సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి, పిదప పర్వతరాజైన హిమవంతునికి కుమార్తెగా అవతరించి శైలపుత్రి అను నామము పొందెను

'బ్రహ్మచారిణి' అనగా బ్రహ్మమునందు చరించునది అని అర్థము. ఆ పరమేశ్వరుని భర్తగా పొందటానికి తీవ్రమైన తపస్సు చేసి ఉమ అనే పేరు మీద ప్రసిద్ధి వహించెను

తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెను 'చంద్రఘంట' అనే పేరుతో పిలుస్తారు. 

చిరునవ్వుతో అవలీలగా బ్రహ్మాండమును సృజించునది గావున ఈమెని 'కూష్మాండ' అను పేరుతో పిలిచెదరు. ఈ బ్రహ్మాండములోని సకల వస్తువులలో, ప్రాణులలో గల తేజస్సు ఈమె ఛాయయే.

కుమార స్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు అని ప్రసిద్ధుడైన స్కందుని తల్లియైన దుర్గాదేవిని 'స్కందమాత' పేరుతో నవరాత్రులలో అయిదవ రోజున భక్తులు ఆరాధిస్తారు.

'కాత్యాయనీ మాత' బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి యింట పుత్రికగా అవతరించెను. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల యందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించెను.

'కాళరాత్రి' శరీరవర్ణము చీకటి వలె నల్లగా ఉండును. ఈమె ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించుచుండును, అందువలన ఈమెను 'శుభంకరి' అని కూడా అంటారు. 

పరమశివుని పతిగా పొందుటకు పార్వతీదేవి కఠోరమైన తపస్సు చేయగా ఈమె శరీరము పూర్తిగా నలుపెక్కెను. అప్పుడు శివుడు ప్రసన్నుడై గంగాజలముతో అభిషేకించగా ఈమె శ్వేత వర్ణశోభితయై విద్యుత్కాంతులను విరజిమ్ముచు 'మహాగౌరి' గా పిలవబడెను. 

సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లిగనుక ఈమె 'సిద్ధిదాత్రి'. పరమశివుడు సర్వ సిద్ధులను దేవి కృపవలనే పొందెనని దేవీపురాణమున పేర్కొనబడింది. ఈమె పరమశివునిపై దయదలచి, ఆయన శరీరమున అర్ధబాగమై ఉండెను.