొయింది అందుకని ముందుకు జరగడం కష్టం అని చెప్పినట్టుగా తెలిసింది. ఇక 'గుంటూరు కారం' నిర్మాతలు అలోచించి చెప్తాం అని అన్నట్టుగా తెలిసింది. 'నా సామి రంగ' నిర్మాత తమ సినిమా కథ సంక్రాంతి పండగ నేపథ్యంలో ఉంటుంది కాబట్టి, విడుదల వాయిదా వెయ్యడం కష్టం అని చెప్పారు. అయితే మిగతా సినిమాలన్నీ జనవరి 13, 14, 15 తేదీల్లో విడుదలవుతున్నాయి. మొత్తంమీద ఈ సమావేశం చర్చలు అంత సానుకూలంగా జరగలేదనే చెప్పాలి.

venkatesh-saindhav2.jpg

"ఈ సమావేశం ఎందుకు నిర్వహించమంటే, సినిమాలు విడుదలయ్యాక నిర్మాతలు మీడియా ముందుకు వచ్చి తమకి తగినన్ని థియేటర్స్ ఇవ్వలేదు అని మళ్ళీ పరిశ్రమనే నిందించటం మొదలుపెడతారు, అందుకనే ముందుగానే ఆ నిర్మాతలతో చర్చలు జరిపాం," అని చెప్పారు ప్రసన్న కుమార్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ. ఈ సమావేశం మళ్ళీ ఇంకోసారి జరపనున్నట్టుగా తెలిసింది.

Updated Date - Dec 23 , 2023 | 01:54 PM