Mohan babu: పాత్ర‌కు ప్రాణం పోసే ఈ స్పెష‌లిస్ట్ ప్ర‌స్థానానికి..48 ఏళ్లు

ABN , First Publish Date - 2023-11-22T15:54:10+05:30 IST

తన నటనతో తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన‌ విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్, నట ప్రపూర్ణ మోహన్ బాబు సినిమా రంగంలోకి వచ్చి 48 ఏళ్లు అవుతోంది. నటుడిగా ఆయన ఈ 48 ఏళ్లలో ఎన్నెన్నో రికార్డులు నెలకొల్పగా, ఎన్నో ఒడిదుడుకులను, ఎత్తుపల్లాలను చూశారు. ఆయ‌న జీవితంలోని కొన్ని ముఖ్య‌ ఘ‌ట్టాలివే..

Mohan babu: పాత్ర‌కు ప్రాణం పోసే ఈ స్పెష‌లిస్ట్ ప్ర‌స్థానానికి..48 ఏళ్లు
Mohan Babu

తన నటనతో తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన‌ విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్, నట ప్రపూర్ణ మోహన్ బాబు (Mohan babu) సినిమా రంగంలోకి వచ్చి 48 ఏళ్లు అవుతోంది. నటుడిగా ఆయన ఈ 48 ఏళ్లలో ఎన్నెన్నో రికార్డులు నెలకొల్పగా, ఎన్నో అవార్డులను అందుకున్నారు, ఎన్నో ఒడిదుడుకులను, ఎత్తుపల్లాలను చూశారు. భక్తవత్సలం నాయుడుగా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయ‌న ఆ త‌ర్వాత‌ మోహన్ బాబుగా మారారు. 70వ దశకంలో ఆయన నట ప్రస్థానం మొదలవ‌గా ఆరంభంలో అందరికీ ఎదురైనట్టుగానే ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదురయ్యాయి. ఆయన అకుంఠిత భావం, కష్టపడే తత్త్వం, అంకిత భావంతో కష్టపడి ఎదిగారు. ఈ క్ర‌మంలో ఆయ‌న జీవితంలోని కొన్ని ముఖ్య‌ ఘ‌ట్టాలివే..

మోహన్ బాబు తనదైన రీతిలో డైలాగ్స్ చెప్పడం, విలక్షణంగా నటించడం, నవ్వించడం, ఏడిపించడం, విలనిజంలో కొత్తదనం చూపించడంతో అతి కొద్ది కాలంలోనే ప్రేక్షకుల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగు వారి మదిలో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయేలా సినిమాల్లో పాత్రలకు ప్రాణ ప్ర‌తిష్ట చేస్తూ వ‌చ్చారు. సినిమా పరిశ్రమ మీద మక్కువతో ఆయన నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టి శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ మీద ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించారు.


దాదాపు 600కుపైగా సినిమాల‌లో న‌టించి ఎన్నో విజయాలు అందుకున్న మోహన్ బాబు.. నిర్మాతగా అరుదైన రికార్డులను సైతం సొంతం చేసుకున్నారు. మోహన్ బాబు ఖాతాలో ఎప్పటికీ చెరిగినిపోని రికార్డులున్నాయి. పెదరాయుడు, అసెంబ్లీ రౌడీ, రాయలసీమ రామన్న చౌదరి వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించడమే కాకుండా.. మోహన్ బాబుని విలక్షణ నటుడిగా నిలబెట్టేశాయి. నా రూటే వేరు అంటూ మోహన్ బాబు చెప్పిన ఐకానిక్ డైలాగ్స్, మ్యానరిజం తెలుగు ప్రేక్షుకలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన డైలాగ్స్, మ్యానరిజంకు ప్రత్యేక అభిమాన గణం ఉంటుంది. ఆయనలా విలక్షణంగా నటించేవారు ఉండటం చాలా అరుదు.

mohan-bab.jpg

మోహన్ బాబు చిత్ర పరిశ్రమలో నటుడిగా 48 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన పట్టుదల, అంకితభావం ఈ త‌రం న‌టుల‌దరికీ నిదర్శనంగా నిలుస్తుంది. ఇప్పటికీ ఆయన నవతరానికి స్పూర్తిగానే నిలుస్తున్నారు. నటుడిగా ఐదు దశాబ్దాలకు దగ్గర పడుతున్నా.. ఇంకా ఎంతో ఉత్సాహంగా, ఎనర్జీతో షూటింగ్‌లో పాల్గొంటున్నారు. తాజాగా కుమారుడు మంచు విష్ణు (Manchu vishnu) క‌న్న‌ప్ప‌గా న‌టిస్తున్న చిత్రంలో ఆయ‌న ఓ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌గా ఇంకాఆయన చేయబోయే తదుపరి చిత్రాలు, రాబోయే అద్భుతాల గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్, 'పద్మశ్రీ' అవార్డులు వరించాయన్న సంగతి తెలిసిందే.

Updated Date - 2023-11-22T15:58:42+05:30 IST