Roja Ramani - Surya Kantham : ఆవిడ సెట్‌లో ఉంటే.. అమ్మ గుర్తుకొచ్చేది కాదు

ABN , First Publish Date - 2023-10-29T12:24:43+05:30 IST

ఒకే తరహా పాత్రను ఎవరైనా  నటుడో, నటో వరుసగా నాలుగైదు చిత్రాల్లో పోషిస్తేనే ‘అబ్బా.. మొనాటనీ అయిపోతుంది బాబూ’ అని ప్రేక్షకులు చిరాకు పడిపోతుంటారు. అటువంటిది ఒక తరహా పాత్రను ఒకటి కాదు రెండు కాదు.. వందలాది చిత్రాల్లో పోషించడమే కాకుండా, ప్రతిసారీ ఈమెకు సాటి మరెవరూ లేరు అనిపించుకోవడం మాములు విషయం కాదు. ఆ ఘనత, గౌరవం విశిష్ట నటి సూర్యకాంతంకు మాత్రమే దక్కాయి

Roja Ramani - Surya Kantham : ఆవిడ సెట్‌లో ఉంటే.. అమ్మ గుర్తుకొచ్చేది కాదు

ఒకే తరహా పాత్రను ఎవరైనా  నటుడో, నటో వరుసగా నాలుగైదు చిత్రాల్లో పోషిస్తేనే ‘అబ్బా.. మొనాటనీ అయిపోతుంది బాబూ’ అని ప్రేక్షకులు చిరాకు పడిపోతుంటారు. అటువంటిది ఒక తరహా పాత్రను ఒకటి కాదు రెండు కాదు.. వందలాది చిత్రాల్లో పోషించడమే కాకుండా, ప్రతిసారీ ఈమెకు సాటి మరెవరూ లేరు అనిపించుకోవడం మాములు విషయం కాదు. ఆ ఘనత, గౌరవం విశిష్ట నటి సూర్యకాంతంకు మాత్రమే దక్కాయి . ఎడమ చెయ్యి తిప్పుతూ, శాపనార్థాలు పెడుతుంటే సినిమాలోని పాత్రలే కాదు ప్రేక్షకులు కూడా ‘వామ్మో’ అని భయపడేవారు. గయ్యాళి అత్త పాత్రలకు ఓ ల్యాండ్‌ మార్క్‌ క్రియేట్‌ చేసిన సూర్యకాంతం శత జయంతి  సందర్బంగా ఆవిడతో కలసి కొన్ని చిత్రాల్లో నటించిన సీనియర్‌ నటి రోజారమణి తన అనుభవాలు, అనుభూతులు ‘నవ్య’తో పంచుకొన్నారు.


