Spy Film Review: ఈ పాన్ ఇండియా మిషన్ ఫెయిల్ అయింది !

ABN , First Publish Date - 2023-06-29T13:47:56+05:30 IST

నిఖిల్ సిద్ధార్థ నటించిన 'స్పై' సినిమా ఈరోజు పాన్ ఇండియా సినిమా గా విడుదల అయింది. చాలా సినిమాలకు ఎడిటర్ గా చేసిన గ్యారీ ఈ సినిమాతో దర్శకుడిగా ఆరంగేట్రం చేసాడు. సినిమా విడుదలకి ముందు స్వాతంత్ర సమారా యోధుడు సుభాష్ చంద్రబోస్ గురించే ఎక్కువ మాట్లాడేరు. మరి సినిమా ఎలా వుందో చదవండి.

Spy Film Review: ఈ పాన్ ఇండియా మిషన్ ఫెయిల్ అయింది !
Spy Film Review

సినిమా: స్పై

నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ, ఐశ్వర్య మీనన్, సాన్యా ఠాకూర్, అభినవ్ గోమాటం, రానా దగ్గుబాటి, మకరంద్ దేశపాండే, జిషు సేన్ గుప్త, నితిన్ మెహతా తదితరులు

ఛాయాగ్రహణం: వంశి పచ్చిపులుసు, మార్క్ డేవిడ్, జూలియన్ ఎస్ట్రాడా

సంగీతం: విశాల్ చంద్రశేఖర్, శ్రీచరణ్ పాకల

కథ: కె రాజశేఖర్ రెడ్డి

దర్శకత్వం: గ్యారీ బీహెచ్ (Garry Bh)

నిర్మాత: కె రాజశేఖర్ రెడ్డి

-- సురేష్ కవిరాయని

నిఖిల్ సిద్ధార్థ (NikhilSiddhartha) 'కార్తికేయ 2' #Karthikeya2 ఒక్క తెలుగులోనే కాకుండా, మిగతా భాషల్లో కూడా బాగా ఆడింది. నిఖిల్ కి మంచి పేరే వచ్చింది. బహుశా ఆ వుద్దేశంతో ఏమో 'స్పై' #SpyFilmReview సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా విడుదల చెయ్యాలని, ఒక్క తెలుగులోనే కాకుండా, ముంబై, ఢిల్లీ లాంటి పట్టణాలకు కూడా వెళ్లి ఈ సినిమా ప్రచారాలను చేసాడు. మన తెలుగు పరిశ్రమలో ఈ పాన్ ఇండియా పదం మన ఫిలిం మేకర్స్ కి బాగా నాటుకుపోయింది ఎందుకో. ఆ మోజులో పడే ఏమో పరభాషల నుండి నటులను తెచ్చుకొని తెలుగు సినిమాల్లో చొప్పిస్తున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఏ నటులను అయితే ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారో, ఆ నటులను వారి స్వంత భాషల్లో చేస్తున్న సినిమాల్లో నటించినా కూడా ఎవరూ పట్టించుకోవటం లేదు. ఇప్పుడు ఈ 'స్పై' #SpyFilmReview సినిమాకి వద్దాం, ఈ సినిమా విడుదలకి ముందు స్వతంత్ర సమర యోధుడు, ఆజాద్ హింద్ స్థాపించినవాడు అయిన సుభాష్ చంద్రబోస్ మీదే ఎక్కువ ప్రచారం చేశారు. బహుశా హిందీ ప్రేక్షకులను ఆకర్షించడానికి ఇది పెట్టారేమో అనిపిస్తుంది. గ్యారీ బిహెచ్ (Garry Bh) దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అయ్యాడు, అలాగే ఇందులో ఐశ్వర్య మీనన్ (IswaryaMenon), సాన్యా ఠాకూర్ (Sanya Thakur) ఇద్దరు కథానాయకులు. ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.

