Samantha - Naga Chaithanya: ఆగస్టు 12న సామ్..13న చైతు..!

ABN , First Publish Date - 2022-05-06T16:35:35+05:30 IST

టాలీవుడ్ స్టార్స్ అక్కినేని నాగ చైతన్య, సమంత తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఒక్కరోజు తేడాతో పోటీ పడబోతున్నారు. వీరిద్దరు కలిసి నటించిన మొదటి సినిమా ఏ మాయ చేశావేతో భారీ హిట్ అందున్నారు.

Samantha - Naga Chaithanya: ఆగస్టు 12న సామ్..13న చైతు..!

టాలీవుడ్ స్టార్స్ అక్కినేని నాగ చైతన్య, సమంత తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఒక్కరోజు తేడాతో పోటీ పడబోతున్నారు. వీరిద్దరు కలిసి నటించిన మొదటి సినిమా ఏ మాయ చేశావేతో భారీ హిట్ అందున్నారు. అంతేకాదు, ఇదే సినిమాతో ప్రేమలోనూ పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీ కాంబినేషన్‌గా మారిన చై - సామ్ ఆ తర్వాత ఇరు కుటుంబాల సమక్షంలో ఘనంగా రెండు మత సాంప్రదాయాల ప్రకారం గోవాలో వివాహం చేసుకొని ఒక్కటైన విషయం..ఆ తర్వాత అనూహ్యంగా విడాకులు తీసుకున్న సంగతి..దీని తర్వాత జరిగిన అన్నీ వ్యవహారాలు తెలిసినవే.


ఈ నేపథ్యంలో ఏదో రకంగా సమంత, నాగ చైతన్యలకు సంబంధించిన వార్తలు వచ్చి సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. సామ్ తన ఇన్స్టా స్టోరీలో పెట్టిన కామెంట్స్ చూస్తున్న నెటిజన్స్..ఇది చైతూను ఉద్దేశించేనా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాను ఆగస్ట్ 13న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. చైతూ కీలక పాత్రను పోషించాడు.


పలు వాయిదాల తర్వాత ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ఎప్పుడో మేకర్స్ తేదీని ప్రకటించారు. అయితే, సమంత ప్రధాన పాత్రలో దర్శక ద్వయం హరి - హరీష్ రూపొందిస్తున్న యశోద సినిమాను ఒక్కరోజు ముందుగా (ఆగస్ట్ 12) రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి చిత్రబృందం ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌లో సమంతను చూస్తే మరోసారి కొత్త తరహా పాత్రలో కనిపించబోతుందని అర్థమవుతోంది. విలక్షణ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే, ఈ రెండు చిత్రాల విడుదల తేదీలను పరిశీలిస్తే నాగ చైతన్య, సమంత తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు రెడీ అవుతున్నారని అర్థమవుతోంది. చూడాలి మరి ఈ రెండు సినిమాలతో ఎవరు ఎలాంటి సక్సెస్ అందుకుంటారో.  

Updated Date - 2022-05-06T16:35:35+05:30 IST