సూర్యకాంతంగారితో కలసి నేను నటించిన తొలి చిత్రం ‘శ్రీదేవి’. హరనాథ్‌గారు, కె.ఆర్‌.విజయగారు హీరోహీరోయిన్లు. నాకు అప్పుడు తొమ్మిదేళ్లు ఉంటాయేమో.అందులో టైటిల్‌ రోల్‌ నాదే. గుమ్మడిగారు నన్పు పెంచుకోవడానికి తీసుకువస్తారు. అది సూర్యకాంతంగారికి ఇష్టం  ఉండదు. అందుకే చీటికీ మాటికీ నన్ను తిట్టేస్తుంటారు. ఆవిడతోనే కాంబినేషన్‌ సీన్లు ఎక్కువ. ఆ తర్వాత అంటే మూడు నాలుగేళ్ల అనంతరం ‘రామాలయం’ చిత్రంలో మళ్లీ ఆవిడతో కలసి నటించాం.  అత్తగారుగా ఆవిడ, కొడుకుగా చంద్రమోహన్‌గారు నటించారు. మా ఇద్దరినీ కలవనివ్వకుండా, మాట్లాడుకోకుండా చూసే గయ్యాళి అత్త పాత్ర అది. ‘ఎందుకు బిడియం చిట్టెమ్మా..సందిట రావే చిన్నమ్మా’ అని ఆయన పాడితే, ‘వస్తుందేమో అత్తమ్మ.. భయమేస్తోంది ఓ యమ్మా’ నేను పాడతాను. ఈ పాట మేం పాడుకుంటుండగా సూర్యకాంతంగారు గరిట పట్టుకుని వస్తారు. చాలా మంచి పాట అది. ఆ రోజుల్లో గయ్యాళి అత్త అంటే సూర్యకాంతంగారే. తెరపై కోడళ్లను రాచి రంపాన పెట్టే పాత్రలు ఎన్నో పోషించినా, నిజ జీవితంలో మాత్రం ఆవిడంత మంచి మనిషి మరొకరు లేరు. సెట్‌లో మేమంతా ఉంటే ఓ అమ్మలాగా ఆవిడ చూసుకునేవారు. పులిహోర, గారెలు, చేగొడీలు.. ఇలా రకరకాల వంటకాలు ఇంటి దగ్గర నుంచి తీసుకువచ్చి మా అందరికీ పెట్టేవారు.  ఇంతంత పెద్ద స్టీల్‌ డబ్బాల నిండా ఆవిడ తెచ్చే వంటకాలు తినలేక  ఇబ్బంది పడేవాళ్లం.  ఆవిడది ఎడమ చేతి వాటం కదా.. ఆ చెయ్యి అలా  తిప్పుతూ ‘తినండి.. తినండి’ అనేవారు. ‘వద్దమ్మా నేను తినలేను’ అంటే..‘ఈ వయసులో కాకపోతే ఎప్పుడు తింటావే.. పిచ్చి మొహమా. ఎవరి కోసం తెచ్చాను ఇవన్నీ.’   అని కసిరి మరీ తినిపించేవారు. అంత ప్రేమ: అభిమానం! . నేననే కాదు.. సెట్‌లో అందరితోనూ అలాగే ఉండేవారు. తెర మీద ఆమె పోషించే పాత్రలకు, వ్యక్తిత్వానికీ సంబంధమే లేదు. తెర మీద అంత గయ్యాళిగా నటించిన ఆవిడేనా ఈవిడ.. అనే సందేహం మాకు కలిగేది.

MB.jpeg


సందడే సందడి
సెట్‌లో సూర్యకాంతంగారు ఉంటే సరదా.. సందడి. ‘ఒరేయ్‌ అబ్బాయి.. ఒసేయ్‌ అమ్మాయి’ అంటూ ఆప్యాయంగా పలకరించేవారు. రంగారావుగారు, రేలంగి గారు, గుమ్మడిగారు.. ఇలా సెట్‌లో ఎవరు ఉన్నా డామినేటింగ్‌ పర్సనాలిటీ ఆవిడే. ‘అక్కా’ అనో, ‘అమ్మా’ ‘ పిన్ని అనో అందరూ పిలిచేవారు. నేను మాత్రం ఆవిడను ‘అమ్మా’ అని పిలిచేదాన్ని. ఆవిడ సెట్‌లో ఉంటే నాకు మా అమ్మ గుర్తుకు వచ్చేది కాదు. నేను చాలా చిన్నపిల్లని కనుక మరింత ఆప్యాయంగా చూసేవారు. ‘ఏయ్‌ రావే.. తిను’ అని సినిమాలో ఎంత గట్టిగా డైలాగ్‌ చెబుతారో అంతే స్వరంతో సెట్‌లో కూడా మాట్లాడేవారు. తల మీద మొట్టికాయ వేయడం, బుగ్గ గిల్లడం చేసేవారు. నాలుగు రోజులు వరసగా ఆవిడతో షూటింగ్‌ చేశాక, ఐదో రోజు ఆవిడ రాలేదనుకోండి ఎంతో వెలితిగా ఉండేది. అప్పట్లో ఆర్టిస్టుల ఇళ్లలో జరిగే పెళ్లిళ్లకు, గృహప్రవేశాలకు అందరం వెళ్లేవాళ్లం. ఆప్యాయంగా మాట్లాడుకొనేవాళ్లం. అక్కడికి సూర్యకాంతంగారు వస్తే చెప్పనక్కర్లేదు. సందడంతా అక్కడే ఉండేది.