Spy-Movie.jpg

Spy story కథ:

ఈ సినిమా మొదలవడం రా (RAW) ఏజెంట్ సుభాష్ (ఆర్యన్ రాజేష్), ఖాదిర్ ఖాన్ (నితిన్ మెహతా) అనే టెర్రరిస్ట్ ని పట్టుకోవడానికి వెళతాడు, ఖాదిర్ ఖాన్ ని చంపేస్తాడు, వెంటనే సుభాష్ ని కూడా ఎవరో చంపేస్తారు. కొన్ని సంవత్సరాల తరువాత మళ్ళీ ఖాదిర్ ఖాన్ చనిపోలేదు, బతికున్నాడు అని రా (RAW) చీఫ్ శాస్త్రి (మకరంద్ దేశపాండే) కి తెలుస్తుంది. వెంటనే తన ఏజెంట్స్ అందరినీ రంగంలోకి దింపుతాడు. అందులో హైదరాబాద్ నుండి జై (నిఖిల్ సిద్ధార్థ) కూడా వున్నారు. చనిపోయిన రా ఏజెంట్ సుభాష్, జై కి స్వంత అన్నయ్య. ఈ మిషన్ లో భాగంగా తన అన్నయ్యను ఎవరు చంపారో కూడా తెలుసుకోవాలని జై ప్రయత్నిస్తూ ఉంటాడు. జై తన మిత్రుడు ఇంకో రా ఏజెంట్ అయిన కమల్ (అభినవ్ గోమఠం) తో కలిసి శ్రీలంకలో ఒక మిషన్ లో వుంటారు. కానీ ఖాదిర్ ఖాన్ ని పట్టుకోవటం ప్రాధాన్యత కాబట్టి, ఈ ఇద్దరూ ఢిల్లీ వస్తారు. వీళ్ళకి తోడుగా ఇంకో ఇద్దరు ఏజెంట్స్ సరస్వతి (సాన్యా ఠాకూర్), వైష్ణవి (ఐశ్వర్య మీనన్) కూడా జత కలుస్తారు. వీళ్ళందరూ ఖాదిర్ ఖాన్ పట్టుకోవడం కోసం వెళతారు. ఈలోపు రా ఆఫీసులో భగవాన్ జీ (సుభాష్ చంద్రబోస్) ఫైల్ మిస్ అవుతుంది. రా ఏజెంట్స్ మిషన్ కి, ఆ ఫైల్ కి ఏంటి సంబంధం? చనిపోయిన ఖాదిర్ ఖాన్ ఎలా బతికొచ్చాడు? రానా దగ్గుబాటి పాత్ర ఏంటి? ఇవన్నీ చూడాలంటె 'స్పై' సినిమా చూడండి.

nikhilspy.jpg

విశ్లేషణ:

దర్శకుడు గ్యారీ బీహెచ్ (Garry Bh) ఇంతకుముందు చాలా సినిమాలకు ఎడిటింగ్ శాఖలో పనిచేశాడు, అందులో బాగా అనుభవం వుంది. నిఖిల్ సిద్ధార్థ (NikhilSiddhartha) నటించిన ఈ 'స్పై' సినిమాతో దర్శకుడిగా ఆరంగేట్రం చేసాడు. స్పై, గూఢచారి, జేమ్స్ బాండ్ సినిమాలు అనగానే ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా వుంచగలిగేటట్టు కథనం ఉండాలి. కానీ గ్యారీ బీహెచ్ ఇది ఒక స్పై సినిమాలా కాకుండా, మామూలు సినిమాలాగా చుట్టేసినట్టు అనిపిస్తోంది. #SpyFilmReview సినిమా విడుదలకి ముందు ప్రచారాల్లో అందులో రీసెర్చ్ చేసాం, ఇందులో రీసెర్చ్ చేసాం అంటారు, అవన్నీ ప్రచారానికేనా లేకా నిజంగా చేశారా అని ఈ స్పై సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఎందుకంటే నిజంగా రీసెర్చ్ చేస్తే కనక, మరీ అంతలా బోర్ కొట్టే విధంగా సినిమా ఎలా తీస్తారు. కనీసం ఒక్క సన్నివేశం అయినా ఆసక్తికరంగా ఉండాలి కదా.

అదేంటో మన తెలుగు పరిశ్రమలో ప్రతి నటుడు ప్రపంచానికి, లేదా భారతదేశానికి వచ్చే ప్రమాదాలను ఒక్కడే ఆపెయ్యాలి అనుకుంటాడు, ప్రపంచాన్ని నేనే కాపాడను అని చెప్పేస్తాడు. దానికోసం 'రా', టెర్రరిస్ట్, పాకిస్తాన్, చైనా, నేపాల్, శ్రీలంక, ఇలాంటి పదాలు కాకుండా ఇంకా ఏవేవో పెద్ద పెద్ద పదాలు వాడేస్తూ వుంటారు. అసలు గ్యారీ బీహెచ్ ఏమి చెప్పాలనుకున్నాడు, ఏమి చూపించాలి అనుకున్నాడో అతనికైనా తెలుసా అనిపిస్తుంది ఈ 'స్పై' సినిమా చూసాక. సినిమాకి ఆయువు పట్టు దర్శకుడు, అతని కథని తెర మీద చూపించే విధానం ప్రేక్షకుడికి నచ్చాలి, ఆసక్తికరంగా ఉండాలి. కానీ ఈ సినిమాలో ఆ రెండూ లోపించాయి.

