Anil Ravipudi : మరో శ్రీను వైట్ల అవుతాడా? లేక మరో ఇవివి అవుతాడా?

ABN , First Publish Date - 2022-08-29T17:08:48+05:30 IST

టాలీవుడ్ అజేయ దర్శకుల్లో రాజమౌళి (Rajamouli) తర్వాత వినిపించే మరో పేరు అనిల్ రావిపూడి (Anil Ravipudi). ‘పటాస్’ (Patas) తో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తొలి ప్రయత్నంలోనే సూపర్ సక్సెస్ అందుకున్నాడు.

Anil Ravipudi : మరో శ్రీను వైట్ల అవుతాడా? లేక  మరో ఇవివి అవుతాడా?

‘పటాస్’ (Patas)తో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తొలి ప్రయత్నంలోనే సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత నుంచి అనిల్‌కు టాలీవుడ్ లో ఇక తిరుగే లేకుండా పోయింది. అనిల్‌లో కావల్సినంత సెన్సాఫ్ హ్యూమర్, బోలెడంత సెటైర్ ఉన్నాయి. వాటినే తన ప్రధాన బలంగా చేసుకొని సినిమా, సినిమాకు ఎదుగుతూ.. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకడయ్యాడు. స్వతహాగా కథకుడవడం వల్ల అనిల్ రావిపూడికి కథాకథనాల మీద మంచి గ్రిప్ అలవడింది. పక్కా యాక్షన్ సినిమా అయినా.. సాధారణ ఫ్యామిలీ చిత్రమైనా అనిల్ సినిమాల్లో ప్రధానంగా కామెడీ ఉండాల్సిందే. ప్రస్తుత జెనరేషన్‌కు వినోదం బోలెడు సోర్సెస్ లో దొరుకుతోంది. ఒక పక్క జబర్దస్త్ లాంటి కామెడీ షోస్, మరో పక్క యూట్యూబ్ లోని కామెడీ సిరీస్ ఇలా రకరకాల మాధ్యమాల ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్ లభిస్తోంది. ఇలాంటి టైమ్ లో తన కామెడీ చిత్రాలతో జనాన్ని థియేటర్స్‌కు రప్పించాలంటే.. వాటిలో సమ్ థింగ్ స్పెషల్ ఉండాలని అనిల్ ఎప్పటికప్పుడు అలోచించి.. దానికి అనుగుణంగా అప్డేట్ అవుతుంటాడు. అందుకే ఇప్పటి వరకూ అతడు నాన్ స్టాప్ గా కామెడీ చిత్రాలతోనే సక్సెస్ అందుకోగలిగాడు. 


ఇంతకు ముందు దర్శకుడు శ్రీను వైట్ల (Srinu Vaitla) ఇలాగే కామెడీ చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్నాడు. అయితే రాను రాను అతడి కామెడీ జనానికి బోర్ కొట్టేసింది. ఒకే ఫార్మేట్ లో స్ఫూఫ్ కామెడీతో.. ఎవరినో ఒకరిని బకారా చేసి.. హీరోలచేత కామెడీని పండించాలని చూసి దెబ్బతిన్నాడు. అనిల్‌లా శ్రీను వైట్ల రైటర్ కాదు. అతడి దగ్గర చాలా మంది రైటర్స్ ఉండేవారు. కొంతకాలం ఒకే టెక్నికల్ టీమ్ తో రొటీన్ సినిమాలు తీశాడు. ఆ తర్వాత టీమ్ ను మార్చి అవే కథలు వండాడు. ఆ కారణంగా ఒక దశలో వరుస పరాజయాలు చవిచూశాడు.  ఫలితంగా శ్రీను వైట్ల  సరైన ఆఫర్స్ రాక, చిన్న హీరోలు కూడా దొరక్క దాదాపు తెరమరుగైపోయాడు. అయినా సరే పెద్ద హీరోలతో మళ్ళీ సినిమాలు తీసి.. ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. శ్రీను వైట్ల సరైన సక్సెస్ అందుకొని చాలా కాలమే అయింది. 


అనిల్ రావిపూడి కూడా .. ఏదో ఒక రోజు శ్రీను వైట్ల బాటే పడతాడేమోనని చాలా మందికి సందేహం ఉంది. అయితే అనిల్ రావిపూడిలో ఉన్నది, శ్రీను వైట్లలో లేని క్వాలిటీ ఏంటంటే..  అనిల్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాడు. ప్రేక్షకుల మైండ్ సెట్ కు అనుగుణంగా కథలు వండుతాడు. వెరైటీ పాత్రలతో, రకరకాల మ్యానరిజమ్స్ తో .. వారిలో హావభావాలు పలికిస్తూ.. లౌడ్ కామెడికి ప్రిఫరెన్స్‌నిస్తూ సినిమాలు తెరకెక్కిస్తాడు. ఇదే క్వాలిటీ గతంలో దర్శకుడు ఇవివి సత్యనారాయణ (EVV Satyanarayana) కుండేది. జంధ్యాల (Jandhyala) స్కూల్ నుంచి రావడం వల్ల ఆయనకి కామెడీమీద బాగా పట్టుదొరికింది. తన దగ్గరున్న రైటర్స్ చేత అద్భుతమైన కామెడీ డైలాగ్స్ రాయించి.. వెరైటీ సినిమాలు తీసి.. టాలీవుడ్ లో తనదైన ముద్రవేశాడు. ఇవివి తను చనిపోయే వరకూ హిట్ సినిమాలు తీశారు. సో.. అనిల్ రావిపూడి.. రొటీన్ కామెడీ జోలికి పోనంత కాలం.. టాలీవుడ్‌లో దర్శకుడిగా అజేయంగా కొనసాగుతుతాడని చెప్పొచ్చు.

Updated Date - 2022-08-29T17:08:48+05:30 IST