 
పాత్రను అవిడే డిజైన్‌ చేసుకొనేవారు
సూర్యకాంతంగారు సెట్‌లోకి రాగానే దర్శకుడు ‘అమ్మా రంగారావుగారి భార్య మీరు. చాలా డబ్బు ఉన్న మనిషి. నిండుగా మహాలక్ష్మిలా ఉండాలి’ అని మాత్రం చెప్పేవారు. ఆ పాత్ర కోసం ఆవిడే ప్రిపేర్‌ అయ్యేవారు. పట్టుచీర కట్టుకుని, మెడలో నగలు వేసుకుని, ముఖాన ఇంత పెద్ద బొట్టు, జడలో పువ్వులు పెట్టుకుని ముత్తయిదువులా తయ్యారయ్యేవారు. ‘అమ్మా.. మీది పేదరాలి పాత్ర’ అని చెప్పగానే ఆ రకంగా తనే తయారు అయ్యేవారు. ఆ రోజుల్లో స్టయిలిస్టులు ఎవరున్నారు!. తన పాత్రను తనే డిజైన్‌ చేసుకునే వారు.

 


Untitled-1.jpg

కళ్లజోళ్లు అంటే చాలా ఇష్టం
ఆవిడ చాలా స్టయిల్‌గా ఉండేవారు. ముఖ్యంగా కళ్లజోళ్లు అంటే చాలా ఇష్టం. కొత్త రకం కళ్లజోడు మార్కెట్‌లోకి వస్తే తప్పకుండా కొనేవారు. ఇప్పుడు ఇంత పెద్ద కళ్లుజోళ్లు పెడుతున్నారే అవి ఆ రోజుల్లోనే ఆమె వాడేవారు. రామారావుగారు, రంగారావుగారు, భానుమతిగారు సెట్‌లోకి రాగానే వాతావరణం ఎలా ఉండేదో సూర్యకాంతంగారు సెట్‌కు వచ్చినప్పుడు అలా ఉండేది. ఆవిడంటే ప్రతి ఒక్కరికీ గౌరవం. రామారావుగారు ‘అక్కయ్యగారూ ’ అని పిలిచేవారు. రంగారావుగారు కూడా ఎంతో గౌరవించేవారు.

 
చీర కట్టుకోవడం ఇబ్బంది అనిపిస్తే ...
‘రామాలయం’ చిత్రంలో నటించే సమయానికి నాకు పదమూడేళ్లు ఉంటాయేమో. చీరలు కట్టడం నాకు అప్పటికి అలవాటు కాలేదు. లంగా ఓణి వేసేదాన్ని. సూర్యకాంతంగారు గుడికి వెళ్లినప్పుడు చంద్రమోహన్‌గారు, నేను ఓ పాట పాడుకుంటుంటా.ం మధ్యలో ఆవిడ వస్తారు. ఈ పాట కోసం నాకు చీర కట్టారు. ఆ రోజుల్లో బ్రొకెట్‌ చీరలు అని ఉండేవి. అవి చూడడానికి బాగుంటాయి కానీ కట్టుకోవడం చాలా కష్టం. గుచ్చుకుపోతుంటుంది. ఒక స్టెప్‌ వేయగానే చీర ఊడిపోయేది. నాకు ఏడుపు ఒకటే తక్కువ. ఆ చీర కట్టుకోను అని చెప్పేశాను. చంద్రమోహన్‌గారు నాకు సపోర్ట్‌ చేశారు. ‘ఎందుకయ్యా ఆ అమ్మాయిని ఇబ్బంది పెడతారు? ఎంచక్కా లంగా ఓణి వేయ్యవచ్చు కదా’ అన్నారు. కానీ సూర్యకాంతంగారు ఒప్పుకోలేదు. ‘పెళ్లయిన అమ్మాయికి లంగా ఓణి ఎలా వేస్తారయ్యా.. చీర కట్లాలి. నువ్వు ఉండు’ అని కసిరేసి కాస్ట్యూమర్‌ని పిలిచారు. ‘కట్టుకోవడానికి వీలుగా ఈ చీరను కలిపి కుట్టేయ్యండి’ అన్నారు. వెంటనే చంద్రమోహన్‌గారు కూడా మంచి ఐడియా.. అలా చేయండి’ అన్నారు. టైమ్‌ పడుతుంది సార్‌ అన్నాడు కాస్ట్యూమర్‌. ‘పరవాలేదు. ఈ లోపు మా కాంబినేషన్‌ షాట్స్‌ తీసుకుంటారు లే’ అని చెప్పి కాస్ట్యూమర్‌కి కుట్టమని చెప్పారు. ఫ్యాంటులా తొడుక్కునే విధంగా చీరని కలిపి కుట్టేసి తీసుకువచ్చాడు కాస్ట్మూమర్‌. ఈ లోపు చంద్రమోహన్‌, సూర్యకాంతం మీద సీన్లు తీశారు దర్శకుడు. అది నేను తొడుక్కున తర్వాత ఇప్పుడు గెంతుమ్మా.. నువ్వు ఎంత గెంతినా చీర ఊడదు’ అని చెప్పారు సూర్యకాంతం.ఆ సంఘటనని మరిచిపోలేను.

