దక్షిణాదికి దీటుగా బాలీవుడ్ ఎందుకు సినిమాలు నిర్మించలేకపోతుంది..!

ABN , First Publish Date - 2022-06-16T22:18:30+05:30 IST

బాలీవుడ్‌లో సౌత్ సినిమాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ‘బాహుబలి’(Bahubali) ప్రాంచైజీతో మొదలైన కలెక్షన్ల పర్వం ఇంకా కొనసాగుతునే ఉంది. దక్షిణాది నుంచి హిందీలోకి డబ్ అయిన

దక్షిణాదికి దీటుగా బాలీవుడ్ ఎందుకు సినిమాలు నిర్మించలేకపోతుంది..!

బాలీవుడ్‌లో సౌత్ సినిమాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ‘బాహుబలి’(Bahubali) ప్రాంచైజీతో మొదలైన కలెక్షన్ల పర్వం ఇంకా కొనసాగుతునే ఉంది. దక్షిణాది నుంచి హిందీలోకి డబ్ అయిన ‘కెజియఫ్’(KGF), ‘పుష్ప’(Pushpa), ‘ఆర్‌ఆర్‌ఆర్’(RRR) బీ టౌన్‌లో భారీ స్థాయి కలెక్షన్స్‌ను కొల్లగొట్టాయి. ఫలితంగా సౌత్ వర్సెస్ బాలీవుడ్ అనే టాపిక్‌పై జోరుగా చర్చ జరగుతోంది. 


‘సూర్యవంశీ’, ‘భూల్ భూలయ్యా-2’ మాత్రమే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి. స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ కూడా పరాజయం పాలైంది. ఈ చిత్రం ప్రేక్షకులను ఆశించిన మేర మెప్పించలేకపోయింది. దక్షిణాది సినిమాలు మాత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 1000కోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధిస్తున్నాయి. కానీ, బాలీవుడ్ మాత్రం రూ. 100కోట్లు, రూ.200కోట్లు, రూ. 300కోట్ల క్లబ్ గురించి మాట్లాడుతుంది. ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమా మాత్రం ఈ కేటగీరిలోకి రాదు. ఈ చిత్ర దర్శకుడైన వివేక్ రంజన్ అగ్నిహోత్రి తనకు తాను ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్‌గా చెప్పుకుంటున్నాడు. ఇండస్ట్రీకి భిన్నంగా తన సినిమాలు ఉంటాయని చెబుతున్నాడు. వివేక్ అగ్నిహోత్రి ఎప్పుడు స్టార్స్ లేకుండానే కథను మాత్రమే నమ్ముకుని సినిమాలు చేస్తున్నాడు. అతడు వచ్చే ఏడాది ‘ద ఢిల్లీ ఫైల్స్’ చిత్రాన్ని రూపొందిస్తానని తెలిపాడు. ఈ మూవీ కూడా రియల్ ఘటనల ఆధారంగానే ఉంటుందని పేర్కొన్నాడు. 


బాలీవుడ్‌లో శరవేగంగా సినిమాలు చేసే నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). అతడు తాజాగా నటించిన సినిమా ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ (Samrat Prithviraj). మానుషి చిల్లర్ (Manushi Chhillar) హీరోయిన్‌గా నటించింది. చంద్ర ప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) రూ. 200కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా హిందీతో పాటు తెలుగు, తమిళంలో జూన్ 3న విడుదల అయింది.  సినిమాకు మిక్స్‌డ్ రివ్యూస్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర విజయం సాధించలేదు. అంతకు ముందు అక్షయ్ నటించిన ‘బచ్చన్ పాండే’ సైతం  బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తమిళ మూవీ ‘జిగర్తాండ’ కు రీమేక్‌గా ఇది రూపొందింది. ఈ సినిమా కూడా పూర్తి రన్‌లో రూ. 14కోట్ల వసూళ్లను రాబట్టింది. ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ ఇప్పటి వరకు రూ. 63కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. కంగన నటించిన ‘ధాకడ్’ అయితే రూ. 4కోట్లను మాత్రమే వసూళ్లు చేసింది. 


అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా ‘పుష్ప: ది రైజ్’. లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించాడు. ఈ చిత్రం సాధించిన విజయంతో బీ టౌన్ సర్‌ప్రైజ్ అయింది. ఎటువంటి ప్రమోషన్స్ చేయకుండా ఈ చిత్రాన్ని అక్కడ విడుదల చేస్తే రూ. 100కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ‘పుష్ప’ ను రూ. 200కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తే, రూ. 365కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ‘83’ సినిమాని రూ. 270కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తే, రూ. 190కోట్లను మాత్రమే రాబట్టడం విశేషం. కథకు ప్రాధాన్యం ఇచ్చి ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ప్రాజెక్టులు రూపొందిస్తుండటంతో సౌత్ సినిమాలు విజయం సాధిస్తున్నాయి. బాలీవుడ్‌లో కథ మీద దృష్టి సారించడం లేదు. కీలక పాత్రల రెమ్యూనరేషన్‌కు మాత్రమే అధికంగా డబ్బులను వెచ్చిస్తున్నారు. విజన్ కూడా లేకపోవడంతో హిందీ సినిమాలు పరాజయం పాలవుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాదివారు హిందీ శాటిలైట్ ఛానల్స్‌కు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ఛానళ్లు సౌత్ డబ్బింగ్ సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. దక్షిణాదివారిని అక్కడి ప్రేక్షకులకు చేరువ చేశాయి. యూ‌ట్యూబ్‌లో కూడా సౌత్ సినిమాల డబ్బింగ్ వెర్షన్స్ 100మిలియన్స్‌ను సులభంగా క్రాస్ చేస్తున్నాయి.  

Updated Date - 2022-06-16T22:18:30+05:30 IST