‘వాంటెడ్ పండుగాడ్’ రివ్యూ: ఈ కామెడీ షోకి.. వాంటెడ్ ప్రేక్షకులు!

ABN , First Publish Date - 2022-08-19T23:40:51+05:30 IST

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు (K Raghavendra Rao) కి తెలుగు సినిమా చరిత్రలో ఒక సమున్నత స్థానం వుంది. అతను నూరుకి పైగా చిత్రాలు దర్శకత్వం చేసి ఒక లెజెండరీ దర్శకుడిగా పేరు

‘వాంటెడ్ పండుగాడ్’ రివ్యూ: ఈ కామెడీ షోకి.. వాంటెడ్ ప్రేక్షకులు!

సినిమా: వాంటెడ్ పండుగాడ్ (Wanted PanduGod)

విడుదల తేదీ: 19 ఆగస్ట్, 2022 

నటీనటులు: సునీల్, సుధీర్, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, అనసూయ, తనికెళ్ళ భరణి, ఆమని, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి తదితరులు

కథ మరియు రచన: జనార్దన్ మహర్షి

సంగీతం: పి ఆర్

నిర్మాతలు: సాయిబాబా కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి

దర్శకుడు: శ్రీధర్ సీపాన

రేటింగ్: 1


దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు (K Raghavendra Rao) కి తెలుగు సినిమా చరిత్రలో ఒక సమున్నత స్థానం వుంది. అతను నూరుకి పైగా చిత్రాలు దర్శకత్వం చేసి ఒక లెజెండరీ దర్శకుడిగా పేరు పొందారు. అటువంటి రాఘవేంద్రరావు ఒక సినిమాకి పర్యవేక్షణ చేయటమే కాకుండా.. ఆ సినిమాని ప్రెసెంట్ కూడా చేస్తున్నారు అంటే, ఆ సినిమా మీద కొంచెం అంచనాలు ఉంటాయి. ఈసారి ఆయన ‘వాంటెడ్ పండుగాడ్ (Wanted PanduGod)’ అనే సినిమా ప్రెసెంట్ చేసారు. దీనికి శ్రీధర్ సీపాన దర్శకుడు. జబర్దస్త్ షోలో బాగా ప్రాచుర్యం పొందిన కమెడియన్ సుధీర్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేశాడు. (Wanted PanduGod Review)


కథ:

ఇక కథ విషయానికి వస్తే ఇందులో పెద్దగా చెప్పుకోడానికి ఏమిలేదు. పండుగాడు (సునీల్) అనే ఖైదీ జైలు నుంచి తప్పించుకొని అడవిలోకి పారిపోతాడు. వాడిని పట్టి ఇచ్చిన వారికి కోటి రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటిస్తుంది ప్రభుత్వం. ఈ ప్రకటన చూసి పండుని పట్టుకొని ఆ డబ్బుతో వాళ్ళకి వున్న ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకోవచ్చని అనుకొని.. ఏడు గ్రూపులు అడవికి బయలుదేరుతాయి. అక్కడ ఒక్కొక్కరు ఒక్కో విధంగా కలుసుకుంటారు. చివరికి వాళ్లలో ఎవరికీ పండుగాడు చిక్కాడు, అసలు పండుగాడు దొరికాడా లేదా? అన్నది వెండి తెరపైన చూడాల్సిందే.


విశ్లేషణ:

ఈమధ్య తెలుగు చానెల్స్‌లో కొన్ని కామెడీ షోస్ విశేషంగా ఆకర్షింపబడుతున్నాయి. అవి వాళ్ళు యూట్యూబ్‌లో పెట్టడం వల్ల జనాలు బాగా చూస్తున్నారు. అందువల్ల ఇలాంటి ఒక కామెడీ షోనే సినిమాగా తీస్తే బాగుంటుంది అన్న ఆలోచన తెలుగు చలన చిత్ర సీమలో కొన్ని దశాబ్దాల పాటు తన చిత్రాలతో అలరించిన రాఘవేంద్రరావు అనుకొని వుంటారు. దీనికి జనార్ధన మహర్షి కథ మరియు మాటలు ఇచ్చారు, శ్రీధర్ సీపాన దర్శకత్వం చేశారు. రాఘవేంద్రరావు పర్యవేక్షణ అంటే సగటు ప్రేక్షకుడు కొంచెం అయినా బాగుంటుంది అని నమ్మి.. ఈ సినిమాకి వెళ్దామనుకుంటే, వారికి చాలా నిరాశే మిగులుతుంది. ఎందుకంటే సినిమాలో పనికొచ్చిన సీన్ ఒక్కటి కూడా లేదు. కామెడీ సినిమా అన్న మాటే గానీ, ఒక్క కామెడీ సీన్ కూడా పండదు. చాలామంది జబర్దస్త్ నటులు ఇందులో కనపడతారు. అలాగే కొంచెం పాపులర్ నటులు అయిన అనసూయ (Anasuya) వంటి వాళ్ళు కూడా వున్నారు. కానీ ఆమె పాపులారిటీని వాడుకోవటానికే ఆమెని తీసుకున్నారే తప్ప, ఆమెకి అంత ప్రాముఖ్యత ఉన్న పాత్ర ఇవ్వలేదు.