Nikhil-Movie.jpg

'స్పై' అనగానే యాక్షన్ ఉంటుందేమో అని అనుకుంటాం, #SpyFilmReview పోనీ అది కూడా లేదు ఇందులో. జాసన్ బోర్న్ (Jason Bourne) సినిమాలు స్ఫూర్తి మా 'స్పై' సినిమాలో యాక్షన్ సన్నివేశాలకి అని విడుదలకి ముందు చెప్పారు. అసలు ఈ సినిమాలో యాక్షన్ కాదుకదా, మిగతా సన్నివేశాలు కూడా సిల్లీ గానే ఉంటాయి. నాకేమనిపిస్తోంది అంటే ఈ 'పాన్ ఇండియా' (PanIndia) అనే దానిలో మన తెలుగు దర్శకులు, నటులు బాగా పడిపోయారు. అందుకని తెలుగు కథలు, తెలుగు సినిమాలు, తెలుగు సంప్రదాయం, తెలుగు సహజత్వం ఇవన్నీ మరిచిపోయి, హిందీ ప్రేక్షకులు చూస్తున్న #SpyReview ఆ మూస కథలనే మనవాళ్ళు పాన్ ఇండియా అనే పేరు మీద అందరికీ రుద్దుతున్నారు అనిపిస్తోంది.మన తెలుగు సినిమా అక్కడ చూపిస్తే, వాళ్ళకి అది కొత్తగా వుండి అది చూస్తారు, అంతే కానీ అక్కడ కథనే మళ్ళీ వాళ్ళకి చూపిస్తే ఎందుకు చూస్తారు. అదీ కాకుండా తెలుగు వాళ్ళకి కూడా ఆ కథ మరీ బోర్ గా ఉంటోంది. బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఇప్పుడు దక్షిణాది సినిమాలని రీమేక్ చేసుకుంటున్నారు, అలాంటప్పుడు పాన్ ఇండియా పేరిట ఇలాంటి 'స్పై' సినిమాలు తీసి పాడుచేస్తున్నారేమో అనిపిస్తోంది. సుభాష్ చంద్రబోస్ గురించి ఇందులో కొత్తగా ఏమి చెప్పలేదు, కేవలం హిందీ ప్రేక్షకులను ఈ సినిమా వైపు తిప్పుకోవడానికి ఆ పేరును వాడుకున్నారేమో అనిపిస్తుంది.

అలాగే దర్శకుడు గ్యారీ ఇంతకుముందు ఎడిటింగ్ లో అనుభవం వున్నవాడు అని చెప్పాను కదా, మరి తన సినిమాకి వచ్చేసరికి అతనిలో వున్న ఎడిటర్ మాయం అయిపోయాడు ఏమో, అసలు బాగోలేదు. గ్రాఫిక్స్ కూడా అసలు బాగోలేవు. 'రా' అనేది ఒక గూఢచారి సంస్థ, అలాంటి 'రా' ని ఇందులో మరీ నవ్వులపాలు చేసే విధంగా ఈ సినిమాలో చూపించారు. సినిమాలు హనీ ట్రాప్ అని ఒకటి చూపిస్తారు, అదో పెద్ద జోక్. సినిమాలో ఒక ఫిమేల్ రా ఏజెంట్ ఇంకో మేల్ రా ఏజెంట్ ని ట్రాప్ చేస్తే దాన్ని హానీ ట్రాప్ అంటారట. మరీ విడ్డూరంగా వుంది కదూ. ఈ సినిమా చాలా రోజులు తీశారు. అప్పుడప్పుడు ఎదో ఒక సన్నివేశం గుర్తుకు వచ్చి షూటింగ్ చేసారా అనిపిస్తుంది, ఎందుకంటే సినిమాలో సన్నివేశాలు అన్నీ అలాగే ఉంటాయి. ఛాయాగ్రహణం కూడా అంతంత మాత్రమే, గ్రాఫిక్స్ అన్నీ చాలా నాసిరకంగా ఉంటాయి. ఆ క్లైమాక్స్ సన్నివేశం అయితే అదో పెద్ద జోక్.

