Salaar movie review: ఇది కేవలం ప్రభాస్ అభిమానులకి మాత్రమే!

ABN , Publish Date - Dec 22 , 2023 | 06:47 AM

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన 'సలార్' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మీద భారీ అంచనాలు వున్నాయి, మరి ఆ అంచనాలని ఈ సినిమా అందుకుండా, చదవండి.

Salaar movie review: ఇది కేవలం ప్రభాస్ అభిమానులకి మాత్రమే!
Salaar movie review

సినిమా: సలార్

నటీనటులు: ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్, శృతి హాసన్, శ్రీయా రెడ్డి, ఈశ్వరి రావు, ఝాన్సీ, జగపతిబాబు, బ్రహ్మాజీ, బాబీ సింహ, సప్తగిరి తదితరులు

ఛాయాగ్రహణం: భువన్ గౌడ (Bhuvan Gowda)

సంగీతం: రవి బస్రూర్ (Ravi Basrur)

నిర్మాత: విజయ్ కిరగండూర్

రచన, దర్శకత్వం: ప్రశాంత్ నీల్ (Prashanth Neel)

విడుదల: డిసెంబర్ 22, 2023

రేటింగ్: 2.5 (రెండు పాయింట్ ఐదు)

-- సురేష్ కవిరాయని

'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ (Prabhas) స్టామినా పెరిగింది ప్రపంచం అంతా అతని పేరు మారుమోగింది, అలాగే 'కెజిఎఫ్' #KGF సినిమా తరువాత ప్రశాంత్ నీల్ దేశంలోనే అగ్ర దర్శకుల్లో ఒకరుగా నిలిచారు. ఈ ఇద్దరు కలిసి 'సలార్' #Salaar అనే సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'సలార్: సీజ్ ఫైర్' #Salaar:Ceasefire Part 1 అనేది మొదటి పార్టు అని, దీనికి రెండో పార్టు కూడా ఉంటుంది అని ముందుగానే ప్రకటించారు. ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందించగా, భువన్ గౌడ ఛాయాగ్రహణం అందించారు. మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు శృతి హాసన్, శ్రీయా రెడ్డి, ఈశ్వరి రావు, జగపతి బాబు, బాబీ సింహ, బ్రహ్మాజీ, సప్తగిరి, ఝాన్సీ ఇందులో ఇతర తారాగణం. ఈ సినిమా మీద చాలా పెద్ద అంచనాలు వున్నాయి, మరి సినిమా ఎలా వుందో చూద్దాం. (Salaar movie review)

salaar.jpeg

Salaar story కథ:

దేవా (ప్రభాస్) తన తల్లితో (ఈశ్వరి రావు) ఎక్కడో మారుమూల ప్రాంతంలో చాలా మామూలుగా జీవిస్తూ వుంటారు. కృష్ణ కాంత్ కుమార్తె ఆధ్య (శృతి హాసన్) విదేశాల నుండి ఇండియాలో అడుగుపెడుతోంది అని తెలిసి, ఆమెని కిడ్నాప్ చెయ్యడానికి పలు రకాల వ్యక్తులు ప్రయత్నాలు చేస్తూ వుంటారు. అయితే ఆధ్య తండ్రి ఆమెని కాపాడగల వ్యక్తి దేవా తల్లి మాత్రమే అని చెప్పి దేవా ఉంటున్న వూరికి తీసుకు వెళతారు. అక్కడ దేవా తల్లి నడుపుతున్న స్కూలు పిల్లలకు ఇంగ్లీష్ పాఠాలు చెపుతుందని ఆమెకి నచ్చచెప్పి అక్కడ ఉంచుతారు. అయితే ప్రత్యర్థులకు ఆధ్య అక్కడ వుంది అని తెలిసి ఎలా అయినా ఆమెని కిడ్నాప్ చెయ్యాలని కొంతమంది రౌడీలను పంపించి ఆమెని లాక్కుపోతూ వుంటారు. ఎవరితో మాట్లాడకుండా తన పని తాను చేసుకుపోతూ వున్న దేవా కూడా ఆమెని లాక్కుపోతుంటే చూస్తూ ఊరుకుంటాడు. కానీ తల్లి ఆమెని రక్షించమని చెప్పినప్పుడు మాత్రం తన ప్రతాపం చూపించి ఆధ్యాని రక్షిస్తాడు. ఇదిలా ఉండగా ఖాన్సార్ ( Khansaar) అనే పట్టణంలో అధికార కుర్చీ కోసం అక్కడ నివసిస్తూ ఉంటే పలు రకాలైన జాతులు ప్రయత్నాలు చేస్తూ వుంటారు. ఆ పట్టణాన్ని రాజ మన్నార్ (జగపతిబాబు) పాలిస్తూ ఉంటాడు, కానీ అతని దగ్గర ఉండే దొరలు, ఇతరులు ఆ కుర్చీ కోసం యుద్ధం మొదలెడతారు. కానీ రాజ మన్నార్ తన కుమారుడు వరద (పృథ్వీరాజ్ సుకుమారన్) ని ఆ కుర్చీ మీద ఉంచాలని ప్రయత్నం చేస్తాడు. (Salaar movie review) ఈలోపు మిగతా గ్యాంగ్స్ అందరూ తమ బలాన్ని పెంచుకోవడానికి వివిధ దేశాల నుండి ఆర్మీని తెచ్చుకుంటే వరద మాత్రం తన చిన్ననాటి స్నేహితుడు అయినా దేవా సాయం కోరతాడు. దేవా తన స్నేహితుడు కోసం మళ్ళీ ఖాన్సార్ లో అడుగుపెడతారు. అందరూ ఆర్మీలను తెచ్చుకుంటే వరద మాత్రం తన స్నేహితుడు ఒక్కడినే తెచ్చుకుంటాడు. ఖాన్సార్ లో అడుగుపెట్టిన దేవా ఏమి చేసాడు, వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఎటువంటింది, చివరికి కుర్చీ ఎవరికీ దక్కింది, అసలు దేవా ఎవరు? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. (Salaar Review)

