Hi Nanna movie review: ఇది ఏ హాలీవుడ్ మూవీకి కాపీ అంటే...

ABN , First Publish Date - 2023-12-07T08:51:14+05:30 IST

నాని పాన్ ఇండియన్ లెవెల్లో ప్రచారం చేసిన 'హాయ్ నాన్న' సినిమా ఈరోజు విడుదలైంది. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయిక కాగా, శౌర్యవ్ దర్శకుడు. ఇది అతనికి మొదటి సినిమా. ఈ సినిమా ఎలావుందో చదవండి.

Hi Nanna movie review: ఇది ఏ హాలీవుడ్ మూవీకి కాపీ అంటే...
Hi Nanna movie review

సినిమా: హాయ్ నాన్న

నటీనటులు: నాని, మృణాల్ ఠాకూర్, కియారా కన్నా, శృతి హాసన్, ప్రియదర్శి పులికొండ, అంగద్ బేడీ, జయరాం తదితరులు

ఛాయాగ్రహణం: సాను జాన్ వర్గీస్

సంగీతం: హేశం అబ్దుల్ వహబ్

నిర్మాతలు: మోహన్ చెరుకూరి, తీగల విజేందర్ రెడ్డి, మూర్తి కెఎస్

దర్శకత్వం: శౌర్యవ్

విడుదల: డిసెంబర్ 7, 2023

రేటింగ్: 2 (రెండు)

-- సురేష్ కవిరాయని

నాని (Nani), మృణాల్ ఠాకూర్ (MrunalThakur) జంటగా నటించిన 'హాయ్ నాన్న' #HiNanna సినిమా ఈరోజు విడుదలైంది. ఇంతకు ముందు నాని సినిమాల చాలా విడుదలయ్యాయి కానీ 2017 డిసెంబర్ లో విడుదలైన 'మిడిల్ క్లాస్ అబ్బాయి' అంత విజయం మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర రాలేదు. ఈ సినిమా కన్నా ముందు 'దసరా' పాన్ ఇండియా సినిమాకు విడుదలైంది, కానీ అది మిగతా భాషల్లో అసలు నడవలేదు. ఇప్పుడు ఈ 'హాయ్ నాన్న' కూడా పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతోంది, ఈ సినిమాకి కూడా నాని విస్తృత ప్రచారం అన్ని భాషల్లో చేశారు. ఈ సినిమా అతనికి మంచి బ్రేక్ ఇస్తుందని చాలా గట్టి నమ్మకం పెట్టుకుని వున్నారు నాని. #HINannaReview ఈ సినిమాలో నాన్న సెంటిమెంట్ ఉందని, అందుకే పేరు కూడా 'హాయ్ నాన్న' అని పెట్టారని అన్నారు. ఒక చిన్నపాప కియారా కన్నా నాని కుమార్తెగా నటించింది. ఈ తెలుగు సినిమాలో నటించడానికి ఆ చిన్ని పాపని కూడా పర భాష నుండి తెచ్చుకున్నారు. జయరాం, అంగద్ బేడీ, లాంటి ఎక్కువ పర భాషా నటులు నటించిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. (Hi Nanna movie review)

hinanna1.jpg

Hi Nanna story కథ:

