Vidudala Part 1 film review: ‘విడుదల’లో విషయం వుంది, చూడాల్సిన సినిమా

ABN , First Publish Date - 2023-04-14T17:49:51+05:30 IST

వెట్రిమారన్ దర్శకత్వం వహించిన 'విడుదల' సినిమాలాంటివి చాలా అరుదుగా వస్తాయి. ఒక అర్థవంతమైన సినిమా చూడాలి అనే ప్రేక్షకుడు ఈ సినిమాని కచ్చితంగా చూడాలి. సహజసిద్ధంగా వుండే కథ, నటీనటులు అద్భుత నటన, ప్రదేశాలు, వీటన్నికీ తోడు మాస్ట్రో ఇళయరాజా సంగీతం ఇవన్నీ కలిపితే ఈ 'విడుదల' చూసి తీరాలి.

Vidudala Part 1 film review: ‘విడుదల’లో విషయం వుంది, చూడాల్సిన సినిమా
Vidudala film still

సినిమా: విడుదల పార్ట్ 1

నటీనటులు: సూరి, విజయ్ సేతుపతి, భవాని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఇళవరసు, చేతన్ కె, మున్నార్ రమేష్ తదితరులు

ఛాయాగ్రహణం: ఆర్. వేల్రాజ్

సంగీతం: ఇళయరాజా (Ilaiyaraaja)

రచయిత: బి. జయమోహన్

దర్శకత్వం: వెట్రిమారన్ (Vetrimaaran)

నిర్మాత: ఎల్రెడ్ కుమార్

-- సురేష్ కవిరాయని

దక్షిణాదిలో మణిరత్నం (Mani Ratnam), బాల (Bala), కృష్ణవంశి (Krishna Vamsi), శంకర్ (Shankar), గౌతమ్ మీనన్ (Gautam Menon), వెట్రి మారన్ (Vetrimaaran) లాంటి దర్శకుల సినిమాల కోసం ప్రేక్షకులు ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. వీరు తీసిన కొన్ని సినిమాలు అయితే చాలా సహజ సిద్ధంగా, నేటివిటీ కి చాలా దగ్గరగా వుండే సినిమాలు వస్తూ ఉంటాయి. దర్శకుడు వెట్రిమారన్ ఇప్పుడు 'విదుతలై' (Viduthalai) సినిమాని తెలుగులో 'విడుదల' (VidudalaFilmReview) గా విడుదల చేస్తున్నారు. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ఈ సినిమా చూసి నచ్చి తన గీత ఫిలిమ్స్ డిస్టిబ్యూషన్ ద్వారా ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. వెట్రిమారన్ సినిమాలు అన్నీ (VidudalaReview) అవార్డులు గెలుచుకుంటూనే ఉంటాయి. అతని సినిమాలు చాలా సహజ సిద్ధంగా వుంది, అందులోనే ఒక సంఘర్షణ ఉంటుంది. ఇప్పుడు వస్తున్న 'విడుదల' పార్ట్ 1 కూడా పోలీసులకు, ప్రజా దళం అనే ఒక రివల్యూషనరీ గ్రూప్ కి మధ్య ఒక కొండ ప్రాంతంలో నడిచే కథ. కమెడియన్ సూరి ఇందులో ప్రధాన పాత్ర పోషించగా, విజయ్ సేతుపతి ఇంకో ప్రధాన పాత్రలో కనపడతాడు.

vidudala1.jpg

Vidudala story విడుదల కథ:

కుమరేశన్ (సూరి) పోలీస్ డిపార్ట్ మెంట్ లో డ్రైవర్ గా పని చేస్తూ ఉంటాడు, అతనికి ఒక కొండ ప్రాంతంలో పోస్టింగ్ ఇస్తారు. అక్కడ పోలీసులకి ప్రజాదళం సభ్యులకి ఎన్ కౌంటర్లు, ఒకరి మీద ఒకరు పైచేయిగా ఉండటానికి ఏమి చెయ్యాలి అనే ప్లేన్స్ వేస్తూ వుంటారు. ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పేరిట అక్కడ ఫ్యాక్టరీ కట్టేస్తాం అడవిని కొట్టేస్తాం అని చెపుతూ అక్కడ పోలీస్ క్యాంపుని నడుపుతూ ప్రైవేట్ కంపెనీ వాళ్ళతో కలిసి క్యాంపు ని నిర్వహిస్తుంది. అక్కడే కొండ ప్రజలకు అండగా వున్న ప్రజాబలం నాయకుడు పెరుమాళ్ళు మాస్టర్ (విజయ్ సేతుపతి)ని పట్టుకోవడానికి పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తూ వుంటారు. కానీ ఎవరికీ అతను ఎలా ఉంటాడో తెలియదు. అక్కడికి ఒక స్పెషల్ ఆఫీసర్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) ని కూడా పంపిస్తుంది. కుమరేశన్ జీపు డ్రైవర్ గా కొండప్రాంతం లోని ఒక్కో చెక్ పోస్ట్ దగ్గర వున్న #VidudalaFilmReview పోలీసులకు భోజనం క్యారేజీలు ఇవ్వటం, తేవటం చేస్తూ ఉంటాడు. ఒకసారి అలా వెళుతూ వున్న సమయంలో కొండా ప్రాంతానికి చెందిన ఒక మహిళని తన జీపులో ఎక్కించుకొని హాస్పిటల్ కి తీసుకెళ్లి రక్షిస్తాడు. అదే సమయం లో ఆ మహిళ యొక్క మనవరాలు (భవాని) తో ప్రేమలో పడతాడు, పెళ్లి కూడా చేసుకుంటాను అంటాడు. ఆలా కొండ ప్రాంతానికి చెందిన మహిళను కాపాడటంతో కుమారేశన్ అధికారుల ఆగ్రహానికి లోనవుతాడు. అతనికి పనిష్మెంట్ కూడా ఇస్తారు. ఈలోపు పోలీసులు కొండ ప్రాంతం లో వున్న పురుషులు, మహిళలు అందరినీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పడేసి చిత్రహింసలు పెడతారు, పెరుమాళ్ళు మాస్టర్ ఆచూకీ చెప్పమని. అందులో కుమరేశన్ ప్రేమించే యువతి కూడా ఉంటుంది. వాళ్ళకి పెట్టె చిత్రహింసలు చూడలేక కుమరేశన్ తనకి పెరుమాళ్ళు మాస్టర్ ఎక్కడున్నాడో తెలుసు, చూపిస్తా, అయితే ఆ కొండ ప్రజలందరినీ విడిచి పెట్టాలనే షరతు పెడతాడు. ఇంతకీ ఈ మాష్టారు ఎవరు, ఎక్కడుంటాడు, కుమరేశన్ కి దొరుకుతాడా, ఏమవుతుందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

vidudalafilmreview.jpg

విశ్లేషణ:

తమిళ దర్శకుల్లో వున్న అతి కొద్దీ మంది అత్యద్భుత దర్శకుల్లో వెట్రిమారన్ ఒకడు. అతని సినిమాలన్నిటికీ అవార్డులు వస్తూనే ఉంటాయి. అలాగే అతను తీసిన సినిమాల కథలు ఎక్కడో జరిగినవి, చూసినవి అయి చాల సహజసిద్ధంగా ఉంటాయి. అతను ఎంచుకున్న కథలు అలాంటివి మరి. ఇప్పుడు ఈ 'విడుదల' పార్ట్ 1 కూడా అలాంటిదే. ఇది తమిళనాడు రాష్ట్రం లో ఒక ప్రాంతం లో జరిగే కథ. పోలీసులకు, ప్రజాదళం అనే ఒక విప్లవ పార్టీ కి మధ్య జరిగే సంఘర్షణ. ఈ ప్రజాదళం సభ్యులు, అక్కడ ఎంతో కాలంగా జీవనం సాగిస్తున్న కొండ ప్రాంతాల ప్రజల కోసం పోరాడుతూ వుంటారు. అక్కడ ప్రజల మద్దతు కూడా వాళ్ళకి ఉంటుంది.

