Nupur sanon : ఇంట్లో వాళ్లకి వినిపిస్తుందేమోనని బాత్రూంలోకి వెళ్లి ఏడ్చాను

ABN , First Publish Date - 2023-10-15T10:23:04+05:30 IST

నుపుర్‌ సనన్‌.. ఇన్నాళ్లు అందాల తార కృతి సనన్‌ చెల్లెలిగా తెలుసు. యూట్యూబర్‌గా కెరీర్‌ మొదలుపెట్టి, కవర్స్‌ సాంగ్స్‌తో సూపర్‌ క్రేజ్‌ సంపాదించుకుని... ఇప్పుడు వెండితెరపై తళుక్కుమనేందుకు సిద్ధమైంది.

Nupur sanon : ఇంట్లో వాళ్లకి వినిపిస్తుందేమోనని బాత్రూంలోకి వెళ్లి  ఏడ్చాను

నుపుర్‌ సనన్‌(Nupur Sanon) .. ఇన్నాళ్లు అందాల తార కృతి సనన్‌ (Krithi sanon) చెల్లెలిగా తెలుసు. యూట్యూబర్‌గా కెరీర్‌ మొదలుపెట్టి, కవర్స్‌ సాంగ్స్‌తో సూపర్‌ క్రేజ్‌ సంపాదించుకుని... ఇప్పుడు వెండితెరపై తళుక్కుమనేందుకు సిద్ధమైంది. ‘టైగర్‌ నాగేశ్వరరావు’తో (Tiger Nageswararao) జతకట్టిన ఈ అందాల సుందరి అభిప్రాయాలివి...

అలా... నా ప్రయాణం

2005లో యూట్యూబర్‌గా నా ప్రయాణం మొదలైంది. సినిమాల్లోని పాటలను నాదైన శైలిలో పాడి ప్రేక్షకులను అలరించేదాన్ని. నా మొదటి పాట ‘బెకరార్‌ కర్కే’. దానికి మంచి ఆదరణ లభించడంతో వరుసగా ‘తేరే సాంగ్‌’, ‘హవాయె’, ‘జనం జనం’, ‘లాయాన్‌’... ఇలా బోలెడు పాటలు పాడా. నాలుగేళ్ల క్రితం అక్షయ్‌కుమార్‌ సరసన ‘ఫిల్హాల్‌’ అనే ఓ ప్రైవేట్‌ ఆల్బమ్‌లో నటించా. యూట్యూబ్‌లో అత్యంత వేగంగా 100 మిలియన్ల వ్యూస్‌ దక్కించుకున్న మొదటి వీడియోగా అది అప్పట్లో రికార్డు సృష్టించింది. ఆ తర్వాత మా ఇద్దరి కలయికలో ’ఫిల్హాల్‌ 2’ వచ్చింది. అది కూడా పెద్ద హిట్‌.

అనుకోకుండా సినిమాల్లోకి..

నాకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం. అందుకే మ్యూజిక్‌నే కెరీర్‌గా ఎంచుకోవాలనుకున్నా. కానీ ఓ రోజు నా మ్యూజిక్‌ కవర్స్‌ చూసి ఆడిషన్‌కి రమ్మన్నారు. తీరా అక్కడికి వెళ్లాక తెలిసింది... వాళ్లు పిలిచింది సింగింగ్‌ ఆడిషన్‌ కోసం కాదు... యాక్టింగ్‌ ఆడిషన్‌ కోసమని. ఎలాగూ అక్కడిదాకా వెళ్లాను కదా అని ఆడిషన్‌ ఇచ్చి వచ్చేశా. కానీ ఆశ్చర్యంగా సెలెక్టయ్యా. కొన్ని వర్క్‌షాప్స్‌ కూడా చేశాం. ఆ క్రమంలో తెలియకుండానే నటన మీద మక్కువ ఏర్పడింది. హీరోయిన్‌ అవ్వాలని అప్పుడే గట్టిగా ఫిక్సయ్యా. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది.

Nuptr-2.gif

ఎప్పటికీ ప్రత్యేకమే..

నా ఫేవరెట్‌ సింగర్‌ శ్రేయాఘోషాల్‌. ఆమె వాయిస్‌ అంటే నాకు పిచ్చి. ‘ఫిల్హాల్‌’ నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ సాంగ్‌. నటిగా అడుగులు పడింది ఆ పాటతోనే కాబట్టి ఆ సాంగ్‌ ఇప్పటికీ, ఎప్పటికీ నాకు ప్రత్యేకమే. నటిని కాకముందు హిందూస్థానీ సంగీతంలో కొంతకాలం శిక్షణ పొందా. స్కూల్‌, కాలేజీల్లో ఏదైనా కార్యక్రమం జరిగితే నా పాట ఉండాల్సిందే. షారుక్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌, లియోనార్డో డికాప్రియో అంటే పిచ్చి. హీరోయిన్లలో అక్క కృతితో పాటు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె అంటే ఇష్టం.

అక్క కాదు... అమ్మ

కృతి నాకు అక్క మాత్రమే కాదు... అమ్మ కూడా. ఓ తల్లిలా నన్నెప్పుడూ ప్రొటెక్ట్‌ చేస్తూ ఉంటుంది. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ కూడా తనే. నాకు ఏం కావాలో నాకన్నా తనకే బాగా తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నా వెన్నంటే ఉంటుంది. చిన్నప్పుడు ఎవరైనా నన్ను టీజ్‌ చేస్తే వాళ్లని చితకబాదేది. మేముండే అపార్ట్‌మెంట్‌లో ఓ అబ్బాయి నన్ను ఓసారి కొట్టాడు. కృతి నేరుగా ఆ అబ్బాయి వాళ్ల ఇంటికెళ్లి జరిగిన విషయమంతా చెప్పి తనని వాళ్లతోనే కొట్టించింది. ఆ సంఘటన ఇప్పటికీ నాకు బాగా గుర్తు.

Nupur-3.gif

బాత్రూంలో ఏడ్చేశా

కాలేజీ రోజుల్లో ఓ అబ్బాయిని ప్రేమించా. తనంటే నాకు విపరీతమైన ఇష్టం. ఆ వయసులో అందరూ మంచివాళ్లుగానే కనిపిస్తారు. అలా తనని గుడ్డిగా నమ్మేశా. కానీ తను నన్ను మోసం చేశాడనే విషయం ఓ రోజు తెలిసింది. నా కన్నీళ్లు అస్సలు ఆగలేదు. గట్టిగా ఏడిస్తే ఇంట్లో వాళ్లకి వినిపిస్తుందేమోనని బాత్రూంలోకి వెళ్లి మరీ ఏడ్చేశా. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా నెలలు పట్టింది. ఆ తర్వాత ఎవరినీ అంత సులువుగా నమ్మకూడదని నిర్ణయుంచుకున్నా.

బ్లాక్‌ కాఫీ ఉండాల్సిందే...

నాకు వంట చేయడం పెద్దగా నచ్చదు. కానీ లాక్‌డౌన్‌ సమయంలో గరిటె తిప్పడం నేర్చుకున్నా. ఆ సమయంలో నేను, కృతి రకరకాల వంటకాలు చేసి ఇంట్లో వాళ్లకి వడ్డించేవాళ్లం. మెక్సికన్‌ ఫుడ్‌ అంటే చాలా ఇష్టం. మ్యాగీ, నూడుల్స్‌ ఇష్టంగా తింటా. బ్లాక్‌ కాఫీ లేనిదే నాకు రోజు మొదలవ్వదు.

45.gif

Updated Date - 2023-10-15T10:25:43+05:30 IST