కథ ముంబైలో జరుగుతుంది, విరాజ్ (నాని) ముంబైలో ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. అతనికి ఆరు సంవత్సరాల కుమార్తె మహి (బేబీ కియారా ఖన్నా), ఆమెకి ఊపిరితిత్తులకు సంబంధించి చిన్న వ్యాధి ఉంటుంది, అందుకని రాత్రిపూట పడుకునేటప్పుడు ఆక్సిజన్ పైప్ పెట్టుకొని పడుకుంటుంది. ఆ పాప అమ్మ కథ చెప్పమని తండ్రిని అడుగుతుంది, క్లాస్ ఫస్ట్ వస్తే చెబుతానని ప్రామిస్ చేస్తాడు విరాజ్. మహి క్లాసు ఫస్ట్ వస్తుంది, ఆరోజు విరాజ్ పని ఒత్తిడిలో వుండి అమ్మ కథ చెప్పకుండా పాప మీద విసుక్కుంటాడు. తండ్రి మీద కోపంతో చెప్పా పెట్టకుండా బయటకు వెళుతుంది పాప, రోడ్ మీద పాపని ప్రమాదం నుండి యష్ణ (మృణాల్ ఠాకూర్) అనే ఆమె కాపాడుతుంది. పాప, యష్ణ స్నేహితులు అయిపోతారు, కూతురు ఎక్కడికి వెళ్లిపోయిందో అనుకుంటున్న విరాజ్ కి యష్ణ ఫోన్ చేసి పాప క్షేమం, గాబరా పడొద్దు మీరు ఇక్కడికి రండి అని లొకేషన్ షేర్ చేస్తుంది. ఒక కాఫీ షాపులో ఇద్దరూ ఉంటే అక్కడికి విరాజ్ వెళతాడు. అప్పుడు అమ్మ కథ చెప్పాలని మహి పట్టుబట్టడంతో తన భార్య గురించి చెప్పడం మొదలు పెడతాడు విరాజ్. మహి తన అమ్మగా పక్కనే వున్న యష్ణని వూహించుకుంటుంది, యష్ణ కూడా తనే వర్ష అని ఊహించుకొని ఇద్దరూ కథ వింటారు. ఫోటోగ్రాఫర్ అవుదామని ఎదుగుతున్న రోజుల్లో ఓ వర్షం కురిసిన రోజు సంపన్నరాలు అయిన వర్ష (మృణాల్ ఠాకూర్) పరిచయం, ప్రేమలో పడటం, ఆమె తల్లి ఇద్దరికీ సెట్ కాదు పెళ్లి వద్దు అని చెబుతున్నా వినకుండా విరాజ్ ని వర్ష పెళ్లి చేసుకుంటుంది, తరువాత పాప పుడుతుంది. కథంతా ఇంతవరకు బాగుంది కదా, మరి ఎందుకు వర్ష, విరాజ్ లు విడిపోయారు, ఏమైంది? వర్ష ఏమైంది, యష్ణ నేపధ్యం ఏంటి? ఆమెకి ఒక డాక్టర్ (అంగద్ బేడీ) తో వివాహం నిశ్చయం అవుతుంది, కానీ ఆమె విరాజ్ తో ప్రేమలో పడుతుంది, మరి ఆ పెళ్లి జరుగుతుందా జరగదా? ఇవన్నీ తెలియాలంటే 'హాయ్ నాన్న' సినిమా చూడండి.

HiNanna.jpg

విశ్లేషణ:

ఈ 'హాయ్ నాన్న' సినిమాకి సాంఘీక మాధ్యమంలో చాలా విశేషంగా ప్రచారం చేశారు. ఎందుకంటే దర్శకుడు శౌర్యవ్ సోదరుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అవటంతో అంత ప్రచారం వచ్చిందని తెలిసింది. ఇది శౌర్యవ్ కి మొదటి సినిమా. ఈ సినిమా గురించి చర్చించే ముందు తెలుగు దర్శకులు చాలామంది ఎక్కడో వూరు నుండి వచ్చి పరిశ్రమలో ఆరంగేట్రం చేస్తూ వుంటారు. అది బాగుంది, తెలుగు దర్శకుడు ఎక్కడో వూరు నుండి వచ్చినప్పుడు, తెలుగు నటులకి ఎందుకు అవకాశం ఇవ్వటం లేదో అర్థం కావటం లేదు. దర్శకుడు ఎలా పరిచయం అయ్యాడో, తెలుగు నటుల్ని కూడా పరిచయం చేస్తే తెలుగు సినిమా బాగుంటుంది కదా. ఈ పాన్ ఇండియా మోజులో పడిపోయి ఒక్కో భాష నుండి ఒక్కో నటుడిని తీసుకువచ్చి సినిమాలో పెట్టేస్తే ఆ సినిమా ఆడుతుంది అనుకుంటే అది కేవలం భ్రమ. సినిమాలో మంచి కథ ఉండాలి, అలాగే మన కథలు తీసి వేరే భాషల వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి కొత్తగా వుండి అది నచ్చుతుంది. అంతేకానీ అక్కడి కథలే రాసి, అక్కడి నటులనే పెట్టుకొని, కథానాయకుడు ఒక్కడే తెలుగు నటుడు అయితే, వాళ్ళకి ఏమి నచ్చుతుంది.