vidudalafilmreview1.jpg

వెట్రిమారన్ తన సినిమా 'విడుదల' ప్రారంభించటమే ఒక ట్రైన్ ఆక్సిడెంట్ తో మొదలెట్టాడు. అసలు ఆ సన్నివేశం ఎంత అద్భుతంగా వుంది అంటే, మొదటి పది నిముషాల్లోనే మనల్ని సినిమాలోకి లీనం అయ్యేట్టు చేసాడు వెట్రిమారన్. ఆ ట్రైన్ ఆక్సిడెంట్ దృశ్యాలు చాలా అద్భుతంగా, సహజంగా ఉండేట్టు చూపించాడు. తరువాత పోలీస్ డ్రైవర్ బస్సులో రావటం, అదే బస్సులో ప్రజాబలం సభ్యులు ఉండటం, పోలీస్ ఎన్కౌంటర్ ఇవన్నీ చాలా చక్కగా కథని మెల్లగా ఆ గ్రామం వైపు తిప్పాడు. పోలీస్ అధికారులు, తన కిందివారి మీద ఎలా ప్రవర్తిస్తారు, అలాగే నిజం చెప్పటం కూడా నేరమే అయినా, తాను నిజమే చెప్తాను, తప్పు చెయ్యలేదు అని తన బాధ్యత ఎలా నెరవేరుస్తాడు అనే ఒక సిన్సియర్ డ్రైవర్ కుమరేశన్ పాత్ర ద్వారా కూడా బాగా చెప్పించాడు. అక్కడ జరిగే సంఘటన ఒకటి, పేపర్ లలో వచ్చే వార్త ఇంకొకటి అవనీ కళ్ళకు కట్టినట్టుగా రెండు వైపులా చూపించాడు వెట్రిమారన్.

vidudalafilmreview3.jpg

కుమరేశన్, పోలీస్ ఆఫీసర్ చెక్ పోస్ట్ లకి సరుకులు తీసుకొని కొండ ప్రాంతంలో వెళ్ళటం, ఆలా నడిచి నడిచి ఆ పచ్చని కొండను ఆ పరిసరాలను అద్భుతంగా తన కెమెరా లో బందించి ఎంతో సహజసిద్ధమయిన సన్నివేశాలతో సినిమాకి ఎంతో ఉపకరించిన ఆర్. వేల్రాజ్ నిజంగా అభినందనీయుడు. అలాగే ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఇళయరాజా ఒక మూల విరాట్టులా #VidudalaFilmReview నిలుచున్నాడు. ఇళయరాజా గురించి ఎంత చెప్పినా తక్కువే, అయినా అంతటి పెద్ద సంగీత దర్శకుడి గురించి ఏమి చెప్పగలం. అతని నేపధ్య సంగీతం ఈ సినిమాకి ఒక పెద్ద హైలైట్. ఆర్ట్ దర్శకుడు జాకీ కి ప్రత్యేక అభినందనలు, ముఖ్యంగా మొదట్లో వచ్చే ఆ రైలు #VidudalaFilmReview ప్రమాద ఘటన, ఆ బ్రిడ్జి మీద రైలు ఎంతో సహజంగా చేసాడు. అలాగే పెరుమాళ్ళు మాస్టర్ ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రజాబలం సభ్యులకి, పోలీస్ లకి మధ్య నడిచిన తుపాకీల యుద్ధ సన్నివేశం ఇంకో హైలైట్. ఇలా సినిమాలో చాలా హైలైట్స్ వున్నాయి. ఎన్నని రాయగలం, సినిమా అంతా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంటుంది. డిపార్ట్ మెంట్ లో ఇలా వుంటారా అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సినిమా మన కృష్ణ వంశీ తీసిన 'సింధూరం' సినిమాకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇందులో బ్రహ్మాజీ (Brahmaji) ఒక సిన్సియర్ పోలీస్ గా కనపడతారు. ఈ కథ పోలీసులకు, నక్సలైట్ లకు మధ్య జరిగే ఒక సంఘర్షణ. వెట్రిమారన్ 'విడుదల' కూడా ఇంచుమించు అలానే ఉంటుంది.