Nikhil-Siddhartha.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే, నిఖిల్ సిద్ధార్థ #NikhilSiddhartha కి ఇందులో చెప్పుకోదగ్గ ప్రతిభ కనపరిచే పాత్ర అయితే కాదు. ఇంతకు ముందు సినిమాల్లోనే బాగా చేసాడు, ఈ సినిమాతో పోలిస్తే. అయితే ప్రయత్న లోపం లేకుండా తనవంతు కృషి చేసాడు, కానీ అతని పాత్ర సరిగ్గా డిజైన్ చెయ్యలేదు, అదీ కాకుండా కథ, కథనం సరిగ్గా లేకపోతే అతను మాత్రం ఏమి చేస్తాడు. ఇంకా అభినవ్ గోమాటం రా ఏజెంట్ లా కాకుండా ఒక కమెడియన్ లా పెట్టారు. రా ఏజెంట్ అంటే అంత చీప్ గా ఉంటాడా. కమెడియన్ గా చెప్పే డైలాగ్స్ కొన్ని నవ్వు తెప్పిస్తాయి. సాన్యా ఠాకూర్, ఐశ్వర్య మీనన్ ల పాత్రలు అంత చెప్పుకోదగ్గవి కావు. జిషు, సచిన్ కెడెకర్, మకరంద్ దేశపాండే, నితిన్ మెహతా వీళ్ళందరూ తెర మీద ఆలా నిలుచుంటే వెనకాల తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్ పెద్దగా వీళ్ళ డైలాగ్స్ చెపుతూ ఉంటాడు. ఈ సినిమాలోనే కాదు, ప్రతి తెలుగు సినిమాలో ఈ తెలుగు భాష రాని నటులకు ఎందుకు అంత పెద్ద గొంతుతో, హై పిచ్ తో డబ్బింగ్ చెప్తారో ఈరోజుకి నాకర్థం కాదు. మళ్ళీ సినిమాలో రా చీఫ్ శాస్త్రి తెలుగువాడే కానీ అతని తెలుగు డబ్బింగ్ ఎలా ఉంటుంది అంటే, తెలుగు డైలాగ్స్ స్లో మోషన్ లో చెపితే ఎలా ఉంటుందో, ఆలా ఉంటాయి. ఒక్క మొహంలో కూడా ఒక ఎమోషన్ ఉండదు, అభినయం ఉండదు, ఎదో కెమెరా ముందు అలా నిలుచున్నట్టుగా వుంటారు. అది వాళ్ళ తప్పు కాదు, దర్శకుడిదే తప్పు. తెలుగు నటులు అయిన తనికెళ్ళ భరణి (ThanikellaBharani), పోసాని (PosaniKrishnaMurali) లాంటి వాళ్ళు ఒకటి రెండు సన్నివేశాల్లో కనపడతారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం గురించి మాట్లాడనవసరం లేదు, కానీ శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం కొంచెం బాగుంది.

చివరగా, 'స్పై' సినిమా అనగానే ప్రేక్షకుడు ఏవేవో ఊహించుకొని వెళితే మాత్రం చాలా నిరాశ పడతాడు. 'ఆదిపురుష్' #Adipurush సినిమాకి జై శ్రీరామ్ (JaiSriram) పేరు ఎలా వాడుకున్నారా, ఈ 'స్పై' #SpyFilmReview సినిమాకి కూడా సుభాష్ చంద్రబోస్ (SubhashChandraBose) పేరు వాడేసుకున్నారు అని అనిపిస్తుంది. నిఖిల్ ఇంకో ఇద్దరు ముగ్గురు తెలుగు నటులు వున్నారు ఈ తెలుగు సినిమాలో, పాన్ ఇండియా సినిమా కదా అందరూ హిందీ నటులే ఎక్కువ సుమండీ! గూఢచారి సినిమా చూస్తున్నట్టు ఏ కోశానా అనిపించదు, కనిపించదు. ఈ సినిమాకి పనిచేసిన దర్శకుడు దగ్గర నుంచి మిగతా సాంకేతిక నిపుణలకి కూడా ఈ సినిమా మీద అంత ఆసక్తి లేదేమో అన్నట్టుగా ఈ సినిమా కథనం ఉంటుంది. అంటే అంత ఆసక్తికరంగా తీయలేదు అని. నిఖిల్ సిద్ధార్థ ఈ సినిమా మీద చాలా అసలు పెట్టుకున్నట్టున్నాడు, కానీ పాపం అతని 'పాన్ ఇండియా' మిషన్ పూర్తిగా ఫెయిల్ అయిపొయింది. నిరాశే మిగిలింది.

Updated Date - 2023-06-29T13:47:56+05:30 IST