salaar.jpg

విశ్లేషణ:

దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ 'గేమ్ అఫ్ థ్రోన్స్' స్పూర్తితో ఈ సినిమా కథ రాసుకున్నట్టుగా వుంది. ఖాన్సార్ అనే పట్టణాన్ని దేశ సరిహద్దులో ఒకటి సృష్టించి, అక్కడ వివిధ తెగల ప్రజలు నివసిస్తూ ఉంటే, అందులో ఒక వర్గానికి చెందిన నాయకుడు ఒకరు ఆ కుర్చీ అధిష్టించి పరిపాలన సాగిస్తూ ఉంటాడు. అతని కింద దొరలు, ఇతర నాయకులూ ఉంటూ వుంటారు. వారందరూ ఆ కుర్చీ కోసం ఎత్తులు పైఎత్తులు, రాజకీయ కుట్రలు, కుతంత్రాలు చేస్తూ వుంటారు. ఇది ఈ సినిమా నేపధ్యం. ఎవరు బలమైనవారో వాళ్ళకే ఆ కుర్చీ దక్కుతుంది అని ఎవరికీ వారు ప్రయత్నాలు చేస్తూ వుంటారు. రాజ మన్నార్ అల్లుడు, కుమార్తె, కుమారుడు, మిగతా నాయకులూ అందరూ ఇందులో వుంటారు. ఇదిలా ఉంటే ఇద్దరు స్నేహితులు దేవా, వరదల మధ్య స్నేహ బంధం, చిన్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవటం, అందులో వరద రాజమన్నార్ ఎప్పుడు కావాలంటే అప్పుడు సహాయానికి వస్తాను అంటాడు దేవా.

