ఆ సినిమాకు సోనూ సూద్‌ పారితోషికం ఎంత?

ABN , First Publish Date - 2022-08-21T06:06:15+05:30 IST

కేవలం వ్యాపార పరంగానే ఆలోచించకుండా, చక్కని అభిరుచితో చిత్రాలు నిర్మించే నిర్మాతలు కొందరు ఉంటారు. వారిలో శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి ఒకరు. ఆయన తీసినవన్నీ విభిన్న చిత్రాలే. సినిమా తీయడానికి

ఆ సినిమాకు సోనూ సూద్‌ పారితోషికం ఎంత?

కేవలం వ్యాపార పరంగానే ఆలోచించకుండా, చక్కని అభిరుచితో చిత్రాలు నిర్మించే నిర్మాతలు కొందరు ఉంటారు. వారిలో శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి ఒకరు. ఆయన తీసినవన్నీ విభిన్న చిత్రాలే. సినిమా తీయడానికి ఓ టైమ్‌ లిమిట్‌ పెట్టుకోకుండా తను అనుకున్న విధంగా సినిమా వచ్చే వరకూ ఎంతకాలమైనా వర్క్‌ చేస్తుండడం ఆయన పద్ధతి. అలా శ్యామ్‌ తీసిన సినిమాల్లో ‘అరుంధతి’ ఒకటి. రొటీన్‌ సినిమాలకు భిన్నంగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రం అనుష్క కెరీర్‌ను సరికొత్త మలుపు తిప్పింది. అనుష్క కంటే ముందు చాలా మంది పేర్లు అనుకున్నారు. కొంతమందిని సంప్రదించారు కూడా.


అయితే ఐదు అడుగుల పది అంగుళాల ఎత్తు కలిగి, రాయల్‌ లుక్‌ ఉన్న నటి కావాలి కనుక నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి రాజీపడలేదు. చివరకు నిర్మాత జెమినీ కిరణ్‌ సూచనపై ‘సూపర్‌’ చిత్రంలో నటించిన అనుష్కను చూసి ఓకే అనుకున్నారు. అయితే వెంటనే ఆమెకు ఆ విషయం చెప్పకుండా రకరకాల ఆడిషన్స్‌ చేసి చివరకు ఫైనలైజ్‌ చేశారు. 


పశుపతి బదులు సోనూసూద్‌

ఈ చిత్రంలో మరో కీలకమైంది సోనూ సూద్‌ పోషించిన పశుపతి పాత్ర. ఈ వేషానికి మొదట తమిళ నటుడు పశుపతిని అనుకున్నారు. ఆ పాత్రకు ఆ పేరు పెట్టడానికి కూడా కారణం అదే. అఘోరా పాత్రకు పశుపతి చక్కగా సూట్‌ అవుతాడు కానీ సినిమాలో రాజుగా కనిపించే సీన్లు కొన్ని ఉన్నాయి. అందుకే ఆలోచనలో పడ్డారు శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి. ఆ సమయంలోనే జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన ‘అశోక్‌’ చిత్రం విడుదల అయింది. అందులో విలన్‌గా నటించిన సోనూ సూద్‌ శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి దృష్టిని ఆకర్షించారు. అయితే అఘోరా గెటప్‌ స్కెచ్‌ను చూపించగానే ఆ పాత్ర తను చెయ్యనని చెప్పేశారు సోనూ సూద్‌.


ఒకసారి గెటప్‌ వేసుకోమని, మేకప్‌ టెస్ట్‌ చేసిన తర్వాత కూడా నచ్చకపోతే మరో నటుడిని తీసుకుంటానని చెప్పి అతన్ని కన్విన్స్‌ చేశారు శ్యామ్‌. అయిష్టంగానే అంగీకరించారు సోనూ సూద్‌. కమల్‌ హాసన్‌ నటించిన ‘దశావతారం’ చిత్రానికి వర్క్‌ చేసిన రూపశిల్పి రమేశ్‌ను చెన్నై నుంచి పిలిపించి ఆయనతో సోనూ సూద్‌కు అఘోరా గెటప్‌ వేయించారు శ్యామ్‌. మేకప్‌ కోసమే ఆయనకు ఆరు గంటలు పట్టింది. ఆ పాత్ర చేయడం తనకు ఇష్టం లేకపోయినా శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి తపన చూసి చివరకు అంగీకరించారు సోనూ సూద్‌. 20 రోజుల్లో ఆయన వర్క్‌ పూర్తి చేస్తామని శ్యామ్‌ చెప్పగానే,  రూ. 18 లక్షలు పారితోషికంగా ఇవ్వమని డిమాండ్‌ చేశారు సోనూ సూద్‌. . ఆయన మరో ఆప్షన్‌ కూడా ఇచ్చారు.. రూ. 20 లక్షలు ఇస్తే ఎన్ని రోజులైనా పని చేస్తానని చెప్పారు.


కానీ  శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి ఒప్పుకోలేదు. 20 రోజుల్లోనే అతని వర్క్‌ పూర్తి చేస్తాననీ, రూ. 18 లక్షలు ఇస్తాననీ చెప్పారు. ఒక వేళ 20 రోజుల్లో వర్క్‌ పూర్తి కాకపోతే, ఆ తర్వాత ఎన్ని రోజులు ఎక్కువ వర్క్‌ చేస్తే రోజుకి రూ 25 వేలు ఇస్తానని చెప్పారు శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి. అయితే అనుకున్నట్లుగా 20 రోజుల్లో సోసూ సూద్‌ వర్క్‌ పూర్తి కాలేదు. చివరకు ‘అరుంధతి’ చిత్రం ద్వారా సోసూ సూద్‌కు లభించిన పారితోషికం ఎంతో తెలుసా... రూ 45  లక్షలు. 

Updated Date - 2022-08-21T06:06:15+05:30 IST