జబర్దస్త్ షోతో పాపులర్ అయిన సుధీర్‌ (Sudheer)ని కూడా కేవలం సొమ్ము చేసుకునేందుకు వాడుకున్నారు కానీ.. అతనికి కూడా పెద్దగా చెప్పుకోదగ్గ రోల్ ఇవ్వలేదు. కమెడియన్స్ అందరిని పెట్టి ఏవో కొన్ని సీన్స్ రాసేస్తే జబర్దస్త్ లాగా హిట్ అయిపోతుందనుకుంటే అంతకన్నా దారుణమయిన ఆలోచన లేదు. శ్రీధర్ సీపాన దర్శకుడు అనే మాటే గానీ అంత రాఘవేంద్రరావు చేసినట్టుగానే కనపడుతోంది. ‘సినిమా చుట్టేశారు..’ అనే కామెంట్ మనం వింటూనే ఉంటాం, అది కచ్చితంగా ఈ సినిమాకి వర్తిస్తుంది. కథ పెద్దగా లేదు, పాటలు అస్సలు బాగోలేవు, దానికి తోడు ఒక్క సీన్ కూడా బాగోలేకపోవటంతో మనం సినిమా చూస్తున్నామా, లేక ఏదైనా టీవీ షో చూస్తున్నామా...? అనే సందేహం కలుగుతుంది. ఈ సినిమాకి బదులు టీవీలో వచ్చే ఆ కామెడీ షోనే చాలా బెటర్‌గా ఉంటుంది. కొంచెం వల్గర్ గా వున్నా కూడా ఆ టీవీ షోని ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఈ సినిమాని మాత్రం అస్సలు భరించలేము.


వందకి పైగా సినిమాలు చేసిన లెజెండరీ దర్శకుడు రాఘవేంద్రరావు ఇలాంటి చెత్త సినిమా కథని ఎలా అంగీకరించారు.. ఎలా ప్రొడ్యూస్ చేశారు? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇలాంటి సినిమాల పర్యవేక్షణ, ప్రెసెంటేషన్ చేస్తూ ఉంటే ఆయన మీద వున్న గౌరవం పోతుంది. 


ఇంకా నటీనటులు ఎలా చేశారు అన్న విషయం ఎక్కువ వివరించనక్కరలేదు. ఎవరికీ పెద్దగా రోల్ లేదు, కానీ కనిపించిన ప్రతీ సారీ అందరూ తమ ఓవర్ యాక్టింగ్‌తో విసిగించటం తప్ప ఇంకేమి చెయ్యలేదు. రాఘవేంద్రరావు పేరు చూసి ఈ నటీనటులు అందరూ ఇందులో చేయడానికి వొప్పుకున్నారేమో అనిపిస్తుంది. కానీ వాళ్ళకి కెరీర్ పరంగా ఈ సినిమా ఎందుకూ పనికిరాదు. ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అత్యంత అనుభవం వున్న వాళ్లే ఇలాంటి చెత్త సినిమాలు తీయటం ఎందుకు? మళ్ళీ ప్రేక్షకులు సినిమా హాలుకి రావటం లేదు అని గోలపెట్టడం ఎందుకు? ‘కంటెంట్ మాత్రమే కింగ్’ అని మైకులు ముందు చెప్పే వాళ్ళు ఆ కంటెంట్ లేకపోతే సినిమా ఆడదు అని తెలియదా?

దీని కన్నా ఆ జబర్దస్త్ షో చాలా నయం. రాఘవేంద్రరావు గారూ! మీరు ఇంకో సినిమా చేసే ముందు బాగా అలోచించి నిర్ణయం తీసుకోండి. వంద సినిమాలు చేసిన మీకు ఒక ప్రత్యేక స్థానం వుంది. అది పోగొట్టుకోకండి. (Wanted PanduGod Review)


ట్యాగ్‌లైన్: అడుగడుగునా హాస్యాస్పదం

-సురేష్ కవిరాయని

Updated Date - 2022-08-19T23:40:51+05:30 IST