Surya kantha,.jpg
మంచి చెడులు చెప్పేవారు
సెట్‌లో , బయట ఎలా ఉండాలో ఆవిడ చెబుతుండేవారు. ఎవరన్నా కారు ఎక్కండి అని అడిగితే తొందరపడి వెళ్లకండి. అమ్మా నాన్న చెప్పిన మాట వినాలి అని మాకు చెబుతుండేవారు. సినిమాల మీద మోజుతో ఇంట్లోంచి పారిపోయి మద్రాసు వచ్చిన అమ్మాయిలను చేరదీసేవారు సూర్యకాంతం. వాళ్ల తల్లితండ్రులకు కబురంపి దారి ఖర్చులు ఇచ్చి జాగ్రత్తగా ఇంటికి పంపేవారని సీనియర్స్‌ చెబుతుంటే విన్నాను. సినిమా వ్యామోహంలో పడి తప్పు చేయద్దని ఆ అమ్మాయిలకు చెబుతుండేవారట. సూర్యకాంతంగారు, ఆ తర్వాత నిర్మలమ్మగారు అలా చేసేవారు.


ఆ ఆలసట కనిపించేది కాదు
సూర్యకాంతంగారిది భారీ పర్సనాలిటీ అయినా, ఆమెలో అలసట కనిపించేది కాదు. షాట్‌ చేసి వచ్చిన తర్వాత ‘అమ్మా.. అబ్బా’ అనేవారు కాదు. ఎప్పుడూ మంచి ఎనర్జీతో ఉండేవారు. అనర్ఘళంగా మాట్లాడుతూనే ఉండేవారు. ‘షూటింగ్‌ ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూసేవారు కాదు. అందరినీ నవ్విస్తూ తను నవ్వుతూ ఉండేవారు. సెట్‌లో రాజబాబుగారు ఉంటే ఇక వాళ్ల అల్లరి చెప్పనక్కర్లేదు. మాలాంటి వాళ్లకు ఆవిడ ఓ ఇన్‌స్పిరేషన్‌ రోల్‌ మోడల్‌.


తనే వండి తెచ్చేవారు...
సూర్యకాంతంగారు చాలా తక్కువగా తినేవారు. కానీ మిగిలిన అందరికీ కొసరి కొసరి వడ్డించేవారు. ఆవిడ ఇంట్లో ఎప్పుడు లేచి వండేవారో కానీ రెండు మూడు రకాల పిండివంటలు ఇంటి దగ్గర నుంచి తెచ్చేవారు. ఇవాళ తెచ్చిన ఐటెమ్స్‌ రేపు ఉండవు. రోజూ కొత్త కొత్త వంటలే. ‘మీరు పెట్టే తిండి తిని మాకు నిద్ర సెట్‌లో మాకు నిద్ర వస్తోందమ్మా’ అంటే ‘మీరంతా చిన్న పిల్లలు. బాగా తినాలి. డాన్సులు చేయాలి కదా. బలం ఎక్కడ నుంచి వస్తుంది.! ఇవన్నీ స్వచ్ఛమైన నెయ్యి, నూనెలతో  నేను ఇంట్లో చేసినవి. బయటి తిళ్లు తినకండి. నన్ను చూడండి ఈ వయసు వచ్చాక కూడా ఎలా ఉన్నానో! నేను బయటి తిండి తినను. స్నాక్స్‌ కూడా ఇంట్లోనే చేసుకుంటాను.

వినాయకరావు.యు

Updated Date - 2023-10-29T12:39:38+05:30 IST