Oscars 2022: స్టేజ్ మీదే కమెడియన్ చెంప పగలగొట్టిన ఉత్తమ నటుడు అవార్డు విజేత.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-03-28T18:02:52+05:30 IST

అమెరికాలోని లాస్ ఎంజెల్స్‌లో 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం మార్చి 27న ఎంతో ఘనంగా..

Oscars 2022: స్టేజ్ మీదే కమెడియన్ చెంప పగలగొట్టిన ఉత్తమ నటుడు అవార్డు విజేత.. అసలేం జరిగిందంటే..

అమెరికాలోని లాస్ ఎంజెల్స్‌లో 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం మార్చి 27న ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ నటుడు విల్ స్మిత్, కింగ్ రిచర్డ్ అనే సినిమాకిగానూ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నాడు. అయితే ఈ షోలోనే స్టేజ్ మీద మరో నటుడు, షో హోస్ట్‌ని ఈ యాక్టర్ కొట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


అందులో.. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ అవార్డుని ప్రకటించడానికి ప్రముఖ కమెడియన్, షో హోస్ట్ క్రిస్ రాక్ స్టేజ్ పైకి వచ్చాడు. అయితే విజేతని ప్రకటించడానికి ముందు ఈ కమెడియన్ అక్కడే ఉన్న విల్‌స్మిత్‌ని చూస్తూ ఆయన భార్య జడా పింకెట్ స్మిత్‌ని ఓ హాలీవుడ్ సినిమాలోని క్యారెక్టర్‌తో పోల్చుతూ జోక్ చేశాడు. ‘జీ.ఐ.జెన్’ చిత్రంలో ఓ పాత్ర పూర్తిగా గుండుతో ఉంటుంది. అచ్చం అలాగే పింకెట్ స్మిత్ కూడా గుండుతో ఉంటుంది. అయితే.. దీనికి కారణం ఆమెకి ఉన్న ‘అలోపెసియా’ అనే వ్యాధి. అది ఉన్న వారికి జుట్టు ఊడిపోతుంటుంది. దీంతో పింకెట్‌ని ఆ పాత్రతో పోల్చడమే కాకుండా ఈ సినిమా సీక్వెల్‌లో తనని చూడాలనుకుంటున్నట్లు జోక్ చేశాడు. ఇది విల్ స్మిత్ కోపానికి కారణమైంది. దీంతో అతడు స్జేజ్ పైకి వెళ్లి క్రిస్ చెంప మీద గట్టిగా కొట్టాడు.


అంతేకాకుండా ఆయన్ని బూతులు తీడుతూ.. ‘నీ నోటి నుంచి నా భార్య పేరు బయటికి వస్తే బాగుండదు’ అంటూ కోపంగా స్మిత్ అరిచాడు. దీంతో ఏం చేయాలో తెలియని క్రిస్ చూస్తూ ఉండిపోయాడు. అయితే.. వైరల్‌గా మారిన ఈ వీడియోపై ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది. ఇది జెన్యూన్‌గా జరిగిందా.. లేక స్క్రిప్టెడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. అనంతరం బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న స్మిత్ మాట్లాడుతూ కమెడియన్‌కి క్షమాపణలు తెలిపాడు.

Updated Date - 2022-03-28T18:02:52+05:30 IST