ఈ కథ నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ యాక్షన్ ప్రధానంగా ఈ సినిమాని నిర్మించాడు. ఇందులో పోరాట సన్నివేశాలు చాలా అత్యున్నత సాంకేతికతని వుపయోగించి చేశారు అనిపిస్తుంది. అందుకనే ఆ పోరాట సన్నివేశాలు, కథానాయకుడు అయిన ప్రభాస్ ఎలివేషన్ సన్నివేశాలు అన్నీ బాగా తీసాడు ప్రశాంత్ నీల్. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ని కేవలం యాక్షన్ కి పనికొచ్చే ఒక స్టార్ గా మాత్రమే చూపించాడు దర్శకుడు, మొత్తం సినిమా అంతా ఒక పది మాటలు వుంటాయేమో ప్రభాస్ కి. అలాగే కథ కూడా నేరేట్ చేస్తూ వుంటారు ఒకరు. ఇక రెండో సగంలో కుర్చీ కోసం వివిధ తెగలకు చెందిన నాయకులు కుతంత్రాలు పన్నడం, ఎక్కడి నుండో వందలకొద్దీ ఆర్మీని తీసుకురావటం ఇవన్నీ మరీ సినిమాటిక్ గా వున్నాయి. అలాగే అందులో చాలా లాజిక్స్ కూడా మిస్ అయినట్టుగా కనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ నేరేట్ చేసేటప్పుడు చాలా తొందరగా ఆ సన్నివేశాలు వెళ్లిపోవటంతో ప్రేక్షకుడికి ఆలా అయిపోయే సన్నివేశాలు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. చాలామంది ఆ కుర్చీ కోసం కుతంత్రాలు పన్నుతారు, అందులో ఎవరు ఎవరికీ బంధువు, ఎవరెవరు ఏంటి అనేది చిన్న గందరగోళం ఉంటుంది. ప్రశాంత్ నీల్ ఈ కథ 'గేమ్ అఫ్ థ్రోన్స్' ఎలా ఉంటుందో అలానే అల్లారు, అయితే అది వెబ్ సిరీస్ ఎన్నో ఎపిసోడ్స్ లో కథ చెప్తారు, కానీ ప్రశాంత్ మూడు గంటల్లో మొత్తం చెప్పేయాలి అనుకుంటాడు. అందుకే చాలా సందేహాలు ఉంటాయి. మరి అవన్నీ రెండో పార్టులో విడమర్చి చెప్తాడేమో చూడాలి. ఈ సినిమాకి నేపధ్య సంగీతం చాలా ముఖ్యం, కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ ఎలివేషన్ సన్నివేశాలప్పుడు నేపధ్య సంగీతం బాగుంది. ఇక ఛాయాగ్రహణం కూడా బాగుంది. గ్రాఫిక్స్ ఈ సినిమాలో బాగా వాడారు, ఖాన్సార్ పట్టణం బాగా చూపించారు. 'కెజిఎఫ్' సినిమాలో ఉన్నట్టుగానే ఈ సినిమాలో కూడా వెనకాల అంతా బొగ్గు గనులు లాంటివి కనపడుతూ ఉంటాయి.

Salaar.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే ప్రభాస్ (Prabhas) ఆరడగుల పైన వుంటారు అందుకని అతన్ని బాగా ఎలివేట్ చేసాడు దర్శకుడు. ప్రభాస్ కూడా సినిమాలో సీరియస్ గా వుంటారు, దానికి బాగా సూట్ అయ్యారు. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) విరామం ముందు వస్తాడు, అతను కూడా బాగా చేసాడు. అతనికి, ప్రభాస్ కి మధ్య వున్న సన్నివేశాలు ఆకర్షణీయంగా ఉంటాయి. శృతి హాసన్ పాత్ర చాలా కీలకం, ఆమెకి వచ్చే సందేహాలను చెప్పటం ద్వారానే కథ చెప్పించబడుతుంది. ఇక జగపతి బాబు కూడా రెండో సగంలో వస్తాడు, అతనికి రెగ్యులర్ పాత్ర. బాబీ సింహ, శ్రీయా రెడ్డి తమ పాత్రల పరిధి మేరకి చేశారు. ఈశ్వరి రావు ప్రభాస్ తల్లిగా ఒక ముఖ్య పాత్ర పోషించారు, ఆమె బాగా చేసారు. ఆమెకి ఈ సినిమాలో ఒక మంచి పాత్ర దొరికింది అనే చెప్పాలి. ఝాన్సీ ఇంకో ముఖ్య పాత్రలో కనపడతారు. బ్రహ్మాజీ రెండో సగంలో వస్తారు, అతనికి ఇది ఒక వైవిధ్యమైన పాత్ర అవుతుంది. చాలామంది నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చేశారు.

చివరగా, ఈ సినిమా కేవలం ప్రభాస్ అభిమానులను అలరిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇందులో ప్రభాస్ ని ఎలివేట్ చేసే సన్నివేశాలు చాలా వున్నాయి. కథానాయకుడు అనగానే తెలుగు సినిమాలో మొదటి నుండి చివరి వరకు వుంటారు, ఆలా చూస్తే ఇందులో ప్రభాస్ కనిపించేది తక్కువే అని చెప్పాలి. మొదటి 20 నిమిషాల వరకు కనిపించడు, అలాగే రెండో సగంలో కూడా, అదీ కాకుండా ప్రభాస్ కి డైలాగ్స్ ఎక్కువ లేవు. కేవలం పోరాట సన్నివేశాల్లో బాగా చూపించారు. అందుకని అతను అభిమానులకి నచ్చుతుంది.

Updated Date - Dec 22 , 2023 | 06:47 AM