మంచు విష్ణు తరువాతి స్టెప్ ఏంటి? మోహన్ బాబు రియాక్షన్ ఏంటి?

ABN , First Publish Date - 2021-10-13T01:59:08+05:30 IST

‘మా’ ఎన్నికల నేపథ్యంలో ‘ప్రకాశ్ రాజ్’ ముసలం ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన సీనియర్ నటుడ్ని చాలా మంది పోలింగ్‌కి ముందు నాన్ లోకల్ అంటూ వ్యాఖ్యానించారు. ఆయన ఓటమికి ఆ ఆరోపణ ప్రధాన కారణమని ఇప్పుడు వాదన బలంగా వినిపిస్తోంది.

మంచు విష్ణు తరువాతి స్టెప్ ఏంటి? మోహన్ బాబు రియాక్షన్ ఏంటి?

‘మా’ ఎన్నికల నేపథ్యంలో ‘ప్రకాశ్ రాజ్’ ముసలం ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన సీనియర్ నటుడ్ని చాలా మంది పోలింగ్‌కి ముందు నాన్ లోకల్ అంటూ వ్యాఖ్యానించారు. ఆయన ఓటమికి ఆ ఆరోపణ ప్రధాన కారణమని ఇప్పుడు వాదన బలంగా వినిపిస్తోంది. అయితే, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తరుఫున గెలిచిన వారంతా తమ పదవులకి రాజీనామా చేసి మరో సంచలనానికి తెర తీశారు. ఇక మీదట తాము మా సభ్యులుగా మాత్రమే కొనసాగుతూ మంచు విష్ణు చర్యల్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తామని సూటిగానే చెప్పారు. అంటే, ముందు ముందు ప్రకాశ్ రాజ్ వర్సెస్ విష్ణు వార్ తీవ్రంగానే కొనసాగనుందని మనం భావించవచ్చు...


నిజానికి ఎన్నికల ఫలితాల తరువాత కూడా విమర్శలు, ప్రతి విమర్శల హోరు కొనసాగుతుండటంతో చాలా మంది ‘మా’కి ధీటుగా మరో ‘మెగా’ అసోసియేషన్ పుడుతుందని భావించారు. ‘ఆత్మ’ అనే పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ప్రకాశ్ రాజ్‌తో పాటూ మరికొంత మంది ఆర్టిస్టులు ‘మా’ నుంచీ బయటకు వచ్చి వేరు కుంపటి పెడతారని బలంగా వినిపించింది. కానీ, అటువంటిదేమీ ఉండదని ఇప్పుడు తేలిపోయింది. అయితే, అసలు తేలాల్సిన విషయం ఏంటంటే... ప్రకాశ్ రాజ్ టీమ్ మొత్తం రాజీనామాలు చేశాక విష్ణు, మోహన్ బాబు ఎలా స్పందిచబోతున్నారు? మరీ ముఖ్యంగా, ప్రకాశ్ రాజ్ చేసిన కీలక కామెంట్‌పై మా అధ్యక్షుడు విష్ణు ఏమంటారు? ఇదే చర్చగా మారింది. 


ప్రకాశ్ రాజ్ తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించే సమయంలో ‘‘ఈ ఒక్క షరతుకు అంగీకరిస్తే నేను రాజీనామా ఉపసంహరించుకుంటాను’’ అన్నారు. తెలుగు వాడు కానీ ఎవ్వరూ, ‘మా’ అధ్యక్షుడు అవ్వటానికి వీల్లేకుండా, బై లాస్‌లో మార్పులు తీసుకురానని విష్ణు హామీ ఇవ్వాలి అన్నారు! దీనర్థం ‘మా’లో పూర్తి మెజార్టీ ఉన్న విష్ణు నెక్ట్స్ బై లాస్ ఛేంజ్ చేయబోతున్నారా? ఆ సమాచారం ఉండటంతోనే ప్రకాశ్ రాజ్ ఈ ప్రస్తావన తెచ్చారా? ఇక మీదట ఎప్పుడూ తెలుగు వారి కాని ఎవ్వరూ ‘మా’ అధ్యక్ష పీఠం ఎక్కకుండా మోహన్ బాబు వారసుడు పావులు కదుపుతారా? ఇంత వరకూ విష్ణు అలా చేస్తానని ఎక్కడా అనలేదు. కానీ, ప్రకాశ్ రాజ్ ప్రత్యేకంగా ఆ షరతు విధించి, దానికి తన రాజీనామాకి లింక్ పెట్టారు. అందుకే, ఇప్పుడు అందరూ మంచు ఫ్యామిలీ రెస్పాన్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోహన్ బాబు, విష్ణు ఏం మాట్లాడతారా అని వెయిట్ చేస్తున్నారు. 


‘మా’ ఎన్నికలు ముగిసినా మరికొద్ది కాలం లోకల్, నాన్ లోకల్ ఇష్యూ హాట్ టాపిక్‌గా కొనసాగే సూచనలైతే కనిపిస్తున్నాయి. వివాదం ముదిరితే ‘మా’ చీలిక కూడా అనివార్యం అవుతుందేమో...    

Updated Date - 2021-10-13T01:59:08+05:30 IST