Director Bobby: చిరంజీవిలో మంచితనం.. ఆవేశం కలిస్తే..

ABN , First Publish Date - 2023-01-09T16:13:29+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవికి రాజకీయాలు ఒక్క శాతం కూడా సరిపడవని దర్శకుడు కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) అన్నారు. ఆయనకు దేవుడు.. ఒక తమ్ముడిని ఇచ్చాడు. అతను చూసుకుంటాడు. గట్టిగా సమాధానమిస్తాడని చెప్పారు.

Director Bobby: చిరంజీవిలో మంచితనం.. ఆవేశం కలిస్తే..

మెగాస్టార్‌ చిరంజీవికి (Chiranjeevi) రాజకీయాలు ఒక్క శాతం కూడా సరిపడవని దర్శకుడు కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) అన్నారు. ఆయనకు దేవుడు.. ఒక తమ్ముడిని ఇచ్చాడు. అతను చూసుకుంటాడు. గట్టిగా సమాధానమిస్తాడని చెప్పారు. సోమవారం వైజాగ్‌లో జరిగిన ‘వాల్తేరు వీరయ్య’ మెగా మాస్‌ పార్టీలో(Mega mass party) బాబీ (bobby) మాట్లాడుతూ ‘‘అన్నయ్యా మీకు రాజకీయాలు అసలు సరిపడవు. దేవుడు మీకు పవన్‌ అనే తమ్ముడిని ఇచ్చాడు. అంతా ఆయన చూసుకుంటాడు. ఆయన సమాధానం చెబుతాడు. గట్టిగా నిలబడతాడు. మీ ఆశయాల్ని నెరవేరుస్తాడు. చిరంజీవిలోని మంచితనం, ఆవేశం కలిస్తే పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌. మాటకి మాట.. కత్తికి కత్తి పవర్‌స్టార్‌’’ అని అన్నారు.

"చిన్నప్పటి నుంచీ చిరంజీవికి అభిమానిని. ఇంద్ర సినిమా నుంచి నా లక్ష్యం ఏంటనేది అర్థమైంది. అంతే ఇండస్ట్రీలోకి వచ్చేశా. 2003లో అసిస్టెంట్‌ రైటర్‌గా చిన్నికృష్ణ దగ్గర చేరా. 20 ఏళ్లకి చిరంజీవితో సినిమా చేేస ఛాన్స్‌ వచ్చింది. ఓ అభిమానికి దర్శకుడిగా అవకాశం వస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాతో తెలుస్తుంది. ఓ సందర్భంలో షూటింగ్‌లో ఉండగా ‘అన్నయ్యా.. రాజకీయంలో ఎదురుదాడి ఎందుకు చేయరు’ అని అడిగా. ‘బాబీ.. వాళ్లు ఏదో వాగారని... మనం వాగితే తేడా ఏం ఉంటుంది. ఇంట్లో వారికీ అమ్మానాన్న, అక్కా, చెల్లి, భార్య బిడ్డలు ఉంటారు. అలాంటి మాటలు వింటే వాళ్లు బాధపడతారు’ అని కంట నీరు వచ్చే సమాధానం చెప్పారు. అదీ చిరంజీవి అంటే! ఆయనకున్న సంస్కారం అది. ఆయనకు అభిమానిని కావడం ఓ అదృష్టం’’ అని అన్నారు.

చిరంజీవి, రవితేజ(Raviteja) కీలక పాత్రధారులుగా కె.ఎస్‌.రవీంద్ర (k s ravindra) దర్శకత్వం వహించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. శ్రుతీహాసన్‌ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది.

22.jpg

Updated Date - 2023-01-09T16:13:31+05:30 IST