Salaar release date: అందరూ ఎదురుచూస్తున్న ప్రభాస్ సినిమా విడుదల అప్పుడేనా...

ABN , First Publish Date - 2023-09-12T17:47:09+05:30 IST

అందరూ ఎదురు చూస్తున్న ప్రభాస్ సినిమా 'సాలార్' విడుదల తేదీ ఖరారు అయినట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గ్రాఫిక్ పని పూర్తి అయిపోతోందని, ఇక విడుదల తేదీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

Salaar release date: అందరూ ఎదురుచూస్తున్న ప్రభాస్ సినిమా విడుదల అప్పుడేనా...
A still from Salaar

ప్రభాస్ (Prabhas), దర్శకుడు ప్రశాంత్ నీల్ (PrashanthNeel) కాంబినేషన్ లో వస్తున్న 'సాలార్' #Salaar సినిమా విడుదల కోసం ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అసలు విడుదల తేదీ ప్రకటించకపోయినా, ఆ సినిమా గురించి ఎటువంటి సమాచారం కూడా ఇంతవరకు ఆ చిత్ర నిర్వాహకులు ఇవ్వకపోవటం అభిమానులని అసహనానికి గురి చేస్తోంది. సెప్టెంబర్ 28 న విడుదల కావలసిన ఈ సినిమా నిరవధికంగా వాయిదా వేశారు. మళ్ళీ ఎప్పుడు అనేది ఇంతవరకు ఒక ప్రకటన కూడా చెయ్యలేదు.

సరి కదా, సెప్టెంబర్ 28 న విడుదల కావటం లేదు, వాయిదా పడింది అని కూడా కనీసం చిత్ర నిర్వాహకులు చెప్పలేదు అని అభిమానులు మండిపడుతున్నారు. అసలు ఇంతకీ వాయిదా పాడటానికి కారణం కేవలం గ్రాఫిక్స్ ఒక్కటేనా? అంటే అదే అని అంటున్నారు పేరు చెప్పడానికి ఇష్టపడని ఈ సినిమాలో పని చేసిన కొందరు.

షూటింగ్ అయిపొయింది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది, కానీ గ్రాఫిక్ వర్క్ మాత్రం పెండింగ్ లో వుంది అని అంటున్నారు. అయితే విడుదలకి నెలరోజులకు ముందు గ్రాఫిక్స్ ఇస్తే సినిమా విడుదల తేదీ అధికారికంగా ప్రకటించవచ్చు అని చిత్ర నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. అందువలనే ఈ వాయిదా వెయ్యటం అని కూడా తెలిసింది. అయితే త్వరలో అది కూడా పూర్తి అయిపోతుంది అని అంటున్నారు. ఇందులో పని చేసే చాలామంది నటులు తమ డబ్బింగ్ కూడా చెప్పేసినట్టుగా తెలిసింది.

Prabhas.jpg

అయితే ఇప్పుడు చిత్ర నిర్వాహకులు కొత్త తేదీ కోసం చూస్తున్నట్టుగా తెలిసింది. దానికి డిసెంబర్ 22 కరెక్టు అయిన తేదీగా అనుకుంటున్నట్టుగా చిన్న సమాచారం. ఎందుకంటే డిసెంబర్ 22 శుక్రవారం విడుదలైతే, డిసెంబర్ 23, 24 శని, ఆదివారాలు వస్తాయి. అయితే డిసెంబర్ 25 క్రిస్టమస్ పండగ సందర్భంగా సోమవారం సెలవు దినం కావటంతో కలిసి వస్తుందని, లాంగ్ వీకెండ్ వస్తుందని, అందుకని డిసెంబర్ 22 విడుదలకి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలిసింది.

ఒకవేళ డిసెంబర్ 22 న కానీ విడుదల చెయ్యలేకపోతే, వచ్చే సంవత్సరమే విడుదల కావాల్సి ఉందని కూడా తెలుస్తోంది. అప్పుడు ఇంకో కొత్త తేదీని ప్రకటించాల్సి వుంది, ఎందుకంటే సంక్రాంతి పండగకి కొన్ని సినిమాలు తమ విడుదలని అధికారికంగా ప్రకటించాయి కాబట్టి, ఆ తరువాత ఒక మంచి తేదీ చూసుకొని విడుదల చేయాల్సి ఉంటుంది. ఏమైనా ఈ సినిమా గురించి ఒక ప్రకటనా, ప్రచార చిత్రమో విడుదల చేస్తే అభిమానులు ముందు శాంతిస్తారని అంటున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ (ShrutiHaasan) కథానాయిక కాగా, మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (PrithvirajSukumaran) ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.

Updated Date - 2023-09-26T17:27:50+05:30 IST