vidudalafilmreview5.jpg

నటీనటుల విశ్లేషణ:

ఇక నటీనటుల విషయానికి వస్తే, కమెడియన్ సూరి (Soori) కి ఇదొక విలక్షణ పాత్ర. అసలు అతన్ని ఈ పాత్రకి వెట్రిమారన్ (Vetrimaaran) అనుకోవటమే ఆశ్చర్యకరం. అతని కెరీర్ ఈ సినిమా నుండి చాలా చేంజ్ అవుతుంది అనటంలో సందేహం లేదు. అంతలా తన పాత్రకి జీవం పోసాడు సూరి. మొదటి నుండి చివరి వరకు అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు, ఎంతో సహజంగా, చాలా సులభంగా చేసాడు. అయితే అతను చాలా హోమ్ వర్క్ చేసాడు అని అర్థం అవుతోంది. అలాగే ఆ అమ్మాయి భవాని కొండ ప్రాంతానికి చెందిన యువతిలా ఇమిడిపోయింది. అందరిలానే తాను కూడా చాలా చక్కగా అభినయించి చూపించింది. ముఖ్యంగా ఆమె కళ్ళతో చేసిన అభినయం చాలా బావుంది. ఇంక విజయ్ సేతుపతి ఈ సినిమాకి ఇంకో హైలైట్ అని చెప్పాలి. పోలీస్ స్టేషన్ లో ఆ యువతిని కాపాడే సన్నివేశం, అలాగే చివరలో సూరితో వుండే సన్నివేశం హైలైట్ అనే చెప్పాలి. రెండో పార్టులో అతని పాత్ర ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautam Vasudev Menon) పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టాడు. ఇంకా మిగతా వాళ్ళు కూడా పోలీస్ పాత్రల్లో జీవించారని చెప్పాలి. ఆ కొండ ప్రాంతానికి చెందిన మనుషులు నిజంగా అక్కడి వూర్లో ఉన్నవాళ్ళని సినిమాలో పెట్టారా అన్నట్టుగానే కనిపిస్తారు అందరూ. మాటలు కూడా చాలా బాగుంటాయి, ఛాయాగ్రహణం, నేపధ్య సంగీతం ఒకటేంటి, ఆ ఆకుపచ్చని కొండ ప్రాంతాలు అవన్నీ సినిమాకి ఎంతో ఉపకరించాయి అనే చెప్పాలి.

vidudalafilmreview6.jpg

చివరగా ఈ 'విడుదల' లాంటి సినిమాలు ఎప్పుడో గాని రావు. ఇంతకు ముందు ఎక్కడో ఫిలిం ఫెస్టివల్స్ లో వేస్తె చూసేవాళ్ళు. ఇప్పుడు ఏ భాషలో ఒక మంచి సినిమా వచ్చినా, అవి మిగతా భాషల్లోకి తర్జుమా చేసి విడుదల చేస్తున్నారు. అంటే మన దగ్గరికే ఇలా మంచి సినిమాలు వస్తున్నాయి, ప్రేక్షకులకి ఇది ఒక మంచి అవకాశం. ఎప్పుడూ మాస్ సినిమాలు, యాక్షన్ సినిమాలు, లేదా రొమాంటిక్ కామెడీ అంటూ ఇలా వివిధ జానర్ సినిమాలు చూస్తూ వుండే ప్రేక్షకులు, కొంచెం కొత్తదనం, సహజసిద్ధమైన సినిమాలు కావాలనుకుంటే మాత్రం వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ 'విడుదల' పార్ట్ 1 సినిమా తప్పకుండా చూడాలి. ఇలాటివి ప్రోత్సహిస్తేనే ఇంకా ఇలాంటివి తీయడానికి మరికొంతమంది దర్శకులు ముందుకు వస్తారు.

Updated Date - 2023-04-14T18:30:50+05:30 IST