definitelymaybe.jpg

ఎందుకు ఈ ఉపోద్ఘాతం అంటే నేను మొదటి నుండి తెలుగు నటులకి ప్రోత్సాహం ఇవ్వాలి, తెలుగు కథలు ప్రపంచం అంతా చూపించాలి అని చెపుతూ వుంటాను. రాజమౌళి, సుకుమార్, మణిరత్నం, త్రివిక్రమ్ లాంటి అగ్ర దర్శకులు అదే కథా చేస్తున్నది. మన కథలు అక్కడ చూపిస్తున్నారు, విజయం సాధిస్తున్నారు. ఆలా చెయ్యకుండా, కొరియన్, ఇంగ్లీష్, లేదా ఇంకో భాషలో వచ్చిన సినిమాలని కాపీ చేసి చూపిస్తే అది తెలుగు సినిమా ఎలా అవుతుంది. ఇప్పుడు ఈ 'హాయ్ నాన్న' దర్శకుడు శౌర్యవ్ కూడా అదే ఇంగ్లీష్ కథని కాపీ కొట్టేసాడు. హాలీవుడ్ సినిమా 'డెఫినిట్లీ మే బి' (Definitely, May Be) అనే సినిమాని అనుకరించేసాడు. కనీసం పోస్టర్ కూడా మార్చలేదు, ఆ సినిమాలో పోస్టర్ లానే దించేసాడు. మళ్ళీ ఇది డైరెక్ట్ తెలుగు కథ అని విడుదలకి ముందు ప్రచారాల్లో చెప్పుకోవటం ఒకటి. ఇప్పుడు వస్తున్న యువ దర్శకులు కూడా వేరే భాష సినిమాలని ఇలా కాపీ కొట్టి తెలుగు సినిమా చెయ్యడం విచారకరం. సమాజంలో మన చుట్టూ ఎన్నో కథలు ఉంటాయి, అందులో ఎన్నో స్ఫూర్తిదాయకమైన కథలు ఉంటాయి, వాటిని కథలుగా మలుచుకోవచ్చు కదా. పాత తరం, ఆ తరువాత వచ్చిన దర్శకులు దాసరి, రాఘవేంద్ర రావు, కోడి రామకృష్ణ ఇంకా ఎంతోమంది సమాజం నుండి ప్రేరణ, స్ఫూర్తి పొంది ఎక్కువ సినిమాలు చేశారు. కాపీ చెయ్యడం తప్పు కాదు, పూర్వం కూడా చేసేవారు, కానీ అందులో తెలుగుదనం ఉండేట్టు చేసేవారు.

ఇక ఈ 'హాయ్ నాన్న' సినిమాకొస్తే ఇది ఒక టీవీ సీరియల్ లా సాగుతూ ఉంటుంది. మధ్యలో చాలా సన్నివేశాలు సాగదీతలా ఉంటాయి, అలాగే మరీ సినిమాటిక్ సన్నివేశాలు పెట్టేసారు. పాపకి ఒకరకమైన వ్యాధి ఉంటుంది, అందుకని రాత్రి పడుకునేటప్పుడు ఆక్సిజన్ పైపులతో చూపిస్తారు, కానీ తరువాత సన్నివేశాల్లో, అవేమీ వుండవు, పరిగెడుతుంది, నడుస్తుంది, ఆమె ఏదైనా చేస్తుంది, అప్పుడు ఆమెకి వ్యాధి లేదా? అలాగే చివర్లో కూడా పెద్ద పెద్ద ఆసుపత్రులకు సంబంధించిన డాక్టర్లు రావటం, ఆపరేషన్ చెయ్యడం మరీ సినిమాటిక్ లా వుంది. దానికి తోడు ప్రేక్షకుడు ఒక తెలుగు సినిమా చూస్తున్నట్టు అనుభూతి పొందడు, ఎదో హిందీ సినిమా, లేదా ఇంకో భాష సినిమా తెలుగులోకి అనువాదం చేశారేమో అనిపిస్తూ ఉంటుంది. నానికి, మృణాల్ ఠాకూర్ మధ్య వచ్చే సన్నివేశాలు అసలు పండలేదు, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ నప్పలేదు. పాప చాలా క్యూట్ వుంది కానీ డైలాగులు చెప్పేటప్పుడు ఆమె ఫేస్ చూపించకుండా దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు, ఎందుకంటే ఆమె తెలుగు కాదు, డబ్బింగ్ చెప్పారు కదా. విరామం ముందు సినిమాలో సస్పెన్స్ వీడిపోతుంది, అందుకని రెండో సగం ఎలా ఉంటుంది, ఏమేమి సన్నివేశాలు ఉంటాయి అన్నది ప్రేక్షకుడుకి చాలా సులువుగా అర్థం అయిపోతూ ఉంటుంది. నాని కొన్ని సన్నివేశాల్లో ముఖ్యంగా ఏడుపు సన్నివేశాల్లో అంతగా చెయ్యలేకపోయాడు అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలలో భావోద్వేగాలు, బలమైన సంఘర్షణలు చాలా ముఖ్యం. దర్శకుడు శౌర్యవ అవన్నీ ప్రేక్షకులకి చూపించడంలో విఫలం అయ్యాడు అనే చెప్పాలి. సినిమా మొదటి సగం సాగదీస్తే, రెండో సగంలో ఆ సాగదీత ఇంకా ఎక్కువైంది. ఛాయాగ్రహణం బాగుంది, సంగీతం పరవాలేదు.

ఇక నటీనటుల విషయానికి వస్తే నాని లుక్స్ ఇందులో ఇంతకు ముందు సినిమాల్లోకన్నా కొంచెం బాగున్నాడు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో చాలా బాగా చేసాడు, కానీ కొన్ని మరీ సినిమాటిక్ గా రొటీన్ గా అయిపోయాయి. మృణాల్ ఠాకూర్ బాగుంది, కానీ ఆమెకి నాని మధ్య ఆ భావోద్వేగం లేదు, సంఘర్షణ లేదు. పాపగా చేసిన కియారా ఖన్నా ముద్దుగా వుంది, బాగుంది. మలయాళం నటుడు జయరాంకి ఇది ఇంకో తెలుగు సినిమా, అంతే. అలాగే ఇంకో హిందీ నటుడు అంగద్ బేడీ, తెలుగుకి పరిచయం అయ్యాడు, ఇంతకు ముందు నటుల్లాగే ఇతను కూడా మొహం మీద ఎటువంటి భావాలు లేకుండా ఆలా నిలుచుంటాడు. అంతే. ప్రియదర్శి అక్కడక్కడా నవ్విస్తాడు. శృతి హాసన్, నేహా శర్మ, నాజర్ మధ్యలో చిన్న పాత్రల్లో కనపడతారు.

Hi-Nanna.jpg

చివరగా, 'హాయ్ నాన్న' సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవటానికి ఏమీ లేదు. ఇంగ్లీష్ సినిమా 'డెఫినిట్లీ మే బి' సినిమా కథని తీసుకొని, దానికే అటు ఇటు కొన్ని మార్పులు చేసి, ఈ కథని తయారుచేసాడు దర్శకుడు. ఒక బలమైన, సంఘర్షణతో కూడిన భావోద్వేగం పాత్రల మధ్య కనపడాలి, కానీ అలాంటివి కనపడవు. చాలా సన్నివేశాల్లో కథని సాగదీసాడు, సినిమాటిక్ సన్నివేశాలు కూడా ఉంటాయి, ముందు బెంచిలో కూర్చున్న వాళ్ళకి ఈ సినిమా ఎక్కకపోవచ్చు.

Updated Date - 2023-12-07T08:51:15+05:30 IST